ప్రకాశం బ్యారేజి పై ఉద్రిక్తత... మీద చేయి వేస్తే దూకేస్తాం...

ఎపి రాజధాని అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు 400 రోజులకు పైగా ఎండనక, వాననక ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా రాజధాని ప్రాంత మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతుఅండగా ప్రకాశం బ్యారేజ్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, మహిళా రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా దినోత్సవం అని కూడా చూడకుండా సీఎం జగన్, డీజీపీ తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆ మహిళలు మండిపడ్డారు. ఇదే సందర్భంలో ఎవరైనా తమపై చేయి వేస్తే ప్రకాశం బ్యారేజీలో దూకుతామని పోలీసులను హెచ్చరించారు. తాము అమ్మవారి దర్శనానికి వెళుతుంటే ఈ విధంగా అక్రమంగా అడ్డుకుంటున్నారని.. వారు విమర్శించారు. అంటేకూండా ఇప్పటికే భూములు ఎలాగూ కోల్పోయామని, ఇక బతకడం అనవసరమని, ప్రకాశం బ్యారేజ్‌లో దూకి చనిపోతామని ఏవరు ఆవిడెదన ౫వ్య౫క్తం చేసారు. రాజధాని కోసం తాము నిరసన తెలుపుతుంటే ప్రజలు చూసి వెళ్లిపోతున్నారే కానీ ఎమాత్రం స్పందించడంలేదని.. ఇది సిగ్గుచేటని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు        

తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేదా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారా? అంటే అవుననే చెబుతున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి గుండె విజయ రామారావు. తెలంగాణ మలి దశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, కేసీఆర్ తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు తెలంగాణ రావాలని లేకుండేనని చెప్పారు.  ఉద్యమ ఒత్తిడితో సమైక్య ఆంధ్రలో ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకున్నారని విజయరామారావు తెలిపారు. శాసనసభను నడవనీయకుండా అడ్డుకుని.. ఉద్యమం ఎగిసినట్టు చూపించి సమైక్య రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ అనుకున్నారంటూ కామెంట్ చేశారు.  వరంగల్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న విజయరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ అజెండాలు అన్ని ఉత్తీత్తవేనని.. ఓట్లు దండుకోవడం కోసమేనని తెలిపారు. తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారని, ఉద్యమకారులను గెంటి వేశారని విజయరామారావు అన్నారు. ఉద్యమంలో లేని కేటీఆర్.. ఉద్యమకారుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యమకారుడు మహేందర్ రెడ్డి ని చివరి నిమిషం వరకు నమ్మించి.. ఆ టికెట్ పై పోటీ చేసి కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని విజయరామారావు ఆరోపించారు.  ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నవిషయం తెలియదా అని విజయరామారావు ప్రశ్నించారు. కేసీఆర్  ద్రోహం చేస్తేనే బాపురావు బిజెపి లో చేరారని చెప్పారు. పార్లమెంట్ లో మద్దతు లేకపోతే బిల్లు వచ్చేదా అని నిలదీశారు. అమెరికాలో కవితకు యాక్సిడెంట్ అయినా.. ఆమెను ఇక్కడికి తీసుకురావడానికి  కేసీఆర్ అంగీకరించలేదన్నారు. కేసీఆర్ అభీష్టానికి వ్యతిరేకంగా కవితను తానే హైదరాబాద్ తీసుకువచ్చానని తెలిపారు. అప్పుడు కవిత ను రావద్దన్న కేసీఆర్.. తర్వాత జాగృతి పేరుతో ఉద్యమంలోకి ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. పివి ప్రతిష్టను వాదుకునేందుకే వాణిదేవీని ఎమ్మెల్సీ గా కేసీఆర్ నిలబెట్టారని విజయరామారావు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ గల్లంతు అవుతుందన్నారు.  

రాజధానిలో మరో రైతు ఆత్మహత్య 

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల్లో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యతోనైనా కేంద్రం ఈ చట్టాలను రద్దు చేయాలని అతడు రాసిన లేఖలో రాసి పెట్టి చెట్టుకు ఊరి వేసుకుని రైతుల ఉద్యమానికి తన ప్రాణాలు త్యాగం చేశాడు.  ఒకటి కాదు రెండు రోజులు వంద రోజులు దాటింది. అయినా మొక్కక్కవోని దిశక్షతో  దేశ రాజధాని వడిలో ఆందోళనలు చేస్తున్న రైతులు. రైతుల చట్టాలకు ప్రభుత్వాలు తూట్లుపెడుతుందని వారి హక్కుల కోసం దేశ రైతులు ఒక్కటై ఆందోళనలు చేస్తుంటే.. ఆ ఆందోళన దేశ రైతుల కాదు అన్నట్లు క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వం సంబరాల్లో మునిగింది. ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటికే పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది డిసెంబరులో పంజాబ్‌కు చెందిన న్యాయవాది , సిక్కు మత గురువు సంత్ రామ్‌సింగ్ ఉద్యమం కోసం ఊపిరి తీసుకున్నారు.   హర్యానాలోని హిసార్‌కు చెందిన రజ్బీర్ (49) రైతు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. తమ ఉద్యమానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన రజ్బీర్ ఓ లేఖ రాసి టిక్రీ సరిహద్దులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు చట్టాలను రద్దు చేసి తన చివరి కోరిక తీర్చాలని అందులో ఆయన వేడుకున్నాడు. అతను రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హోమ్ మంత్రి మనవడి అరాచకం... 

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్తారు మన పెద్దలు. అలాగే కొంతమంది నాయకులు ఎంత గొప్పవారైనా ఎంత పేరు ప్రఖాయతులు తెచ్చుకున్నా వారి వారసులు మాత్రం పెద్దల పరువు తీసే పనిలో యమా బిజీగా ఉంటారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మ‌న‌వ‌డు ఫ‌రాన్ అహ్మ‌ద్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతడు చదివే కాలేజీలో తోటి విద్యార్థుల‌ను ర్యాగింగ్ చేస్తున్నాడ‌ని తాజాగా పోలీస్ స్టేష‌న్లో ఒక కేసు న‌మోదైంది. మా తాత హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ అని చెప్పి మరీ బెదిరిస్తూ.. త‌మ‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అతడి తోటి విద్యార్థులు పంజాగుట్ట పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. హోంమంత్రి పేరు చెప్పి అయన మ‌న‌వ‌డు చేస్తున్న అరాచకాలనుండి తమను కాపాడాలంటూ వారు పోలీసులకు విజ్ఞ‌ప్తి చేశారు. ఫ‌రాన్ చేసిన ర్యాగింగ్‌ దాడిలో గాయపడిన రియాన్ అనే ఒక విద్యార్థి మీడియా సమావేశంలో తనకు అయిన గాయాన్ని చూపాడు ఈ ర్యాగింగ్ ఘట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  హోం మంత్రి మ‌న‌వ‌డు గ‌తంలోనూ పలు వివాదాలలో ఉన్నాడు. గతంలో పోలీసు శాఖకు చెందిన ఒక వాహనంపై కూర్చొని టిక్‌టాక్ వీడియో చేసిన ఘ‌ట‌న తీవ్ర దుమారం రేపింది. ఎంత హోమ్ మంత్రి మనవడైతే మాత్రం ఇలా తోటి విద్యార్థులను హింసించి పైశాచిక ఆనందం పొందడమేంటని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

హెలికాఫ్టర్ ప్రమాదంలో రాఫెల్ విమానాల సంస్థ ఓనర్ మృతి.. 

భారత్ కు అత్యంత శక్తిమంతమైన రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేసిన ఫ్రాన్స్ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ అధినేత ఒలీవర్‌ డస్సాల్ట్‌ ‌(69) ఒక హెల్‌కాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఫ్రాన్స్‌లో అత్యంత సంపన్నులలో ఒకరైన ఒలివియర్... కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ కూడా. వాయవ్య ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలో ఆ దేశ కాలమానము ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒలివియర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలిందని తెలిసింది. ఈ ప్రమాద ఘటనలో ఒలీవర్‌తో పాటు పైలెట్‌ కూడా మృతి చెందాడు. హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన నార్మండీలో ఒలివియర్‌కి ఒక హాలిడే హోమ్ ఉంది. అక్కడికి వెళ్తున్నప్పుడే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఒలివియర్‌ మృతిపై ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఫ్రాన్స్‌ను ఎంతగానో ప్రేమించే ఒలీవర్‌ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. కరిగిల్ యుద్ధ సమయంలో భారత్ కు ఎంతగానో సేవలందించిన మిరాజ్ యుద్ధ విమానాలను తయారు చేసింది కూడా డస్సాల్ట్ ఏవియేషన్స్ కావడం గమనార్హం. ఈ డస్సౌల్ట్‌ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉండగా ఫోర్బ్స్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోని బిలీనియర్ల జాబితాలో 361వ స్థానంలో ఒలీవర్ ఉన్నారు. ఈయన సంపద 6.3 బిలియన్ యూరోలు. అంతేకాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత ఒలీవర్ తన కంపెనీ బోర్డ్ నుండి కూడా తప్పుకుని .. తనకు ఎలాంటి మచ్చా లేకుండా చూసుకున్నారు. ఒలీవర్ డస్సాల్ట్‌కు ముగ్గురు పిల్లలు.        

మాగంటి రాంజీ మృతి! టీడీపీ నేతల సంతాపం 

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు. రాంజీకి 36 ఏండ్లు. ఈ నెల మూడో తేదీన అస్వస్థతకు గురైన ఆయన ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా అదేరోజు పరిస్థితి విషమించడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతిచెందారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా మూడేళ్లుగా పనిచేశారు. చిన్న వయస్సులోనే జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు  రాంజీ. మాగంటి బాబు రాజకీయ వారసుడిగా చురుగ్గా వ్యవహరిస్తున్న రాంజీ మృతి అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.  మాగంటి రాంజీ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా  ఉన్నప్పుడు... ఆయన కోలుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌తోపాటు జిల్లాలోని నాయకులు ఆకాంక్షించారు. మాగంటి బాబు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. రాంజీ మృతి చెందడం బాధాకరమని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాంజీకి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. 

భైంసాలో మళ్లీ ఘర్షణలు! భారీగా బలగాల మోహరింపు 

lతెలంగాణలోని నిర్మల్ జిల్లా  భైంసా మరోమారు ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని ఓ కాలనీలో జరిగిన చిన్న గొడవ పెను వివాదానికి కారణమైంది. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో పలువురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం భైంసా నివురు గప్పిన నిప్పులా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. జుల్ఫికర్ కాలనీలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో కొందరు యువకులు సైలెన్సర్లు తొలగించిన బైకులపై పెద్ద శబ్దంతో కాలనీలో తిరిగారు. ఆ శబ్దాన్ని భరించలేని స్థానికులు వారిని నిలదీశారు. రైతులు, కూలీలు ఇళ్లకు వచ్చి నిద్రపోయే సమయమని, ఇంతటి శబ్దాలతో వారిని ఇబ్బంది పెట్టవద్దని యువకులకు సూచించారు.ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన చిన్నపాటి ఘర్షణ పెద్దగా మారింది. పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.  బట్టీగల్లీ, పంజేషా చౌక్, కోర్బగల్లీ, బస్టాండ్ సహా పలు ప్రాంతాలకు ఘర్షణలు వ్యాపించాయి. ప్రత్యర్థి వర్గం జనావాసాలపైకి రాళ్ల దాడికి దిగడమే కాకుండా ఆటోలు, కారు, బైకులను తగలబెట్టారు. కత్తులతో వీధుల్లో హల్‌చల్ చేశారు. ఓ కూరగాయల దుకాణాన్ని తగలబెట్టారు. కవరేజీకి వెళ్లిన మీడియాపైనా కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రముఖ పత్రికలకు చెందిన ముగ్గురు విలేకరులకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారడంతో ఇద్దరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ పోలీసు అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రాళ్ల దాడిలో గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో అదనపు బలగాలను మోహరించారు.తాజాగా జరిగిన ఘర్షణలతో స్థానికులు తీవ్ర భయాందోళకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం బైంసో పరిస్థితులను డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది

నేర‌మే అధికార‌మై ప్ర‌జ‌ల్ని వెంటాడుతోంది.. ఐఏఎస్ ట్వీట్ కలకలం 

అవును నేర‌మే అధికార‌మై ప్ర‌జ‌ల్ని వెంటాడుతోంది.. ఈ మాట‌లంది ఎవ‌రో కాదు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాజీ అద‌న‌పు కార్య‌ద‌ర్శి పి.వి.ర‌మేష్‌. ఆయ‌న చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. పీవీ రమేష్ ట్వీట్ పై ర‌క‌ర‌కాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయ‌న ఎవ‌ర్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశార‌న్న‌ది అందరికి ఈజీగానే అర్ధమవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఉద్దేశించే పీవీ రమేష్ ఈ ట్వీట్ చేశారనే చర్చ జరుగుతోంది.    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ తాజాగా  ఓ ట్వీట్ తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. “నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే.. ఊరక కూర్చున్న, నోరున్న ప్రతివాడు నేరస్తుడే!- వరవరరావు” అన్న కోట్‌ను పి.వి.రమేష్ ట్వీట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ‘జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన కోటరీ నుంచి వెళ్లిపోయిన ఒక మాజీ అధికారి గారు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు’’ అంటూ చ‌ర్చ న‌డుస్తోంది. దీనిమీద మాకు స్ప‌ష్ట‌త కావాలంటూ అంద‌రూ ర‌మేష్‌ను కోరుతున్నారు కానీ ఆయ‌న్నుంచి స్పంద‌న రాలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే ఆ ట్వీట్ పెట్టారని కొందరు గట్టిగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. చాలా స్ప‌ష్టంగా ఆ ట్వీట్ అర్థ‌మ‌వుతోందంటున్నారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం కావడంతో ట్వీట్ పెట్టి 7 గంటల తర్వాత పి.వి.రమేష్ వివరణ ఇచ్చారు. తాను ఏ ఒక్క వ్యక్తిని లేదా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వరవరరావు మాటలను ఉటంకించలేదని  తేల్చిచెప్పారు. విశ్వజనీన‌మైన, కాలాతీతమైన సత్యాలను వ్యక్తిగతంగా ఆపాదించేందుకు ప్రయత్నిస్తే.. మీ ఆలోచనా శక్తి అంతవరకే పరిమితమైనదిగా భావించవచ్చని ట్రోలింగ్ చేసేవారికి చుర‌క‌లంటించారు. ఏపీ ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి  పీవీ రమేష్ ఇటీవ‌లే తప్పుకున్నారు. 35 ఏళ్ల పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆయ‌న‌కు అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పించారు. ఆ త‌ర్వాత కొద్ది నెలలకే ర‌మేష్ త‌న బాధ్య‌త‌ల నుంచి వైదొలిగారు. జగన్ కోటరీలో తనకు విలువ లేకపోవడంతోనే పీవీ రమేష్ తప్పుకున్నారనే గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా చేసిన ట్వీట్ తో అది నిజమేనని అర్ధమవుతోంది. 

జగన్, షర్మిలపై పోసాని హాట్ కామెంట్స్ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం, చంద్రబాబు ప్రసంగాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల  సీఎం జగన్ ను ఫేక్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు తరచుగా మాట్లాడుతున్నారని చెప్పారు. పాదయాత్ర చేసిన జగన్ ఇచ్చిన హామీల మేరకు గెలిచిన తర్వాత పథకాలు అమలు చేస్తున్నారని, ఇక ఎలా ఫేక్ ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. చంద్రబాబులా మామకు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన సీఎం కాలేదని, మరలాంటప్పడు జగన్ ఫేక్ సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు లక్ష్మీపార్వతిని, సొంత తమ్ముడ్ని, తోడల్లుడ్ని రోడ్డున పడేశారని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలపైనా స్పందించారు పోసాని కృష్ణ మురళి. షర్మిలకు జగన్ అన్యాయం చేశాడంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. జగన్ ఆమెకు అన్యాయం చేసుంటే.. ఆమె ఏపీలోనే పార్టీ పెట్టి పోటీ చేసేవారు కదా అని వ్యాఖ్యానించారు. షర్మిల రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే తెలంగాణలో పార్టీ స్థాపిస్తున్నారని పోసాని వివరణ ఇచ్చారు. పార్టీ పెట్టడం తప్పేమీ కాదని, జగన్ షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న వార్తల్లో నిజంలేదని స్పష్టంచేశారు. సీఎం జగన్, షర్మిల మధ్య విబేధాలు వచ్చాయని, అందువల్లే ఆమె స్వంత పార్టీని పెడుతుందనే వాదనలు పూర్తిగా అసత్యమన్నారు పోసాని.   

బీజేపీ అంటే జగన్ కి భయం!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.  స్టీల్ ప్లాంట్ పై ఢిల్లీలోని కేంద్ర సర్కార్ ను నిలదీసేందుకు  వైసీపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. 22 మంది ఎంపీల బలం ఉన్న వైసీపీ కేంద్రం పెద్దలను నిలదీసే బదులు, రాష్ట్రంలో నిరసనలు చేపడుతోందని చెప్పారు. ఇక్కడ నిరసన చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అని జనసేనాని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న నిరసనలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ అని పవన్ కల్యాణ్ విమర్శించారు. వైసీపీ ఎంపీలకు స్టీల్ ప్లాంట్ అంశంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏంచేస్తారో పార్లమెంటు సాక్షిగా ప్రజలకు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఏ త్యాగాలు చేస్తే ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందో కేంద్రానికి అర్థమయ్యేట్టు చెప్పాలని స్పష్టం చేశారు.స్టీల్ ప్లాంట్ పై అంత ప్రేమే ఉంటే 22 మంది వైసీపీ ఎంపీలు, ముగ్గురు టీడీపీ ఎంపీలను కూడా కలుపుకుని ఒక నిర్ణయం తీసుకుని పార్లమెంటు వేదికగా పోరాడాలని, అప్పుడు ప్రజలు నమ్ముతారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 22 మంది ఎంపీలను పెట్టుకుని బలమైన పార్లమెంటు వ్యవస్థను వదిలేసి ఇక్కడికొచ్చి నిరసనలు తెలుపుతామంటే మీకు మాకు తేడా ఏముందని అని ప్రశ్నించారు.  

మంత్రి రాసలీలల కేసులో మరో ట్విస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జర్కిహొళి సెక్స్ కుంభకోణం కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఫిర్యాదుదారు సామాజిక కార్యకర్త దినేశ్ కలహళి తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దినేశ్ ఓ లేఖను తన న్యాయవాది ద్వారా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు పంపించారు.  దినేశ్ కలహళి తరపు న్యాయవాది కుమార్ పాటిల్ మాట్లాడుతూ, తాను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారిని కలిసి, దినేశ్ పంపిన లేఖను సమర్పించానని తెలిపారు. జర్కిహొళిపై దినేశ్  చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపానని చెప్పారు. తన క్లయింటు దినేశ్ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగబోరని, ఆయన సామాజిక కార్యకర్త అని, ప్రజల హక్కుల కోసం పోరాడే దక్షతగలవారని కుమార్ చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చేయడమే దినేశ్ ఆశయమని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని, ఇది మరింత తీవ్రరూపం దాల్చకుండా నిరోధించేందుకు ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నారని తెలిపారు. అవసరమైతే దినేశ్ స్వయంగా పోలీసులను కలిసి ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా చెబుతారన్నారు. ఈ కేసులో పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తారని చెప్పారు.  జర్కిహొళి  ఓ మహిళతో అసభ్యకర రీతిలో ఉన్నట్లు చూపుతున్న సీడీని దినేశ్ మంగళవారం మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో జర్కిహొళి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన బీఎస్ యడియూరప్ప మంత్రివర్గంలో జల వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. 

కేసీఆర్ కు బడితె పూజ! సంజయ్ హాట్ కామెంట్స్ 

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం గతంలో ఎప్పుడు లేనంతగా హోరెత్తుతోంది. పార్టీల నేతల మధ్య వ్యక్తిగత దూషణలు హద్దులు మీరుతున్నాయి.  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన మాటల్లో మరింత పదును పెంచారు. కేంద్రం తమకు నిధులు ఇవ్వడంలేదంటూ బీజేపీపై విమర్శలు చేసిన కేటీఆర్ కు ఆయన కౌంటరిచ్చారు. కేంద్రం ఏమీ ఇవ్వడంలేదని కేటీఆర్ అంటున్నారని, అన్నీ ఇచ్చాక వీళ్లు పొడిచేది ఏమిటని అన్నారు. కేంద్రం నిధులు లేనిదే ఏ పథకం ముందుకు కదిలే పరిస్థితి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే కేసీఆర్ కు తోమాల సేవ చేస్తానని, నిరూపించకుంటే బడితె పూజ చేస్తానని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్ లను కూల్చుతామని ఒవైసీ అంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు లేదన్నారు బండి సంజయ్. అలాంటి పార్టీకి ఎందుకు ఓట్లేయాలని అన్నారు భారత్ బయోటెక్ సందర్శనకు ప్రధాని నరేంద్ర మోడీ.. హైదరాబాదు వస్తే కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు బండి సంజయ్. 

రౌడీలకు రౌడీని.. గుండెల్లో నిద్రపోతా! చంద్రబాబు ఉగ్రరూపం

టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో ప్రసంగించిన చంద్రబాబు.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల రౌడీయిజం తన వద్ద సాగదని స్పష్టం చేశారు. అయితే ప్రజల కోసమే కొన్ని భరిస్తున్నానని, ఈ వైసీపీకి భయపడి కాదని స్పష్టం చేశారు. పేకాట మంత్రికి, అవినీతి మంత్రికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపిచ్చారు. రాష్ట్రానికి పట్టిన శని జగన్ అంటూ దుయ్యబట్టారు. ప్రజల నెత్తిన పెట్టిన కుంపటి బాగా మండుతోందని చెప్పారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో ఆరోగ్యం, ఆదాయాన్ని ప్రజలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా నోరెత్తితే ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రజల ఇళ్లకు ప్రొక్లెయినర్‌ పంపి విధ్వంసం సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు రాష్ట్ర మంత్రి కొడాలిపై చంద్రబాబు తనదైన శైలిలో విమర్శలు చేశారు. ‘‘ఒకడు బూతుల మంత్రి... నోరు పారేసుకుంటాడు.. పేకాట ఆడిస్తాడు. ఆడితే తప్పేముంది అంటాడు. ఎంత సింపుల్ సమాధానం. తాడేపల్లిలో సీఎం దగ్గరకు వెళ్లి దర్జాగా బయటకు వస్తాడు. అంటే సీఎం ఆశీస్సులు తీసుకున్నట్టా?’’ అంటూ కొడాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  "రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఓ పనికిమాలిన మంత్రి. తానో పెద్ద రౌడీ అనుకుంటున్నాడు. నేను రౌడీలకు రౌడీని. గుండెల్లో నిద్రపోతా. ప్రజలు తిరగబడ్డ రోజున నీలాంటి రౌడీలు పారిపోతారు. సిగ్గు లేకుండా దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారు" అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుని ప్రజల ఓటు హక్కును సమాధి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక, దోపిడీ పాలనకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి ఆమోదయోగ్యమో, కాదో ఓటు ద్వారా చెప్పాలని అన్నారు చంద్రబాబు. వైసీపీకి ఓటు వేస్తే 3 రాజధానులకు మద్దతు ఇచ్చినట్టు అవుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రులు గర్వించే రాజధాని అమరావతిని నిర్మిస్తుంటే... జగన్ వచ్చి రాజధానిని ముక్కలుగా చేసి అస్తవ్యస్తం చేశాడని చంద్రబాబు ఆరోపించారు. మేయర్ పదవిని సాధించాలని, లేదంటే విజయవాడ జనం తలెత్తుకు తిరగలేరన్నారు. నేరస్థుల అడ్డాగా ఆంధ్రాను తయారు చేస్తున్నారని వాపోయారు. పేదోళ్లకు కనీసం ఐదు రూపాయల భోజనం పెడుతుంటే... టీడీపీకి పేరొస్తుందనే భయంతో.. అన్నా క్యాంటీన్‌లను నిరుపయోగం చేశారని తెలిపారు. ‘‘ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతా అన్నాడు... ప్రత్యేక హోదా ఏమైంది? ఎవరికైనా న్యాయం జరిగిందా..?’’ అని ప్రశ్నించారు. తమ పాలనలో నిరుద్యోగ భృతి ఇచ్చామని, ఇప్పుడు దాన్ని తీసేశారన్నారు. పెళ్లి కానుక రావడం లేదని, భరోసాను పెంచామని చెప్పుకొచ్చారు. 

రాని ‘కోచ్’ కోసం కుమ్ములాటలు 

ఐటీఐఆర్, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈరెండు అంశాలు ఇప్పుడు రాష్ట్ర్ర రాజకీయాలలో,   మరీ రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు జరుగతున్నఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.రాజకీయంగా కాకా పుట్టిస్తున్నాయి.సవాళ్ళు ప్రతి సవాళ్లు ఎగిరెగిరి పడుతున్నాయి. అయితే,ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు ఓటములు ఈ సమస్యలకు పరిష్కారం చూపుతాయని, మెడ మీద తలకాయ ఉన్న ఎవరూ అనుకోరు.  సహజంగా ఎమ్మెల్సీఎన్నికల్లో పట్టభద్రులు, ప్రభుత్వఉద్యోగులు,ఉపాధ్యాయులు,నిరుద్యోగులు,వారి సమస్యలు, పరిష్కారాలు మరీ ముఖ్యంగా నిరుద్యోగం, వంటి అంశాలు కాదంటే స్థానిక ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు ప్రధానంగా చర్చకు వస్తాయి. కానీ ప్రధాన సమస్యలు పక్కకు పోయి,దశాబ్దాలుగా ముడిపడని ఐటీఐఆర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, విభజన చట్టంలో అమలు కానీ అంశాల మీద రాజకీయ పార్టీలు అన్నీ ఫోకస్’ పెట్టాయి.ఇది కల్వకుట్ల చాణక్యం, కాదంటే ప్రతిపక్షల వ్యుహత్మక అమాయకత్వం తప్ప మాటొకటి కాదు.  ప్రస్తుతం ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల మీద దృష్టి పెడితే ఏమి జరుగుతుందో, ఉద్యోగ నియామకాల విషయంలోనే తేలి పోయింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, గొప్పగా లెక్కలు చెప్పబోయి బొక్కబోర్లా పడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, పీఅర్సీ చైర్మన్ బిస్వాల్, మంత్రి కేటీఆర్ బడాయి లెక్కల గాలి తీశారు.మంత్రి గారి లెక్క తప్పని చెప్పి ప్రతిపక్షాల చేతికి చక్కని అస్త్రాన్ని అందించారు. దీంతో అప్పటికే లెక్కలతో సిద్ధంగా ఉన్న ప్రత్యర్ధులు ఒకరి వెంట ఒకరు సవాలు చేయడంతో మంత్రి కేటీఆర్’తో తెరాస నాయకులు, అభ్యర్ధులు ఇరకాటకంలో పడ్డారు. పలాయనం చిత్తగించక తప్పలేదు. అందుకే కేటీఆర్, తెలంగాణ ఉద్యమ మూల స్థంభాల్లో ఒకటైన నియమకాల నుంచి ఓటర్ల దృషిని మరల్చేందుకు, సెంటిమెంట్’ శరణు వేడారు.ఎప్పుడోనే ములన పడేసిన ఐటీఐఆర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాలకు సెంటిమెంట్ తాలింపులు చేర్చి తెరమీదకు తెచ్చారు. నిజానికి ఈ రెండు అంశాలు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా లాగా ముగిసిన అధ్యాయాలు. ఐటీఐఆర్  విషయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది.ఒక్క తెలంగాణకు మాత్రమే కాదు, దేశం మొత్తంలో ఐటీఐఆర్ ప్రాజెక్టులు అన్నిటిని రద్దు చేసింది.  ఇక ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయం అయితే అదొక అంతు లేని కధ, ఇంచుమించుగా అర్థ శతాబ్దంపైగా అలా నడుస్తూనే ఉంది. నలభై ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రాజెక్టును పంజాబ్’కు పట్టుకు పోయింది. మళ్ళీ 2010 లో మమత బెనర్జీ కేంద్ర రైల్వే మంత్రిగా రోజుల్లో కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా కోచ్ మరమత్తుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.అదీ జరగ లేదు.రాష్ట విభజన సమయంలో మళ్ళీ కోచ్ ఫ్యాక్టరీ  అంశం తెరమీదకు వచ్చింది. విభజన  చట్టంలో చేర్చారు. అది కూడా ఆరే ఆరు నెలల్లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయని చట్టంలో పేర్కొనారు. ఏమి జరిగిందో తెలియంది కాదు. అంతే కాదు, ఎవరో ఒక సామాన్య పౌరుడు సమాచార హక్కు చట్టం పరిధిలో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎంతవరకు వచ్చిందని అడిగిన ప్రశ్నకు, రైల్వే శాఖ ప్రస్తుతానికి ఖాజీపేట సహా దేశంలో ఎక్కడా కొత్తగ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఇది అందరికి తెలిసిన విషయం. ఇది జరిగి కూడా ఆరేడు నెలలు అయింది. అయినా ఇంతవరకు అదేమిటని,పబ్లిక్’గా కేసీఆర్ అడగలేదు, కీటీఆర్ కేంద్రాన్ని క్వశ్చన్ చేయలేదు. ఇప్పడు ఇలా హటాత్తుగా ఎన్నికల వేదిక ఎక్కించారు.  ఇప్పుడు ఆ ముక్కను పట్టుకుని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, తెరాస, బీజేపీ,కాంగ్రెస్ నిరుద్యోగ యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయులు, ప్రైవేటు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒకరని కాదు, యావత్ ఉద్యోగ కార్మిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలు పకకు నెట్టి, ఎప్పటికీ  ముడి పడని, అంశాల చుట్టూ తిరుగుతున్నారు.   ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో పెరుగతున్న అసంతృప్తిని గుర్తించి  ప్రభుత్వ వైఫలయ్యాలను కప్పి పుచ్చుకునేందుకు అధికార పార్టీ రియల్ ఇష్యూస్ నుంచి ఓటర్లను పక్కకు తీసుకుపోయేందుకు అడ్డగోలు అంశాలను తెరమీదకు తెచ్చిందంటే అర్థం చేసుకోవచ్చును.కానీ,ప్రతి పక్షాలు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకూడా తెరాస ట్రాప్’లో పడడం ఎమిటో అర్ధం కాదు. ట్రాప్’లో పడిందా లేక ఇంకా పాత బంధాలు పనిచేస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిజంగా, ఐటీఐఆర్ కానీ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, నిజంగా ముడి పడాలంటే, ఇక్కడ కేటీఆర్ నృత్యం చేస్తే పయోజనం ఉండదు, దమ్ముటే, పార్లమెంట్’లో కేంద్రాన్ని, ప్రధాని మోదీనీ నిలదీయాలి, లేదంటే కాంగ్రెస్ ఎంపీ రేవత్ రెడ్డి విసిరిన సవాలు కేటీఆర్ స్వీకరించి ఢిల్లీ వేదికగా ఉద్యమానికి సిద్ధ కావాలి, అయితే వ్యవసాయ చట్టాల విషయంలో తోక ముడిచిన  తెరాసకు అంత సీన్ ఉందా అన్నదే సామాన్యుల సందేహం. అధికార,ప్రతిపక్ష పార్టీలు ఆత్మవంచనకు పాల్పడుతున్నాయి ... ప్రజలను వంచన చేస్తున్నాయి.

హద్దులు దాటుతున్న మాటల యుద్ధం 

అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలలో రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మాములు విషయం. ఎన్నిక ఎన్నికకు నాయకుల స్థాయి, ఏ స్థాయికి దిగజారిందో ఎన్నికల ప్రచారంలో వారు ప్రయోగించే మాటలలో బయటపడి పోతుంటుంది.ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరుగతున్న ఎన్నికలలో రాజకీయ సభ్యత చివరి మెట్టుకు చేరింది అని పిస్తోంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటే, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే, ఈ ఎన్నికల ప్రధాన్యాత కొంచెం తక్కువ అనిపిస్తుంది.  మాటల యుద్ధంలో మాత్రం ఉభయ రాష్ట్రాలలో నేతల తీరు ఒకేలా ఉంది ... కొద్ది రోజులక్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరుగతున్న ఎన్నికలలో బీజేపీ ప్రచారం హుందాగా ఉండాలని, ఎక్కడా మాట తూలవద్దని పార్టీ నాయకులు, క్యాడర్’కు సూచించారు.ప్రదాని ప్రత్యక్షంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అది కూడా ఆ ఐదు రాష్టాల వారికి మాత్రమే చేసిన సూచనే  అయినా, పార్టీలు, రాష్ట్రాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా బీజేపీ నాయకులకు మోడీ మాట మరింత శిరోధార్యం. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్’ ముఖ్యమత్రిని వినడానికి, రాయడానికి కూడా కొంచెం ఇబ్బదికరంగా ఉండే, ‘బట్టే బాజ్’ అని దుర్భాషలాదారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని మాట తూలారు. బండి సంజయ్ గీత దాటి చేసిన వ్యాఖ్యలు  కేసీఆర్’ కంటే మోడీకే ఎక్కువ గుచ్చుకుంటాయి. ఆయన మాటను సొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే బేఖాతరు చేయడం అది ఆయనకూ అవమానమే.  అయితే తెరాస నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్’ కూడా భాష విషయంలో అందరికంటే ఒకాకు ఎక్కువే చదివారు. మఖ్యమంత్రి అనేక సందర్భాలలో ప్రధానమంత్రి సహా అనేక మంది జాతీయ నాయకులను చులకన చేసి మాట్లాడారు. ఇక  రాష్ట్ర నాయకులను ఆయన పశు పక్షాదులతో పోల్చి దుర్భాషలాడిన సందర్భాలు కోకొల్లలు. రెండు ఎమ్మెల్సీ సీట్లకు జరుగుతున్న ఎన్నికలలో ఇంత హైప్, ఇంట హీట్ ఇంతగా రెచ్చిపోయి ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారడం ఏమిటో, ఎవరికీ అంతు చిక్కడం లేదు. అలాగే, ఏపీలోనూ జరిగింది పంచాయతీ ఎన్నికలు, జరుగుతున్నది మున్సిపల్ ఎన్నికలే అయినా, పరస్పర దూషణల జోరు ‘అసహ్యపు’ హద్దులను దాటి, దూసుకు పోతోంది. అయితే, ఇక్కడ ఎవరికీ ఎవరు తీసిపోరు, అందుకే సామాన్యులు  .. అంతా అదే తాను పీసులే అని నవ్వుకుంటున్నారు.  

ఏయూ వీసీపై గవర్నర్ సీరియస్! సెలవుపై పంపించిన సర్కార్  

ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సెలర్‌  పీవీజీడీ ప్రసాదరెడ్డి సెలవుపై వెళ్లారు. గత నెల 28న విశాఖలో జరిగిన రెడ్డి కుల సంఘం సమావేశానికి ఆయన హాజరు కావడం వివాదాస్పదమైంది. ఆయన వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయనను సెలవులో పంపింది.  గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఇదే సమావేశానికి వీసీ ప్రసాదరెడ్డి కూడా హాజరై సాయిరెడ్డి పక్కన కూర్చొని.. అధికార పార్టీకి మద్దతుగా మాట్లాడారు. ఆ వీడియోలో వైరల్ గా మారడంతో వివాదాస్పదమైంది. ఈ నెల 1న విశాఖలో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు కొందరు ఈ విషయంపై ఫిర్యా దు చేశారు. దీంతో ఆయన ప్రసాదరెడ్డి వ్యవహారంపై విచారించాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. వర్సిటీలకు చాన్సెలర్‌ హోదాలో ఉన్న గవర్నర్‌ కూడా దీనిపై స్పందించారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు.. వీసీ ప్రసాదరెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.  విశాఖలో వైసీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డికి ఇక్కడి పరిస్థితులు, నాయకులపై పూర్తి అవగాహన లేదు. దీంతో కీలకమైన విషయాల్లో వీసీ ప్రసాదరెడ్డి సలహాలు తీసుకుంటున్నారు. జీవీఎంసీకి గత ఏడాది ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించినప్పుడు వైసీపీలో టికెట్ల కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. సాయిరెడ్డి ఆ దరఖాస్తులను ప్రసాదరెడ్డికి అప్పగించారు. వాటిని పరిశీలించి, విజయం సాధించే అవకాశం ఉన్నవారి జాబితాను ఇవ్వాలని కోరారు. ఈ పని పూర్తిచేయడానికి అప్పట్లో ఇన్‌చార్జి వీసీగా ఉన్న ప్రసాదరెడ్డి తన విధులకు మూడు రోజులు సెలవు పెట్టి, రహస్యంగా ఓ గెస్ట్‌హౌ్‌సలో ఉండి ఆ పని పూర్తిచేశారని చెబుతున్నారు.ఆయన సూచించిన వారికే టికెట్లు లభించాయి. ఉప కులపతిగా ఉంటూ అధికార పార్టీ తరఫున పనిచేస్తుండడంతో పలువురు ఆయనపై ఫిర్యాదులు చేశారు. 

ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్

చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. 18 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఫోర్జరీతో విత్ డ్రా చేశారని పిటిషన్ వేశారు. హౌస్‌మోషన్ పిటిషన్‌ను 18 మంది టీడీపీ అభ్యర్థులు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థుల తరఫున న్యాయవాది కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది తమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించనున్నారు.  తిరుపతిలో కార్పొరేషన్ లో టీటీడీ ఉద్యోగులు బరి తెగిస్తున్నారు. వినాయక్ నగర్  క్వార్టర్స్‌లో వైసీపీకి అనుకూలంగా ప్రచారంలో టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చిన 41వ డివిజన్ వైసీపీ అభ్యర్థి స్రవంతితో పాటు టీటీడీ ఉద్యోగులు ప్రచారం చేయటంపై సహోద్యోగుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. టీటీడీ ఉద్యోగులు మీడియాకు సమాచారమిచ్చారు. దాంతో ప్రచారం జరుగుతున్న వినాయకనగర్‌కు మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. మీడియాను చూసి వైసీపీ అభ్యర్థి స్రవంతి, టీటీడీ ఉద్యోగులు వెళ్లిపోయారు. ఎన్నికల కమిషన్‌కు కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారంలో నగదు పంపిణీ, మద్యం సరఫరాపై ఈ ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కోడ్ ఉల్లంఘనల విషయమై ప్రత్యేక టీంలు పనిచేస్తున్నట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి నుంచే ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ఎస్‌ఈసీ అప్రమత్తమైంది. ఈ ఫిర్యాదులకు సంబంధించి నేటి ఉదయం 11 గంటలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఈ ఫిర్యాదులపై ఆదాయపు పన్నుశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేసింది.

రీజనల్ రింగ్ రోడ్డుకు లైన్ క్లియర్ 

హైదరాబాద్‌ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే జాతీయ రహదారి హోదా ఇచ్చిన ప్రాంతంలో భూసేకరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో రింగ్‌ రోడ్డు నిర్మాణ వ్యవహారం ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. భూసేకరణ అనుమతి ఉత్తర్వులపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేయగా... త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు వంద మీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ రింగ్‌ రోడ్డును నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. తొలుత నాలుగు వరుసల రహదారి నిర్మించి... ఆ తరువాత మరో నాలుగు వరుసలు విస్తరిస్తారు. ఎనిమిది వరుసలకు తగినట్లు భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రాంతీయ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-చౌటుప్పల్‌ వరకు నిర్ణయించి 161(ఎ)(ఎ)గా జాతీయ రహదారి నంబరును కేంద్రం కేటాయించింది. ఈ మార్గం 158 కిలోమీటర్లు. దక్షిణ భాగంగా ఉన్న చౌటుప్పల్‌- షాద్‌నగర్‌-సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లకు కూడా అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల అంగీకరించింది. దక్షిణ భాగానికి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపిన కేంద్రం... త్వరలో జాతీయ రహదారి నంబరు కేటాయించి భూసేకరణకు అనుమతి ఇవ్వనుంది. హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ఆవల ప్రాంతీయ రింగ్‌ రోడ్డును నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే నిర్ణయించారు. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఢిల్లీ-హైదరాబాద్‌ చుట్టూ దస్త్రం తిరుగుతూనే ఉంది. ఒకదశలో కేంద్రం మెలిక పెట్టింది. 500 మీటర్ల మేర భూసేకరణ చేపట్టి.. రహదారి పోను మిగిలిన ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుని.. ఆ డబ్బుతో ప్రాంతీయ రింగు రోడ్డును నిర్మించుకోవాలని సూచించింది. అంత స్థాయిలో భూసేకరణ చేపట్టడం సాధ్యమయ్యే పని కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో.. తాజాగా కేంద్రం వంద మీటర్లకే అనుమతి ఇచ్చింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయానికి కూడా వర్తమానాన్ని పంపినట్లు తెలిసింది. ప్రాంతీయ రింగు రోడ్డును భారతమాల-1 పనుల జాబితాలోనూ కేంద్రం చేర్చింది. ఉత్తర భాగంగా నిర్మించే 158 కిలోమీటర్ల మార్గం నిర్మాణానికి సుమారు 4,750 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ చేపడుతుందన్న అంశంపై రహదారి నిర్మాణ వేగం ఆధారపడి ఉంటుంది.

రేవంత్‌కే పీసీసీ పగ్గాలు! సీనియర్లకు రాహుల్ సిగ్నల్

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఆ క్రెడిట్ ను క్యాష్ చేసుకోవడంలో మాత్రం హ్యాండ్సప్ అంది. తెలంగాణలో హస్తం పార్టీ పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. పేరుకే ప్రతిపక్షం. ఉనికి కోసం తాపత్రయం. అంతలా దిగజారిపోయింది కాంగ్రెస్. పార్టీ ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పునరుజ్జీవనం పొందాలంటే సమర్థుడైన పీసీసీ అధ్యక్షుడు కావాలి. ఉత్తమ్ తర్వాత గట్టి పిండం కోసం వెతుకుతోంది అధిష్టానం. రేసులో మేమున్నామంటూ సీనియర్లంతా హస్తినలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం తెలంగాణలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే తురుపు ముక్క కోసం చూస్తున్నారు. రాహుల్ లిస్టులో అందరికన్నా ముందున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.  సీఎం కేసీఆర్ పై గట్టిగా పోరాడగల సత్తా ఉన్న నేత రేవంత్ రెడ్డి. ఆయన మాట ఓ తూటా. గులాబీ బాస్ పై గురి పెట్టి వదిలే ఒక్కే డైలాగ్.. రాజకీయంగా డైనమైట్ లా పేలుతుంటుంది. ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను ఎఫ్పటికప్పుడూ కడిగేస్తూ, నిలదీసే నేత రేవంత్. రాహుల్ గాంధీకి కావలసింది అలాంటి నాయకుడే. అందుకే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిన ప్రచార కన్వినర్ గా నియమించి, ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ కూడా కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. కొడంగల్ లో ఓడిపోవడం రేవంత్ కాస్త తగ్గినట్టు కనిపించినా.. మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచి.. మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో హడలెత్తిస్తున్నారు. అందుకే, రాహుల్ గాంధీకి రేవంత్ పై ఎనలేని గురి.  లేటెస్ట్ గా రాహుల్ మదిలోని మాట పరోక్షంగా బయటకి వచ్చింది. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి ఇటీవల రాహుల్‌ను కలిశారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పూర్తి స్థాయిలో పనిచేయడంలేదన్న అభిప్రాయాన్ని రాహల్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తునే పణంగా పెట్టేలా పనితీరు ఉండొద్దని రాహుల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సమయంలో మాధుయాష్కి టీపీసీసీ చీఫ్ ప్రస్తావన తెచ్చినప్పుడు రాహుల్ గతంలోకంటే భిన్నంగా స్పందించారట. టీపీసీసీ కూర్పు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని అలా అయితేనే తెలంగాణలో పార్టీ బలపడుతుందని మధుయాష్కి అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంలో తనకు ఒక ప్రణాళిక ఉందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది.  మధుయాష్కితో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విశ్లేషిస్తే.. ఆయన సీనియర్ల తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించడంలో సీనియర్లు సరిగ్గా పని చేయడం లేదనే అభిప్రాయం రాహుల్ లో కనిపించింది. పరోక్షంగా ఆలత రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని.. పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి పైనే ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే నిజమైతే.. రాహుల్ గాంధీని ఆకట్టుకున్న రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది.