బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా
posted on Mar 9, 2021 @ 6:29PM
ఉత్తరాఖండ్ రాజకీయాలలో సంచలనం జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం పలు నాటకీయ పరిణామాల మధ్య సాయంత్రం 4 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన గవర్నర్ రాణి మౌర్యకు తన రాజీనామాను అందజేశారు. రావత్ పనితీరుపై .. బీజేపీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నదని తెలుస్తున్నది. గడిచిన నాలుగు రోజులుగా ఆయనను పదవి నుంచి తొలగిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో రావతే ఈరోజు పదవి నుంచి తప్పుకున్నారు.
రావత్ వ్యవహార శైలిపై స్థానిక ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తున్నది. క్యాబినెట్ కూర్పుపైనా ఆయనపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై పార్టీ పరిశీలకుడు రమణ్ సింగ్ ముందు తెలియజేశారు. అసంతృప్త వర్గాలు, ఇతరులతో చర్చించిన రమణ్ సింగ్.. ఇటీవలే ఇందుకు సంబంధించిన నివేదికను బీజేపీ అధిష్టానానికి అందజేశారు. దీంతో బీజేపీ కేంద్ర పెద్దలు ఆయన రాజీనామాకు పట్టుబట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.