కిషన్ రెడ్డి కుర్చీకి ఎసరు?
posted on Mar 9, 2021 @ 5:01PM
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత అందరికీ తెలిసిందే. ఇప్పుడు భైంసా అల్లర్ల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుర్చీకి ఎసరు తెస్తుందా.. అంటే పార్టీవర్గాలు, పరిస్థితి అలాగే ఉందనే అంటున్నాయి. భైంసా అల్లర్లు జరిగిన వెంటనే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అలాగే ఇతర నాయకులు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్నిబోనులో నిలబెట్టారు. అయినా కిషన్ రెడ్డి మాత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా భైంసాలో ఏమి జరిగిందని ఆరా కోరే వరకు స్పందించలేదన్న ఆరోపణలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంపైన్ నడుస్తోంది.
ఈ నేపధ్యం లోనే కిషన్ రెడ్డి మంగళవారం భైంసా సంఘటనను ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. భైంసాలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘ వ్యతిరేక శక్తులు ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు సృష్టిస్తున్నాయని,అలాంటి శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భైంసాలో కొన్నేళ్లుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఒక వర్గం వారిపై మరో వర్గం వారు దాడి చేయడం మంచిది కాదని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని డీజీపీకి సూచన చేశారు.
మరోవంక అరవింద్ చలో భైంసా అంటూ బయలుదేరి హౌస్ అరెస్ట్ అయ్యారు. గత సంవత్సరం కూడా హిందువులపై దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. హిందువులలో భరోసా కలిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక దుబ్బాక ఉపఎన్నికల సమయంలో పోలీసులు రఘునందన రావు ఇంటి పై దాడి చేసిన సందర్భంలో కిషన్ రెడ్డి స్పందించిన తీరు విమర్శలకు గురైంది. అలాగే కిషన్ రెడ్డి తెరాస పట్ల మెతక వైఖరి అవలబిస్తున్నారనే అపవాదు ఉండనే ఉంది. ఇలా పార్టీలో కిషన్ రెడ్డి పట్ల కొంత అసంతృప్తి ఉందని..సోషల్ మీడియాలో వస్తున్న ట్వీట్లు, పోస్టులు సూచిస్తున్నాయి. అలాగేకిషన్ రెడ్డికి అమిత్’ షా క్లాసు తీసుకున్నారన్న వార్త కూడా సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. మొత్తానికి భైంసా అల్లర్లు కిషన్ రెడ్డిని అల్లరి పాలు చేసేటట్లే ఉన్నాయి.