తండ్రి పేరుతోనే షర్మిల పార్టీ! ఏప్రిల్ 9న విడుదల..
posted on Mar 10, 2021 @ 1:37PM
తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. జిల్లాల వారీగా నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నేతలతో సమావేశమయ్యారు. బుధవారం లోటస్ పాండులో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో చర్చించారు వైఎస్ షర్మిల. ఈ నెల 19న కరీంనగర్ జిల్లా అభిమానులతో ఆమె భేటీ కానున్నారు. వరుసగా చర్చలు జరుపుతూనే పార్టీ ఏర్పాట్లను వేగవంతం చేశారు వైఎస్ షర్మిల.
షర్మిల పార్టీకి సంబంధించి కీలక విషయాలు బయటికి వచ్చాయి. తన తండ్రి పేరు కలిసివచ్చేలా పార్టీకి 'వైఎస్ఆర్ టీపీ'గా పేరు పెట్టాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ జెండాలో మూడు రంగులు ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు వుంటాయని తెలుస్తోంది. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే భారీ సభలో ఆమె తన పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆమె ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏదైనా ఓ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్లోని ఓ నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు ఆమె అనుచరుల ద్వారా తెలుస్తోంది. అన్ని జిల్లాల నేతలతో సమావేశం ముగిశాకా పాదయాత్రపై షర్మిల నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కొత్త పార్టీ పెడుతున్న షర్మిలకు తల్లి విజయలక్ష్మి పూర్తి సహకారం అందిస్తున్నారని లోటస్ పాండ్ వర్గాల సమాచారం.