నేను చాలా మంచోడిని.. రాసలీలల మంత్రి క్లారిటీ
posted on Mar 9, 2021 @ 4:56PM
"అంతా అబద్దం. పచ్చి అబద్దం. నేను అమాయకుడిని. రాసలీలల సీడీ ఎవరో కావాలని చేసిన కుట్ర. నేను ఎలాంటి తప్పు చేయలేదు." ఇదీ కర్ణాటక రాసలీలల మంత్రి రమేశ్ జార్ఖిహొళి ఇచ్చిన క్లారిటీ. అది కూడా మీడియా సమావేశం పెట్టి మరీ తాను చాలా మంచోడినంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రివర్యులు. తప్పేమీ లేకపోతే రాజీనామా ఎందుకు చేశారని విలేకర్లు ప్రశ్నిస్తే.. అది నా సొంత నిర్ణయమంటూ విషయం దాటేశారు.
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాసలీలల సీడీ ఘటనపై బీజేపీ నేత, మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహొళి తొలిసారి స్పందించారు. తాను సచ్చీలతను వెల్లడించేందుకు మీడియా ముందుకొచ్చారు. తనపై వచ్చిన రాసలీలల ఆరోపణల్లో నిజం లేదని ఖండించారు. ఆ ఆరోపణలకు సంబంధించి విడుదలైన సీడీ గురించి తనకేం తెలియదని.. కావాలని ఎవరో కుట్ర చేస్తున్నారన్నారు.
‘రాసలీలల వ్యవహారంలో నేను ఉన్నానని ఆరోపిస్తూ విడుదలైన సీడీలో నిజం లేదు. నేను అమాయకుడిని. అసలు ఈ సీడీ వ్యవహారం నాలుగు నెలల కిందటే నా దృష్టికి వచ్చింది. నేను ఎలాంటి తప్పు చేయలేదని అప్పుడే నా సోదరుడికి కూడా వివరించా. అందులో ఉన్నది నేను కాదు. ఈ విషయంలో న్యాయపరమైన సహకారం గురించి నాకు అధిష్ఠానం నుంచి కాల్ వచ్చింది. అయినప్పటికీ ఆ ఆరోపణలపై నేను ఒంటరిగా పోరాడగలనని చెప్పా’ అని రమేశ్ తెలిపారు.
‘మంత్రి పదవికి రాజీనామా చేయడం నా సొంత నిర్ణయమే. నన్ను రాజీనామా చేయమని సీఎం యడియూరప్ప కోరలేదు. నా అంతట నేనే రాజీనామా చేశా. నా వల్ల పార్టీ ఇబ్బందుల పాలు కావడం నాకు ఇష్టం లేదు. అందుకే తర్వాతి రోజు ఉదయమే రాజీనామా సమర్పించా’ అని రమేశ్ వెల్లడించారు.
ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, లైంగికంగా లొంగ దీసుకుని, కొన్ని నెలలుగా ఆమెతో రాసలీలలు నెరుపుతున్నారనేది రమేశ్ జార్ఖిహొళిపై ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదుతో పాటు మంత్రి రాసలీలల వీడియోను సైతం బయటపెట్టారు. అందులో ఆ యువతితో రమేశ్ జార్ఖిహొళి చాలా సన్నిహితంగా ఉన్న దృశ్యాలు సంచలనంగా మారాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. రమేశ్ పై ఒత్తిడి పెరిగి.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. వీడియోలో ఆయన స్పష్టంగా కనిపిస్తున్నా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఆ సీడీ ఓ కుట్ర అంటూ మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహొళి చెప్పడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. అటు, ప్రజల నుంచీ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.