మంత్రి నాని ఓటు గల్లంతు
posted on Mar 10, 2021 @ 11:27AM
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలో అవకవతకలు జరిగాయని మొదటి నుంచి విపక్షాలు చెబుతూ వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో చాలా మంది ఓట్లు గల్లంతు అయ్యాయని, భారీగా బోగస్ ఓటర్లు చేరారని ఫిర్యాదులు కూడా చేశాయి. అయినా అధికారులు పట్టించుకోలేదు. మున్సిపల్ పోలింగ్ సందర్భంగా ఇది నిజమవుతోంది. తమ ఓట్లు తీసివేశారంటూ చాలా ప్రాంతాల్లో ఓటర్లు నిరసనకు దిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఏలూరు కార్పొరేషన్ లో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అళ్లనానికే ఊహించని షాక్ తగిలింది. ఓటు వేసేందుకు ఆయన శనివారపు పేట పోలింగ్ బూత్ కి వెళ్లారు. తీరా అక్కడ ఓటు వేద్దామని జాబితాలో తన పేరు చూసుకుంటే లేదు. దీంతో తనకు ఓటు లేకపోవడంతో మంత్రి వెనుతిరగాల్సి వచ్చింది. మంత్రి అయిన తన ఓటే లేకుంటే ఎలా అని ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. పోలింగ్ అధికారుల తీరుపై మంత్రి నాని మండిపడ్డారు.
ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా జరగలేదని ప్రతిపక్షాలు ఆందోళనలు కూడా చేశాయి. అప్పుడు మంత్రి అలాంటిది ఏం లేదని విపక్షాల వాదనను కొట్టి పడేశారు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయని కితాబు ఇచ్చారు. కానీ ఇప్పుడు స్వయంగా మంత్రికే ఇలాంటి అనుభవం ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం సెటైర్లు వేస్తున్నారు. ఇదే అంశంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.