రాహుల్ కంటే ప్రియాంక బెటర్
నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది, భారతీయ జనతా పార్టీ ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. అస్సాంలో అధికారం నిలుపుకోవడం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలలో అధికారాన్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా, కమల దళం పావులు కదుపుతోంది.ఈ మూడు రాష్ట్రాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా, ఇంకా ఇతర జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒక్క బెంగాల్లోనే ఓ పాతిక మంది వరకు కేంద్ర మంత్రులు ‘ప్రత్యేక’ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇతర రాష్టాల నుంచి కార్యకర్తలు, నాయకులు ఎన్నికలు జరుగతున్న రాష్ట్రాలలో తిష్ట వేసే ప్రచారం సాగిస్తున్నారు.
అలాగే పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు అన్నీ కాలంతో పాటు పరుగులు తీస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. మమతా బెనర్జీ కాలికి గాయమైన, పట్టించుకోకుండా ప్రచారంలో పరుగులు తీస్తున్నారు.అలాగే, తమిళ నాయుడులో ద్రవిడ పార్టీలు, కేరళలో కమ్యూనిష్టులు, ఏ చిన్న అవకాశం వదులుకోకుండా, ప్రత్యర్ధులను చిత్తు చేసే ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు.
అయితే, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధానప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇంకా ఎన్నికల జోష్ కనిపించడంలేదు. కాంగ్రెస్ ప్రధాన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అస్సాం, కేరళ, డీఎంకేతో పొత్తు పెట్టుకున్న తమిళ నాడులో మాత్రం, రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ కూడా ప్రచారంలో చురుకైన పాత్రను పోషించడం లేదు.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ప్రచారం వినూత్నంగా సాగుతోంది. ఆయన ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల కంటే, విద్యార్ధులు, యువకులతో ఇంటరాక్షన్’ వైపు మొగ్గు చూపుతున్నారు. బస్కీలు, దండీలు తీయడం, కాలేజీ అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్‘లో శిక్షణ ఇవ్వడం చేస్తూ చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. అక్కడక్కడా నాలుగు మాటలు మాట్లాడినా అందులో ప్రజలను ఆకట్టుకునే మాట కనిపించడం లేదు, కేవలం మోడీని దూషించడం వరకే పరిమితం అవుతున్నారు. ఉదాహరణకు బుధవారం అస్సాంలో పర్యటించిన రాహుల్ గాంధీ గౌహతీలో కామాఖ్యా ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. పేద్ద బొట్టు పెట్టుకున్నారు. ఆ తర్వాత కామ్‌రూప్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 24 గంటలూ అబద్ధాలాడుతూనే ఉంటారని విరుచుకుపడ్డారు. అలాగే, నిరుద్యోగ సమస్య, ఇతర సమస్యలను ప్రష్టావించినా, గెలుపు పై ధీమాతో కనిపించలేదు.కిల్లింగ్ ఇన్స్టింక్ట్ మాటల్లో దూసుకు రావడం లేదు. మరో వంక మోడీ, అమిత్ షా ఇతర బీజేపీ నాయకులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో, రాహుల్ ప్రచారం ప్రజలను ఆకట్టుకులేక పోతోందని,రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు.
అలాగే రాహుల్ కంటే ప్రియాంక ప్రచారం ప్రజలను, మీడియాను కూడా బాగా అకట్టుకుంటోంది. ప్రియాంక రాహుల్’కు భిన్నంగా ఎక్కడికి వెళితే అక్కడి ప్రజల సమస్యలను ప్రస్తావించడంతో పాటుగా, ప్రత్యర్ధులకు గట్టిగా చురకలు వేస్తున్నారు.ఉదాహరణకు,బుధవారం కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక అధికార వామ పక్ష కూటమి, ఎల్డీఎఫ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి విజయన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మివేస్తోందని విమర్శలు గుప్పించారు. బంగారం స్మగ్లింగ్ ఆరోపణలను అస్త్రాలుగా చేస్కున్నారు. అందుకే ప్రచారం వరకు అయితే, రాహుల్ కంటే ప్రియాంక బెటర్ అనిపించుకున్నారు.