కేసీఆర్ మెడలో గంట కట్టేదెవరు?
posted on Mar 31, 2021 @ 2:39PM
తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరమా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అయితే, ఎవరికీ వారు సొంత దుకాణాలు పెట్టుకుంటే, ప్రయోజనం ఉండదని, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శక్తి యుక్తులను సమర్ధవంతంగా ఎదుర్కునే, ఉమ్మడి వేదికగా కొత్త పార్టీ ఏర్పాటు కావాలన్న అభిప్రాయం ఇటు రాజకీయ వర్గాల్లో, అటు మేథావి, మీడియా వర్గాలలోనూ వినవస్తోంది. అయితే, పిల్లి మెడలో గంట కట్టేది ఎవరన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి తెరాసకు ధీటైన ప్రత్యాన్మాయం అవసరం చుట్టూ ఆలోచనలను నడిపిస్తున్నారు. అయితే ఆయన కూడా ఇదమిద్దంగా ఇదీ ఐడియా, ఇదీ బ్లూ ప్రింట్ అని కాకుండా, అటు అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులతో, అదే విధంగా కాంగ్రెస్, బీజేపీ సహా అనేక ఇతర పార్టీలలో ఉన్న నాయకులతో బహిరంగంగా, లోపాయికారిగా చర్చలు జరుపుతున్నారు. మీడియా ముందు తమ ఆలోచనలను ఉంచుతున్నారు. ఒక విధంగా మేథోమథనం సాగిస్తున్నారు. అయితే, అది అంత సులభంగా అయ్యే పని కాదన్న వాదన కూడా వినిపిస్తోంది.
కేసీఆర్‌పై వ్యతిరేకత విషయంలో ఏకాభిప్రాయం ఉన్నా.. నాయకత్వం విషయంలో ఏకాభిప్రాయం కుదరడం అయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కోదండరామ్, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ ఇలా చాలా మంది టీఆర్ఎస్‌కు, మరీ మాట్లాడితే కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేశారు. అయినా అందరూ విఫలమయ్యారు. ఒక విధంగా, ఎవరి కుంపటి వారు పెట్టుకోవడం వలన మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కారు పార్టీ విజయం సాధించింది. అంతే కాదు, కేసీఆర్ కుటుంబ పాలనపై ఒంటరి పోరాటం చేసిన తీన్మార్ మల్లన్న ఓటమికి, వీరంతా కారణమయ్యారు. ఒక విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధులను కేసీఆర్ వ్యతిరేకులంతా ఎవరికి వారే విడిపోయి గెలిపించారు. ఈ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకం కావాలి. అలా అందరినీ ఏకం చేయాలంటే అందుకు మరో కేసీఆర్ కావాలి.. అన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
అదలా ఉంటే, ప్రాతీయ పార్టీలకు చెక్ పెట్టడం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే సాధ్యమన్న విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. బలమైన ప్రాంతీయ పార్టీకి బలమైన ప్రాంతీయ పార్టీనే ప్రత్యాన్మాయం అని ఆలోచించే వారు.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఉదాహరణగా చూపుతున్నారు. మరోవైపు ప్రాతీయ పార్టీకి జాతీయ పార్టీ, జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీ ప్రత్యాన్మాయం కాగలుగుతాయని చూపేందుకు అనేక ఉదాహరణలు చూపుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగు దేశం సుదీర్ఘ కాలం పాటు ప్రత్యాన్మాయంగా నిలిచింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ప్రాంతీయ పార్టీ తృణమూల్ కు జాతీయ పార్టీ బీజేపీ ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచింది. ఉత్తర ప్రదేశ్ లో సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్రానికే చెందిన ఎస్పీ, బీఎస్పీలు ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు, బీజేపీ అధికారంలో ఉంది. అలాగే, అస్సాం, బీహర్ సహా ఇంకా చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ, జాతీయ పార్టీలు ప్రత్యర్దులుగా పోటీ పడుతున్నాయి. మిత్ర పక్షాలుగా మెలుగుతున్నాయి. సో.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యాన్మాయం అవసరం కానీ, అది ప్రాంతీయ పార్టీనే కావాలని అనుకోవడంతో మాత్రం అర్థం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.