జానారెడ్డిని ఏకగ్రీవం చేయాలి.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి..
posted on Mar 31, 2021 @ 5:29PM
నాగార్జున సాగర్ ఎన్నిక తర్వాత తెలంగాణలో నిజమైన రాజకీయ పునరేకీకరణ జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ రాజకీయ పతనం దుబ్బాకలో ప్రారంభమైందని.. సాగర్‌తో మరింత స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. జానారెడ్డిపై కేసీఆర్ చేసిన కామెంట్లపై టి.కాంగ్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జానారెడ్డికి పర్మినెంట్ రెస్ట్ ఇస్తానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మల్లు రవిలు తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్రం రావడానికి జానారెడ్డే కారణమని.. అప్పట్లో సీఎం పదవి ఆఫర్ చేసినా ఆయన తీసుకోలేదన్నారు. జానారెడ్డి పెట్టిన బిక్షతోనే కేసీఆర్ సీఎం అయ్యారన్నారు కాంగ్రెస్ నేతలు.
జానారెడ్డి ఇన్నేళ్ల రాజకీయంలో కొడుకులని కానీ, కుటుంబ సభ్యులని కానీ ఎవరినీ రాజకీయాల్లోకి తీసుకురాలేదన్నారు. అదే, కేసీఆర్ మాత్రం తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారన్నారు.
నాగార్జున సాగర్‌లో డబ్బుతో కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో డబ్బుల సంచులు అందించారన్నారు. మండలానికి 5 కోట్లు చొప్పున.. ఆరు మండలాలకు చెందిన నాయకులకు ఇప్పటికే డబ్బులు అందాయని ఆరోపించారు.
నాగార్జున సాగర్ ఎన్నికలో అధికార పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టబోతోందని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు, డబ్బు మూటలు జానారెడ్డి ముందు పని చేయవన్నారు షబ్బీర్ అలీ, మల్లు రవిలు.
జానారెడ్డి మచ్చలేని నాయకుడు.. రాజకీయాలకే దిక్చూచి లాంటి వాడు.. జానారెడ్డిని ఏకగ్రీవంగా ఎమ్మెల్యే పదవికి ఎంపిక చేసి ఆయన్ను గౌరవించాలన్నారు కాంగ్రెస్ నేతలు.
జానారెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తరువాత కేసీఆర్ శాశ్వతంగా ఫామ్‌హౌజ్‌కే పరిమితమవుతారన్నారు.