వేటగాళ్లు.. వాళ్లు చాలా ముదుర్లు..
posted on Mar 31, 2021 @ 3:34PM
వికారాబాద్ లో వేట. వీకెండ్ వస్తే చాలు తుపాకుల మోత. బడాబాబుల చేతిలో అడవి జంతువుల కోత. జింకలు, ఆవులే వాళ్ళ టార్గెట్. అటవీశాఖ అధికారులు వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. ఆ వన్యప్రాణుల ప్రాణాలు తీయడంలో వాళ్లంతా భాగ్యస్వామ్యులే.
హైదరాబాద్ నుంచి కొందరు వేటగాళ్లు సరదాగా అడవిబాట పడుతున్నారు. దామగుండం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఫామ్ హౌసుల్లో బస చేస్తూ.. అడవుల్లో వేట కొనసాగిస్తూ. రాత్రి వేళ్లల్లో వారి కంటపడ్డ వన్యప్రాణులను తుపాకీ తూటాలకు బలి చేస్తున్నారు.
రెండు నెలల క్రితం ఆవుపై కాల్పులు జరిపిన ఘటన మరువకముందే మళ్లీ కొందరు వేటగాళ్లు మరోసారి తుపాకీ పేల్చారు. ఓ కృష్ణ జింకను బలితీసుకున్నారు. దామగుండం అడవుల్లో కృష్ణ జింక కళేబరాన్ని స్థానిక పశువుల కాపర్లు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు ఘటనా స్థలానికి వెళ్లకుండానే కుక్కల దాడిలో జింక చనిపోయిందని అధికారులు తేల్చేశారని స్థానికులు మండిపడుతున్నారు. వేటగాళ్లంతా బడాబాబులు కావడంతో వారి కనుసన్నల్లోనే ఫారెస్టు అధికారులు పనిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేటగాళ్ల ముసుగులో కొందరు పెద్దలు వన్యప్రాణులను బలితీసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.