అసత్య ప్రచారం తగదు.. టీటీడీ వ్యాఖ్యలు సిగ్గుచేటు..
posted on Mar 31, 2021 @ 3:10PM
తలనీలాల విషయంలో టీటీడీపై సోషల్ మీడియాలో అనవసర నిందలు వేస్తున్నారని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. మిజోరం పోలీసులు నమోదు చేసిన కేసులో టీటీడీ పేరు లేదని స్పష్టం చేశారు. అన్ ప్రాసెస్డ్ హెయిర్‌ను పట్టుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రాసెస్ చేయకుండా తలనీలాలు విక్రయించమని.. కట్టుదిట్టమైన భద్రతతో తలనీలాలు తిరుపతికి తరలిస్తామని.. ఒక్క వెంట్రుక కూడా దొంగతనంగా బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు అదనపు ఈవో ధర్మారెడ్డి. అత్యంత పారదర్శకంగా ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తామని, దీనిపై అసత్య ప్రచారం తగదని హితవు పలికారు.
అయితే.. టీటీడీ వివరణపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి తలనీలాలు ఎక్కడో చైనాకు తరలిస్తుండగా పట్టుబడితే, టీటీడీ అధికారులు తమకేం సంబంధమనడం సిగ్గుచేటని మండిపడ్డారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. తలనీలాల కాంట్రాక్ట్ పొందిన సంస్థ పూర్వాపరాలు టీటీడీ అధికారులకు తెలియవా అని ప్రశ్నించారు. తలనీలాలు తీసుకెళ్లి సదరు సంస్థ ఎక్కడ విక్రయిస్తుందో, ఏం చేస్తుందో తెలుసుకోకుండానే పాలకవర్గం, టీటీడీ అధికారులు కాంట్రాక్ట్ కట్టబెట్టారా అని నిలదీశారు. తలనీలాల ఘటనకు సిగ్గుపడకుండా, ధర్మారెడ్డి ఎవరిపై కేసులు పెడతారని మండిపడ్డారు.
హిందువుల వైకుంఠమైన తిరుమలను జగన్మోహన్‌రెడ్డి వ్యాపార కేంద్రంగా మార్చేశాడని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. పరమతానికి చెందిన ముఖ్యమంత్రి జరిగిన ఘటనకు బాధ్యులైన జవహర్ రెడ్డి, ధర్మారెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయించాలన్నారు. టీటీడీ పాలకవర్గాన్ని తక్షణమే రద్దు చేయాలని బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.