8 పెళ్లిళ్లు.. గంజాయి గ్యాంగులు.. వాడు మామూలోడు కాదు గురు..
posted on Mar 31, 2021 @ 3:37PM
అతడు నిత్య పెళ్లి కొడుకు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. కట్ చేస్తే.. ఆ నిత్య పెళ్లి కొడుకు తిక్క కుదిర్చారు పోలీసులు.
స్టైల్ గా తయారు అవ్వడం. రోడ్ల వెంట రోమియోలా తిరగడం.. ఒంటరిగా కనిపించిన అమ్మాయిలకు మస్కా కొట్టడం.. తన లైఫ్ చాలా రిచ్ అని నమ్మించడం. బుట్ట బొమ్మల్ని బుట్టలో వేసుకోవడం. తనను పెళ్లి చేసుకుంటే సుఖమైన జీవితం ఉందంటూ మొదట వెంటపడతాడు. వారిని నమ్మించి తనపై నమ్మకం కలిగే వరకు ప్రేమించమని ప్రాధేయపడతాడు. అతడి మాటలు నమ్మి ప్రేమించడానికి అమ్మాయి ఒప్పుకుంటే త్వరగానే పెళ్లికి అంగీకరిస్తాడు.. ఆ తరువాతే మనోడి అసలు రూపం బయటపడుతుంది. ఆ తర్వాత తన మాట వినాల్సిందే.. లేదంటే కత్తులు, గన్ చూపిస్తాడు. చంపేస్తానంటూ బెదిరిస్తాడు.
విశాఖపట్నానికి చెందిన అరుణ్ కుమార్ కు వ్యభిచార ముఠాలు, గంజాయి గ్యాంగులతో సంబంధాలున్నాయి. వాళ్లకి అమ్మాయిలను,గంజాయిను సరఫరా చేస్తూ డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతో అమ్మాయిలను వలలో వేసుకుంటాడు. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. తరువాత వ్యభిచార రొంపిలోకి దింపుతాడు. తాజాగా తన మొదటి భార్య వ్యభిచారానికి నిరాకరించడంతో ఆమె కుమార్తెను అమ్మేస్తాను అంటూ బెదిరింపులకు దిగాడు. కేవలం ఆమెనే కాదు.. తనను నమ్మి వివాహం చేసుకున్న వారందర్నీ ఇలానే బెదిరించాడు.
వ్యభిచార ముఠా, గంజాయి గ్యాంగులతో సంబంధాలు కారణంగా మారణాయుధాలు కూడా అతడి దగ్గర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అది కూడా సినిమాల్లో ఏవైనా మారణాయుధాలను చూస్తే..అచ్చం అలాంటి వాటినే తయారు చేయించి తన దగ్గర పెట్టుకున్నట్టు పోలీసులు తేల్చారు. ఎవరైతే తన మాట వినరో వారికి కత్తులు, తుపాకులను చూపించి చంపేస్తానని బెదిరిస్తున్నట్టు చెప్పారు.
తన మొదటి భార్య ఎదురు తిరగడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురిని అమ్మేస్తానని చెప్పడమే కాకుండా, కత్తులు, తుపాకులతో బెదిరించాడని ఆమె కంచరపాలెంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకోకపోవడంతో ఆమె మహిళా సంఘలను ఆశ్రయించింది. అయితే బాధిత మహిళలు మాత్రం అరుణ్ కుమార్ కు పోలీసులతో స్నేహ సంబంధం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగడంతో అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి దగ్గర నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని.. అతడిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అతడి బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.