నందిగ్రామ్ సంగ్రామ్.. అందరి చూపు అటువైపే..
posted on Mar 31, 2021 @ 5:52PM
నాలుగు రాష్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగతున్నా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం పశ్చిమ బెంగాల్ ఒక్కటే. బెంగాల్ శాసనసభలో 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయినా అన్నింటిలో ఒక్క స్థానం మాత్రం చాలా ప్రత్యేకం. అదే నందిగ్రామ్. ఇక్కడి నుంచే 15 ఏళ్ల క్రితం మమతా బెనర్జీ, అప్పటి వామపక్ష కూటమి ప్రభుత్వంపై భూపోరాట సమర శంఖాన్ని పూరించారు. అప్పుడు ఆమె కుడు భుజంగా నిలిచిన నేత సువేందు అధికారి. ఆ ఇద్దరు సాగించిన పోరాటమే 34 ఏళ్ళు ఎదురులేకుండా రాష్ట్రాన్నిపాలించిన వామపక్ష కూటమి ప్రభుత్వానికి చరమ గీతం పాడింది.
ఇప్పుడు ఆ నియోజక వర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. అంతే కాదు, ఆమె ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి. ఆయనా సామాన్యుడు కాదు. సింగూరు ఉద్యమ కాలం నుంచి నిన్న మొన్నటి వరకు మమత బెనర్జీ కుడి భుజంగా పనిచేసిన, నందిగ్రామ్ నియోజక వారం సిట్టింగ్ ఎమ్మెల్యే.అంతే కాదు ఈ ప్రాంతం అధికారి ఫ్యామిలీ సామ్రాజ్యం. ఒక్క నందిగ్రామ్ నియోజక వర్గం మాత్రామే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఓడజనుకు పైగా నియోజక వర్గాల్లో ‘అధికారి’ ఫ్యామిలీదే అధికారం.అందులోనూ నందిగ్రామ్ సువేందు ఫ్యామిలీ కంచుకోట. అందుకే, ఇంకొకరు, ఇంకొకరు అయితే, నందిగ్రామ్ లో సువేందు అధికారిని ఎదుర్కునే సాహసం చేయరు. కానీ, మమతా బెనర్జీ, సువేందు అధికారి చేసిన సవాలును స్వీకరించి బరిలో దిగారు. మరో నియోజక వర్గం నుంచి పోటీ చేయడం లేదు. అంటే, ఈ నియోజక వర్గంలో ఆమె ఓడిపోతే, ఆమె పార్టీ అధికారంలోకి వచ్చినా, మూడవ సారి ముఖ్యమంత్రి కావాలన్న ఆమె ఆశ మాత్రం నెరవేరదు. ఆ విధంగా చూస్తే ఆమె చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. అందుకే, నందిగ్రామ్ పోరును, దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.
అదలా ఉంటే, గురువారం సెకండ్ ఫేజ్’లో పోలింగ్’కు వెళ్ళే ఈ నియోజక వర్గంలో అటు, తృణమూల్,ఇటు బీజేపీ చివరి క్షణం వరకు,హోరాహోరీగా ప్రచారం సాగించాయి. ప్రచారం ప్రారంభంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నందిగ్రామ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం సాగించారు. చివరకు ఫినిషింగ్ టచ్, కేంద్ర హోం మంత్రి అమిత్ ఇచ్చారు. ప్రచార గడువు ముగిసిన మంగళవారం అమిత్ షా, రోడ్ షో నిర్వహించారు. మమతా బెనర్జీ ఇంటి గడప వరకు వెళ్లి మరీ ప్రచారం చేశారు. నందిగ్రామ్ లో తమ తాత్కలిక నివాసం కోసం మమతా బెనర్జీ అద్దెకు తీస్కున్న రెండస్తుల భవనానికి కేవలం 500 మీటర్ల దూరంలోని శివాలయంలో స్వామి దర్శనం చేసుకుని, అక్కడే కార్యకర్తలు, నాయకులతో కలిసి దోసకాయలు తిన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన షా, నందిగ్రామ్ నియోజక వర్గం నుంచి సువేందు అధికారి భారీ మెజారిటీతో గెలుస్తున్నారని ప్రకటించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు, మమతా బెనర్జీ వరసగా మూడు రోజులు సొంత నియోజక వర్గంలోనే బస చేసి, రోడ్ షో, బహిరంగ సభల్లో ప్రసంగించారు. మరో నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న నందిగ్రామ్ ప్రజ్లపి ఉన్న విశ్వాసంతో ఒకే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. అందుకే బీజేపీ , తృణమూల్ రెండు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్న నందిగ్రామ్ సంగ్రామం, మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్, అన్నట్లుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.