సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?
posted on Apr 1, 2021 8:36AM
కుందూరు జానారెడ్డి.. నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి తెలంగాణలో అత్యంత సీనియర్ రాజకీయ నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్న నాయకుడు. కాంగ్రెస్ గెలవకపోవడంతో 2014 నుంచి 18 వరకు పెద్దలు జానా రెడ్డే సీఎల్పీ నేతగా ఆయనే ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వస్తే జానారెడ్డి వదులుకున్నారట. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చినా వదిలేసిన గొప్ప నాయకుడు జానారెడ్డి అని కీర్తించారు. తెలంగాణకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు చెప్పిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రాజకీయ కాక రేపుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న ప్రధాన పార్టీలు... తమ బలగాలన్నంతా సాగర్ లోనే మోహరించాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి , సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తుండటంతో .. ఆయన టార్గెట్ గా గులాబీ లీడర్లు ఆరోపణలు చేస్తున్నారు. మంగళవారం సాగర్ బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. జానారెడ్డికి శాశ్వతంగా రెస్ట్ ఇస్తామని అన్నారు. దీంతో జానా రెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సీరియస్ గా స్పందించారు.
తెలంగాణ రాష్ట్రం రావడానికి జానారెడ్డి కారణమని చెప్పారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఉద్యమ సమయంలో జానారెడ్డి కి సీఎం పదవి ఆఫర్ ఇచ్చినా తీసుకోలేదంటూ సంచలన విషయం బయటపెట్టారు. తాను ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం రాదంటూ.. ఆ పదవిని వదులుకున్న గొప్ప నాయకుడు జానారెడ్డి అని చెప్పారు. జనారెడ్డి ఇన్నేళ్ల రాజకీయంలో కొడుకులని కానీ కుటుంబ సభ్యులని ఎవరని రాజకీయాల్లోకి తీసుకురాలేదన్నారు. కేసిఆర్ కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయని షబ్బీర్ అలీ విమర్శించారు. జనారెడ్డి పెట్టిన బిక్ష తో కెసిఆర్ సీఎం అయ్యారని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆనాడు జానారెడ్డి సీఎం అయితే కేసీఆర్ ఎక్కడ వుండేవాడిని ప్రశ్నించారు. జానారెడ్డి పై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని మల్లు డిమాండ్ చేశారు. కెసిఆర్ రాజకీయ పతనం దుబ్బాక లో ప్రారంభమైందని.. నాగార్జున సాగర్ ఎన్నిక తరువాత తెలంగాణలో నిజమైన రాజకీయ పునరేకీరణ జరుగుతుందని మల్లు రవి అన్నారు.
జానారెడ్డి ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారంటూ షబ్బీర్ అలీ, మల్లు రవి చేసిన ప్రకటనపై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. రోశయ్య హయాంలో ఉద్యమం ఉధృతంగా మారడంతో... కాంగ్రెస్ హైకమాండ్ కలవరపడింది. ఉద్యమాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారనే కారణంతో రోశయ్యను తప్పించి.. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అయితే తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఆ సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత జానా రెడ్డిని సీఎం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని జానా రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు చెప్పినా.. అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజీలో ఉండటంతో ఆయన వెనుకంజ వేశారని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తెలంగాణ ప్రజల దృష్టిలో ద్రోహీగా మిలిగిపోతాననే భయం వల్లే జానా రెడ్డి.. అందివచ్చిన పదవిని వదులుకున్నారని కొందరు కాంగ్రెస్ నేతల అభిప్రాయం
తెలంగాణ తొలి దశ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో అనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎగిసిపడింది.1978లో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ మర్రి చెన్నారెడ్డిని ఢిల్లీకి పిలిపించి మంతనాలు జరిపింది. కాంగ్రెస్ లో చేర్చుకుని ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. దీంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం చల్లారింది. ఈ ఘటనలన్ని తెలుసు కాబట్టే జానారెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.