పంజాబీ గాయకుడు దలేర్‌కు రెండేళ్లు జైలు
posted on Jul 14, 2022 @ 9:25PM
ఏ దేశంలోనైనా గాయకుడు అనగానే చెవికోసుకునేవారు చాలామందే వుంటారు. అందులోనూ ఇటీవలి కాలంలో జానపద బాణీలపట్ల పిచ్చి ఎక్కువైంది. మరీ ముఖ్యంగా పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ అంటే పడిఛస్తున్నారు. అతని పాట అనగానే వయసుతో నిమిత్తంలేకుండా చిన్నా పెద్దా అంతా ఉర్రూతలూగుతారు. అంత క్రేజ్ వున్న గాయకుడు ఊహించని విధంగా మానవ అక్రమ రవాణా కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం.
పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ అప్పీల్‌ను పాటియాలా అదనపు సెషన్స్ జడ్జి తోసిపుచ్చింది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పాటియాలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో అక్రమంగా వ్యక్తుల తరలింపు కేసులో ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత దలేర్ మెహందీకి బెయిల్ వచ్చింది. ఈ నిర్ణయాన్ని దలేర్ మెహందీ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. గురువారం అదనపు సెషన్స్ జడ్జి దలేర్ మెహందీ అప్పీల్‌ను తిరస్కరించారు. 2003లో దలేర్ మెహందీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు అయింది. ప్రొబేషన్‌పై విడుదల చేయాలని ఆయన చేసిన దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. విదేశాల్లో పాటలు పాడేందుకు వెళ్లినపుడు తన వెంట కొంత మంది వ్యక్తులను తాత్కాలిక వీసాలపై ఆయా దేశా లకు తీసుకెళ్లి అక్కడే ఒదిలేసేవారు. ఇలా ఈయన పాటల ప్రోగ్రాం జరిగిన దేశాల్లోకి అక్రమంగా వ్యక్తులకు తీసుకెళ్లి అక్కడే ఒదలిపెట్టేవారు.
ఇందులో దలేర్ మెహందీతో పాటు ఆయన సోదరుడు షంషేర్ ప్రమేయం కూడా ఉందని తేలింది. ముఖ్యంగా విదేశాల్లో స్థిర పడా లనుకునే వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. విదేశాల్లో ఒదిలి పెట్టి రావడానికి కొంత డబ్బును దలేర్ మెహందీ తన సోదరుడితో కలిసి తీసుకున్నట్లుగా పోలీసులు అభియోగం మోపడంతో పాటు సాక్ష్యాలతో సహా ఋజువు చేశారు. దీంతో ఆయన కోర్టు శిక్ష వేసింది.
2003లో సదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మెహందీ సోదరులు 1998, 1999లో రెండు సార్లు ఇలా చేసి నట్లుగా ఆరోపణలున్నాయి. ఆ సమయంలో పదిమందిని గ్రూప్‌లో సభ్యులుగా యుఎస్‌కు తీసుకెళ్లి అక్రమంగా వదిలిపెట్టారని ఆరోపించారు. మొదటి ఫిర్యాదును నమోదు చేసిన తర్వాత.. గాయకుడిపై పోలీసులకు మరో 35 ఫిర్యాదులు అందాయి.
కొంతమంది ఫిర్యాదుదారుల ప్రకారం.. దలేర్ మెహందీ కొంత మంది వ్యక్తులను అక్రమంగా విదేశాలకు (ఎక్కువగా కెనడా, యుఎస్) పంపడానికి బదులుగా వారి నుంచి దాదాపు రూ. 12 లక్షలను తీసుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బుకు బదులుగా తన విదేశీ కార్యక్రమాలలో డ్యాన్స్ ట్రూప్‌లలో భాగంగా వారిని విదేశాలకు పంపుతానని వాగ్దానం చేసేవారు. దీని తరువాత, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని దలేర్ కార్యాలయంపై దాడి చేసి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న తరువాత పంజాబ్ పోలీసులకు దలేర్ మెహందీకి వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించాయి.