ఏపీ రోడ్లపై అడుగుకో స్విమ్మింగ్ పూల్
posted on Jul 15, 2022 6:24AM
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోలేదు..పొరుగు రాష్ట్రం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. అన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారాలంటూ దుమ్మెత్తి పోశారు. పైపెచ్చు వారం వారం రోడ్ల పరిస్థితిపై జగన్ సమీక్షలు నిర్వహించారు. అద్దాల్లాంటి రోడ్లు.. సాఫీ ప్రయాణం అంటూ గప్పాలు కొట్టుకున్నారు.
నాలుగు రోజులు వానలు పడ్డాయో లేదో ఏపీలో రోడ్ల బండారం బయట పడిపోయింది. ఈ మూడేళ్లలో చిన్న గుంత కూడా పూడ్చలేదని రుజువై పోయింది. ఇటీవలే చేసిన సమీక్షలో జూలై 15 నాటికి రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండదని జగన్ ఆర్భాటంగా ప్రకటన కూడా చేశారు. నిజమే కాబోలు అనుకునే వారికి దిమ్మ తిరిగేలా వాస్తవ పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన జూలై 15 వచ్చేసింది. నిజమే రోడ్లపై ఒక్క గుంత లేదు. బోలెడు గుంతలు ఉన్నాయి. ఇంచుమించు అడుగుకో గుంత ఉందంటే అతిశయోక్తి కాదు.
వర్షాలకు ఆ గుంతలు ఈత కొలనులను తలపిస్తున్నాయి. దాదాపు అన్ని పట్టణాలు, నగరాలు, పల్లెల్లో రోడ్ల పరిస్థితి ఇదే. ఎవరైనా హఠాత్తుగా చూస్తే ఇక్కడ రోడ్డేది.. అన్నీ నీటి కొలనులేగా అంటారు. ఆ గంతల రోడ్లపైనే, ఈ నీటి తటాకాల్లోనే అత్యంత ప్రమాకర పరిస్థితుల్లో వాహనదారులు ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్లా..ఈత కొలనులా అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఏపీలో రోడ్ల దుస్థితిపై ఫొటోలు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. పోనీ ఇప్పుడైనా జగన్ సర్కార్ ఈ రోడ్ల మరమ్మతులు చేపడుతుందా అంటే ఆ అవకాశమే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పనులు చేయిద్దామని ప్రభుత్వం ఒక వేళ పొరబాటున అనుకున్నా.. చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏపీలో ఉంది. వైసీపీ నేతలే ప్రభుత్వ కాంట్రాక్టులా అయ్యబాబోయ్ అని పారిపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏపీ రోడ్లను ‘ఏ దేవుడూ’ బాగు చేయలేడు.