కోల్‌కతాలో బిగ్ బీ గుడి.. వీరాభిమానానికి మచ్చుతునక
posted on Jul 14, 2022 @ 8:28PM
అభిమానం ఉండవచ్చు. వీరాభిమానంతోనే ఇబ్బంది. రాజకీయ నాయకులకు, సినీస్టార్స్‌కీ ఇటీవలి కాలంలో వీరాభిమానులే ఎక్కువయ్యారు. వాళ్లకోసం ఎంతటి కష్టమైన పనయినా, చిత్రమైన పనయినా చేసేస్తారు. కటౌట్లు, శిలావిగ్రహాలు పెడతారు, పాలాభిషేకం చేస్తారు. ఆమధ్య ఎప్పుడో ఖుష్బూ అనే దక్షిణాది నటికి ఏకంగా గుడికట్టారట వీరాభిమానులు. అలానే కోల్‌కతాలో బిగ్ బి అమితాబ్‌కీ గుడికట్టారు. 2017లో సర్కార్ చిత్రం సూపర్ హిట్ కావడంతో కోల్‌కతా అమితాబ్ బచ్చన్ అభిమానుల సంఘం గుడి కట్టేసారు. సుబ్రాతా బోస్ అనే శిల్పిచేత ఆరడగుల, రెండు అంగుళాల పొడవైన విగ్రహాన్ని తయారుచేయించారు.
బాలీఉడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ వుంది. యాంగ్రీయంగ్‌మాన్ స్టార్ డమ్‌తో దేశంలో యువతను విపరీతంగా ఆకట్టుకున్నా నటుడు అమితాబ్. డాన్, జంఝీర్, షోలే, మర్ద్, బాగ్‌బన్, మొహబ్బతే వంటి విరుద్ధమైన చిత్రాల్లో అమితాబ్ నటనకు యావత్ సినీ ప్రేక్షకులూ ఫిదా అయ్యారు. రవీంద్రనాధ్ టాగోర్ జీవితాన్ని ఆధారం చేసుకుని ఒక ఇంగ్లీషు సినీ సంస్థ అమితాబ్ ప్రధాన పాత్రగా సినిమా తీయాలనుకున్నారు. అయితే ఎందుకో ఆ ప్రాజెక్టు వెనకబడింది. దాన్ని గురించి మళ్లీ ఏ సమాచారమూ లేదు.
వయసు మీద పడుతున్నా, ఇప్పటికీ తగిన పాత్రలు ఎంపిక చేసుకుని మరీ అందరి మనసూ దోచుకుంటన్నాడు. ఆమధ్య ఆర్జీవీ చిత్రం సర్కార్ లో, అలాగే పింక్ అనే చిత్రంలోనూ తన నటనా పటిమను మరోసారి రుచి చూపారు బిగ్ బీ. కోల్‌కతా తిల్జాలా వెళితే అక్కడ ఈ గుడిని చూడవచ్చు. అమితాబ్ విగ్రహం ఆరడుగుల రెండు అంగుళాలు వుంటుంది. ఇది పూర్తిగా ఫైబర్‌గ్లాస్‌తో తయారుచేసింది. అంతా బాగానే వుంది మరి ఈ గుడిలో పూజ చేస్తారా, భజనలు పాడతారా అన్నది చిన్న సందేహం. బిగ్ బి పుట్టినరోజు కాస్తంత హడావుడి చేయవచ్చునేమో. ఒకవేళ భజన చేయాల్సి వస్తే.. రంగ్ బర్‌సే యానమహ, తేరీ బిందియారేనమహా, మై పల్‌దో పల్ కా షాయరూనమహొ, ఓ సాథిరేనమహ.. అంటూ పాటలతో కలిపి అర్చన చేస్తారేమో!