బీజేపీ సర్ప యాగాన్ని కేసీఆర్ అడ్డుకుంటారా?
posted on Jul 14, 2022 @ 11:56AM
రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. అందుకే రాజకీయ శతృ మిత్ర సంబంధాలు, ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారి పోతుంటాయి. బీజేపీ విషయాన్నే తీసుకుంటే, ఒకప్పడు కమల దళం సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఎ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న,మిత్ర పక్షాలు చాలా వరకు ఇప్పుడు ఆ కూటమిలో లేవు. అవి ఇప్పడు బీజేపీ మిత్ర పక్షాలు కాదు. ఒకప్పుడు అటల్ బిహరీ వాజ్ పేయి 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. పోరాపచాలు వచ్చిన అయిదేళ్ళు సర్కార్’ను నడిపించారు. అలాగే, 2014లో బీజేపీ ఒంటరిగా మెజారిటీ సాధించినా, మోడీ ఫస్ట్ కాబినెట్’లో మిత్ర పక్షాలకు స్థానం కల్పించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించారు. నిజమే, ఇప్పటికీ, మోడీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వమే, కానీ, కేంద్ర మంత్రివర్గంలో బీజేపీయేతర పార్టీలకు చెందిన మంత్రులు, ఇద్దరు ముగ్గరు కంటే లేరు.
కేంద్ర మంత్రివర్గంలోనే కాదు, ఎన్డీఎలో మిగిలిన పార్టీలను కూడా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చును.ఒకప్పుడు, బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం మొదలు భావసారుప్యత ఉన్న శివసేన, అకాలీ దళ్ సహా అనేక పార్టీలు మిత్ర బంధాన్ని తెంచుకుని బయటకు వెళ్లి పోయాయి, కాదు, చాలా వరకు పార్టీలకు మోడ్ షా జోడీ, పొమ్మన కుండ పొగబెట్టి బయటకు పంపారని అంటారు.2014ఎన్నికల తర్వాత రెండేళ్ళకో ఏమో, మొదలైన కమల దళం మిత్ర పక్షాలను సమిధలుగా చేసే సర్ప యాగం 2019 ఎన్నికల నాటికే చాలావరకు పూర్తయింది.
ఇక 2019 ఎన్నికల్లో, బీజేపీ సొంత బలం మరింతగా పెరిగి 303 కు చేరిన నేపధ్యంలో, మోడీ షా జోడీ మిత్ర పక్షాలను మెల్ల మెల్లగ సాగనంపే వ్యూహానికి మరింతగా పదును పెట్టారు. 2019 ఎన్నికల్లో, శివసేన, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జన శక్తి, అకాలీ దళ్, అన్న డీఎంకే, జేడీ(యు)తో పాటుగా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి చిన్నాచితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు ఎండీఎ కూటమిలో ఉన్నాయి. ఎన్నికలో పోటీ చేసి, గెలిచాయి. అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాలకే ప్రధాన మిత్ర పక్షాలు. శివసేన, అకాలీ దళ్, ఎల్జీపీ ఇలా ఒకొక్క పార్టీ బయటకు వెళ్లి పోయాయి.
అలా వెళ్ళిపోయిన పార్టీలను అయినా, బీజేపీ వదిలేసిందా అంటే లేదు. ఎల్జీపీని రెండు ముక్కలు చేసింది. ఒక వర్గాన్ని చేరదీసి రెండవ వర్గాన్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఎల్జీపీ అస్తిత్వం కోల్పోయింది. రేపో మాపో బీజ్పీలో విలీనం అయ్యేదుకు సిద్ధంగా ఉంది.మహారాష్ట్రలో శివసేన పరిస్థితి ఏమిటో చూస్తూనే ఉన్నాం.బీజేపీ ప్లాన్ సంపూర్ణం అయితే, శివసేన సైతం త్వరలోనే చరిత్రగా మిగిలిపోతుంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే. మెల్టింగ్’ మొదలైంది. మరో రెండు మూడు నెలల్లో జరిగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత శివసేన చరిత్ర ముగింపుకు చేరుతుందని, అందులో సందేహం లేదని అంటున్నారు.
అలాగే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు నేత నితీష్ కుమార్’ ను సొంత పార్టీలోనే వంత్రిని చేయడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్ అయిందనే అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులను బీజేపీ తమ వైపు తిప్పుకుని, నితీష్ కుమార్’ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రి వర్ఫ్గంలో ఉన్న జేడీయు ఆర్సీపీ సింగ్’ను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్దమైన నేపధ్యంలో, నితీష్ కుమార్, ఆయనకు రెండవసారి రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నితీష్, సింగ్ మధ్య దూరం మరింత పెరిగింది. త్వరలో సింగ్’ బీహార్ షిండే కాబోతున్నారని తెలుస్తోంది.
అయితే, బీజేపీ టార్గెట్ మిత్రపక్షాలేనా అంటే కాదు ... అదివేరే కథ. కమల దళం అన్ని పార్టీలను సమదృష్టితోనే చూస్తోంది. అందుకే .. ఇప్పడు తెలంగాణలో కలకలం మొదలైంది. అందుకే రెండున్నర గంటల ప్రెస్ మీట్’లో ముఖ్యమంత్రి కేసేఆర్’ రెండు వందల సార్లు, షిండే పేరు తలచుకున్నారు. తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. కానీ, ప్రస్తుతం హ్యాండ్, మాంచి రైజింగ్’ లో ఉన్నా మోడీ, షా జోడీని కేసీఆర్ తట్టుకోగలరా? కమల దళం సర్పయాగాన్ని అపగలరా? అంటే, అది ఇప్పుడే చెప్పలేమని, పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు అయితేనే కానీ, క్లారిటీ రాదని అంటున్నారు.