కేరళలో వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్ వైరస్?
posted on Jul 14, 2022 @ 1:54PM
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘మంకీపాక్స్’ ఇప్పుడు భారత్ కూ పాకింది. . ఒక పక్కన కరోనా మహమ్మారి ప్రపంచ జనాభాను పట్టి పీడిస్తుండగానే మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ 59 దేశాల్లో 8 వేల 200 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
మంకీపాక్స్ తో ముగ్గురు మరణించారు. ఇంతవరకు భారతదేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదన్న ఊరటకు చెక్ పడింది. దేశంలోనే తొలి మంకీ పాక్స్ కేసు కేరళలో వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ గురువారం వెల్లడించారు. మంకీపాక్స్ లక్షణాలతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడని, అతని నుంచి సేకరించిన నమూనాలను వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్లు వీణా జార్జ్ తెలిపారు. పుణె ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాతే మంకీపాక్స్ ధ్రువీకరించగలమని మంత్రి పేర్కొన్నారు. వ్యాధి బాధితుడిగా భావిస్తున్న వ్యక్తి యుఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడని వీణా జార్జ్ వెల్లడించారు.
మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న వ్యక్తి ప్రస్తుతం వైద్య నిపుణుల అబ్జర్వేషన్ లో ఉన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయితే.. దేశంలో తొలి మంకీపాక్స్ కేసు ఇదే అవుతుంది. ఇంతకు ముందు ఉత్తర ప్రదేశ్ లోని ఐదేళ్ల చిన్నారికి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు వచ్చాయి. ఆ చిన్నారి నమూనాలను పరీక్షించినప్పుడు ఆమెకు మంకీపాక్స్ నెగెటివ్ వచ్చింది. దీంతో ఆమెకు మంకీపాక్స్ లేదని నిర్ధారించారు. తాజాగా లక్షణాలు కనిపించిన కేరళ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయితే.. ఇదే దేశంలో తొలి మంకీపాక్స్ కేసుగా రికార్డులకు ఎక్కుతుంది.
నిజానికి ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇంత వరకు నమోదైన మంకీపాక్స్ కేసుల్లో 80 శాతం ఐరోపా దేశాల్లోనే కనిపించాని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జులై 11 నాటికి అమెరికాలో సుమారు 800 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 1958లో పరిశోధన కోసం తీసుకొచ్చిన కోతుల్లో ఈ వైరస్ బయటపడింది. దీంతో ఈ వైరస్ ను మంకీపాక్స్ అని పిలుస్తున్నారు. మంకీపాక్స్ రావడానికి కొద్ది రోజుల ముందు సాధారణంగా జ్వరంతో కూడి ఫ్లూ, తలనొప్పి వస్తాయని, కొద్ది రోజుల తర్వాత ముఖం మీద దద్దుర్లతో మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తాయని, ఆ తర్వాత చేతులతో పాటు శరీరానికి ఈ దద్దుర్లు వ్యాపిస్తాయని వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ వైరస్ ఇన్ క్యుబేషన్ సమయం 5 నుంచి 21 రోజులు ఉంటుందని వారు వెల్లడించారు.