ఎంపీ అర్వింద్ పై దాడి.. ఫోన్ చేసి వివరాలు కనుక్కున్న అమిత్ షా
posted on Jul 16, 2022 @ 10:27AM
సర్వేలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా.. రాష్ట్రంలో ముక్కోణపు పోరు తథ్యమని పరిశీలకులు చెబుతున్నారు. గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని, అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు తెరాసకు దీటుగా బలోపేతమయ్యాయనీ విశ్లేషకులు అంటున్నారు. ఈ
పరిస్థితే రాష్ట్రంలో రాజకీయ అసహనం పెచ్చరిల్లడానికి దోహదపడుతున్నదని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం విమర్శను సహించలేకుంటే.. బీజేపీ కూడా అదే స్థితిలో రెచ్చిపోతున్నది. విమర్శలు రాజకీయ మర్యాద హద్దు దాటి చాలా కాలమైంది. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాల్సిన పార్టీలు రాజకీయ శత్రు శిబిరాల్లా మోహరిస్తున్నాయి.
దేశంలో అసహనం పెచ్చరిల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో అంతకు మించి అన్నట్లుగా రాజకీయ అసహనం పెచ్చరిల్లిన పరిస్థితి నెలకొంది. తాజాగా వరద సహాయ కార్యక్రమాల పరిశీలనకు వెళ్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడి జరిగింది. ఈ దాడి వెనుక టీఆర్ఎస్ కుట్ర ఉందని బీజేపీ ఆరోపిస్తున్నది. కుట్రలు, హస్తాల సంగతి పక్కన పెడితే ఒక ఎంపీపై ఈ స్థాయిలో దాడి జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో అవగతమౌతుంది.
భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామంలో సహాయ కార్యక్రమాల పరిశీలనకు వెళ్లిన ఎంపీ అర్వింద్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. ఆయన మెడలో చెప్పుల దండ వేయడానికి ప్రయత్నించారు. కాన్వాయ్ ని అడ్డుకొని అద్దాలు పగల కొట్టారు. అత్యంత పకడ్బందీగా ఈ దాడి జరిగిందని బీజేపీ ఆరోపిస్తున్నది. సకాలంలో పోలీసుల జోక్యం చేసుకుని ఎంపీని అక్కడ నుంచి సురక్షితంగా పంపేశారు. ఈ దాడి వెనుక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కుట్ర ఉందని ఎంపీ అర్వింద్ ఆరోపిస్తున్నారు.
కాగా టీఆర్ఎస్ బీజేపీపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహమే దాడులకు కారణమని చెబుతోంది. ధర్మపురి అర్వింద్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల కారణంగానే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ శ్రేణుుల అంటున్నాయి. విమర్శలను సహించలేని టీఆర్ఎస్ రాష్ట్రంలో గూండాగిరి చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ దాడి తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంపి అర్వింద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా తెలంగాణలో ఇటీవలి కాలంలో ఇటువంటి దాడులు పెచ్చరిల్లాయి. ఎంపీ బండి సంజయ్ పై కూడా గతంలో ఓసారి దాడి జరిగింది. ఆయన కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణుులు దాడికి పాల్పడ్డాయి. అలాగే ఎంపీ అర్వింద్ పై దాడి కూడా ఇదే మొదటి సారి కాదు.