హర్యానా అధికారులలో విజిలెన్సు వణుకు
posted on Jul 16, 2022 @ 4:36PM
అవినీతి సర్వాంతర్యామి.. ఇందు గలదు అందు లేదను సందేహం వలదు.. అయినా, అవినీతిని చూసీ చూడనట్లు వదిలేయడమే కానీ, పట్టు పట్టి, తుడిచేసే ప్రయత్నం సహజంగా, ఏ ప్రభుత్వమూ చేయదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల అవినీని జోలికి వెళ్లేందుకు, ఏ ముఖ్యమంత్రీ సాహసించరు. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల జోలికి వెళితే, ఏమవుతుందో అనుభవపూర్వకంగా తెలిసిన రాజకీయ పెద్దలు, ఎవరి జోలికైనా వెళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగుల జోలికి మాత్రం వెళ్ళకు, వెళ్ళావో నిన్ను ఇంటికి పంపిస్తారని, రాజకీయ వారసులకు, జూనియర్ నాయకులకు సలహాలు ఇస్తుంటారని అంటుంటారు.
అయితే అందుకు విరుద్ధంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర లాల్ ఖట్టార్, (బీజేపీ) ప్రభుత్వం, అవినీతిపై ఏకంగా పెద్ద యుద్ధాన్నే ప్రకటించింది.రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి పచ్చిన ఫిర్యాదుల విచారణకు ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో విజిలెన్స్ అధికారులు.. ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.వల.. కాదు .. వలలు విసిరారు, ఏకంగా 83 మంది గవర్నమెంట్ ఉద్యోగులను అరెస్టు చేశారు. కౌంట్ ఇంకా కొనసాగుతోంది.
ఇంకో విశేషం ఏమంటే, అరీస్ట్ అయిన వారిలో గుమస్తా చేపలే కాదు, గెజిటెడ్ చేపలు ఉన్నాయని, విజిలెన్స్ అధికారుల సమాచారం. డిప్యూటీ ఎక్సైజ్, టాక్సేషన్ కమిషనర్‌ను కూడా బ్యూరో అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. అలాగే, అరెస్టయిన వారిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ శాఖకు చెందిన 18 మంది పోలీసు సిబ్బందికి చెందిన 23 మంది, విద్యుత్ శాఖకు చెందిన 15 మంది, పట్టణ, స్థానిక సంస్థలకు చెందిన 8 మంది, ఎక్సైజ్, పన్నుల శాఖకు చెందిన ముగ్గురు ఉన్నారు.
ఈ అందరినీ కూడా, రూ.5,000 నుంచి రూ.5 లక్షల వరకూ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నమని హర్యానా విజిలెన్స్ బ్యూరో అధికారి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే, జీతం ప్లస్ నిజానికి అందరికీ కాకపోయినా లంచాలకు అలవాటు పడిన ఉద్యోగులు జీతం పై కంటే ‘ప్లస్’ పైనే ఎక్కువ మక్కువ చూపుతారని అంటారు. చేతులు తడిపే పోస్టుల కోసం పోటీ పడతారు. రాజకీయ నాయకుల చేతులు తడుపుతారు. అంతకు పదితలు సంపాదించుకుంటారు. ఏ చిన్న పని చేయలన్నా, అది వారి బాధ్యతే అయినా, చేతులు చాపడం అనేది ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కామన్ అయిపొయింది. అయితే, ఇప్పుడు హర్యానాలో మాత్రం లంచం ఇస్తామన్నా పుచ్చుకునేందుకు ఉద్యోగులు భయపడుతున్నారట. భయంతో వణికిపోతున్నారట. అంటే కాదు హిట్ లిస్టులో ప్రముఖంగా ఉన్న అధికారులు అయితే సెలవులు పెట్టీ మరీ వెళ్లిపోతున్నారు.
అదలా ఉంటే హర్యానా ప్రభుత్వం, లంచమ డిగే అధికారులపై ఫిర్యాదు చేసేందుకు హర్యానా విజిలెన్స్ బ్యూరో 1800-180-2022, 1064 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసింది. అవును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో ఎప్పుడో ఇలాంటి ప్రయోగం ఒకటి చేశారు.. కానీ, ఆ ఫోన్ .. మొదటి కాల్ నుంచి ఇప్పటి వరకు ముగానోములోనే ఉందని, మౌనవ్రతం చేస్తోందని అంటున్నారు.