విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న పడవ.. భద్రాచలంలో ఒకరి గల్లంతు
posted on Jul 16, 2022 7:23AM
ఊరేదో ఏరేదో తెలియని పరిస్థితి. భారీ వర్షాలు వరదలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అనేక ప్రాంతాలు నీట మునిగాయి. నిన్న మొన్నటి దాకా కార్లూ మోటార్ బైకుల మీద తిరిగిన రోడ్లు ఇప్పుడు నదులుగా మారాయి. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడానికి రోడ్లపై పడవలు తిరుగుతున్నాయి. రోడ్ల మీద వాహనాలు తిరుగుతున్నప్పుడు మానవ తప్పిదాల వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. అవే రోడ్లపై పడవలపై వెళుతుంటే కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి ఊహించని ప్రమాదాలు. ఎవరి పొరపాటూ, తప్పిదం లేకుండానే జరుగుతున్న ప్రమాదాలు. అలాంటి యాక్సిడెంట్ ఒకటి తీవ్ర విషాదాన్ని నింపింది. గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తుండటంతో భద్రాచలం వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
భద్రాచలంలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పడవలపై తరలిస్తున్నారు. అలా తరలిస్తుండగా ఓ పడవ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొంది. అవును నిజమే నీటిలో ప్రయాణిస్తున్న పడవ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొంది. ఎందుకంటే ఆ పడవ వెళుతున్నది నదిలో కాదు... నడి రోడ్డుపై. పూర్తిగా ముంపునకు గురైన రహదారిపై జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పడవ ఒకటి రోడ్డు పక్కన నీటిలో మునిగి పోయిన విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని తిరగబడింది. ఈ సంఘటనలో పడవలో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నా ఓ వ్యక్తి మాత్రం గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నదుల్లో తిరగాల్సిన పడవలు ఇప్పడు భద్రాచలంలో నడిరోడ్డుపై తిరుగుతున్నాయి. రోడ్డుపై వాహనంలో ప్రయాణిస్తుంటే ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో కనిపిస్తుంది. అదే నీట మునిగిన రోడ్డుపై పడవలో ప్రయాణిస్తుంటే నీటి కింద ఎక్కడ విద్యుత్ స్తంభం ఉందో( మునిగిపోయి), ఎక్కడ ఇళ్లు ఉందో, ఎక్కడ చెట్టు ఉందో కనిపించదు. కనుచూపు మేరంతా గోదారే. ఇప్పుడు భద్రాచలంలో పరిస్థితి అదే.