దేవుడి సొమ్ముకూ జగన్ సర్కార్ ఎసరు!
posted on Jul 16, 2022 @ 11:31AM
ఎవరేమనుకుంటే నా కేంటి.. అంతా నా ఇష్టం..ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం చెడ మడ చేలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం అన్నట్లుగా జగన్ సర్కార్ చెలరేగిపోతోంది. చివరికి జగన్ సర్కార్ దేవుడి సొమ్మకు కూడా ఎసరు పెట్టేసింది. మహాకవి శ్రీశ్రీ కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. తలుపు గొళ్లెం.. కాదేదీ కవిత కనర్హం అంటే జగన్ మాత్రం వాటి సంగతి ఎందుకు దేవుడి మన్యం, దేవుడి సొమ్ము, దేవాలయాల ఆదాయం ఇవేవీ స్వాహాకి అనర్హం కాదని చెబుతున్నారు. అడవులు, కొండలు కరిగించేసి సొమ్ము చేసుకున్న సర్కార్ ఇప్పుడు దేవుడి సొమ్ముపై కన్నేసింది.
దేవాలయాల డిపాజిట్లను రద్దు చేయాలని ఎండోమెంట్ కమిషనర్ ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేవాలయాల బ్యాంకు ఖాతాలు వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ఈ నెల 1 వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి 45 కోట్ల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్లను ఈవోలు క్యాన్సిల్ చేశారు. మొత్తంగా దేవాలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడం ద్వారా 500 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ టార్గెట్ గా చెబుతున్నారు.
ఆయా దేవాలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడం ద్వారా వచ్చిన నగదును ఆలయ అధికారులు కామన్ గుడ్ ఫండ్ (సీజెఎఫ్)కు జమ చేస్తున్నారు. సీజేఎఫ్ నిధులను ఆలయాల జీర్ణోద్ధరణకే ఉపయోగించాల్సి ఉండగా దేవాదాయ శాఖ మాజీ మంత్రి వాటిని ఇష్టానుసారం బదలాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు కూడా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరి అభ్యంతరాలూ, ఆందోళనలను పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల దేవాలయాలలో ఎఫ్ డీలను రద్దు చేయడానికి జగన్ సర్కార్ సిద్ధమైపోయింది. ఇలా ఎఫ్ డీల రద్దు ద్వారా 500 కోట్ల రూపాయలు సమీకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రోజువారిగా ఆలయాల డిపాజిట్ల రద్దుపై దృష్టి సారించారు దేవాదాయ శాఖ అధికారులు. గతంలో అవినీతి కేసులో ఏసీబీకి చిక్కిన ఒక దేవాదాయ శాఖ ఉన్నతాధికారి సూచన మేరకు జగన్ సర్కార్ ఈ డిపాజిట్ల రద్దుకు తెరతీసిందని చెబుతున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లా అయినివిల్లిలంక వినాయక టెంపుల్, నెల్లూరు జిల్లా మూలస్థానేశ్వరస్వామి దేవాలయం, విజయవాడ యనమలకుదురు శివాలయం 30లక్షల రూపాయల చొప్పున ఎఫ్ డీలను రద్దు చేయగా, సింగరాయపాలెం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి 20 లక్షల రూపాయల డిపాజిట్లు క్యాన్సిల్ అయ్యాయి.
కాగా అత్యధికంగా వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి 60 లక్షల రూపాయల డిపాజిట్లను ఉప సంహరించారు. ఎన్టీఆర్ జిల్లా కోటిలింగాల ఆలయం డిపాజిట్లు 40 లక్షల రూపాయలను ఉపసంహరిం చారు. రానున్న రోజులలో ఈ డిపాజిట్ల క్యాన్సిలేషన్ మరింత వేగం పుంజుకోనుందని దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు. మరి దేవాలయాల అత్యవసర భారీ ఖర్చులకు మళ్లీ ప్రభుత్వాన్ని దేవాలయ అధికారులు ప్రాధేయపడవలసిందేనా?