ఏమని సూచించుదు ప్రభూ..!
posted on Jul 16, 2022 @ 11:37AM
మనసులోని కోరిక..వినిపించుమా వసంత మాలికా..అంటూ అబ్బాయికి తన మనసులో మాట తెలియ జేయమని అమ్మాయి పూలను వేడుకుంటుంది.. మన ప్రధాని మోదీగారు జనానికి ఇచ్చే సందేశంలో దేన్ని కీలకంగా ప్రస్తావించాలన్నదీ ప్రజల్నేచెప్పమని అంటున్నారు. సాధారణంగా మన్ కీ బాత్ పేరుతో దేశ ప్రజలకు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడం ప్రధాని అనవాయితీగా పెట్టుకున్నారు. తాను రాబోయే కొద్ది కాలంలో ఏం చేయబోతున్నది, జరిగిన సంఘటనలు, సందర్బాల గురించి వివరిస్తూ ప్రజలకు కొంత రాజకీయ జ్ఞానం ప్రసాదించేవారు. పాపం దేశంలో రాజకీయపరిస్థితులతో హడావుడి పడుతున్న ప్రధానికి ఈ సారి ప్రజలకు ప్రత్యేకంగా సందేశం ఇవ్వడానికి ఏమీ లేక ప్రజల నుంచే సలహాలు, సూచనలూ అడుగుతున్నారు.
ఇంతకీ ప్రజల నుంచి ఏమి ఆయన ఏమి ఆశిస్తున్నట్టు? తమ పాలన అద్భుతంగా వుందన్న అనకూల తను ఆశిస్తు న్నారా, దేశమంతా కాషాయం చేయడానికి సూచనలు అడుగుతున్నారా అన్నది బిజెపీ వర్గాలన్నా తెలి యజేయాలి. ప్రజల్ని తమ పార్టీవైపు తిరగాలని, తమ సిద్ధాంతాన్నే శిరోధార్యంగా చేసుకుని అందరూ బిజెపీ ఘన విజయానికి, పాలనా సౌలభ్యానికి వీలుకల్పించాలన్న ఆకాంక్షనే వ్యక్తం చేయాలని కోరుకుం టున్నారా? ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ బిజెపి వర్గాలు, వీరాభిమానులు ఆయా ప్రభుత్వ కార్యకలాపాల్లో అడ్డంకులు సృష్టిస్తూ కేంద్రాన్ని బలోపేత చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. విభేదాలు, తిరస్కరణలు, ఆరోపణలు బొత్తిగా సహించలేని తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దేశంలో కమలనాధులు మోదీ విజయానికి, బిజెపి విజయానికి అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఎన్నికల్లో రెడ్ కార్పెట్ పరచడానికే పూనుకున్నారు. ఇందుకోసం అక్కడి రాజకీయ పరిస్థితులను ధ్వంసం చేయడానికి వెనుకాడటం లేదు. ఇంతటి మహా గణం ఫాలోయింగ్ వుండగా మామూలు ప్రజల నుంచి ప్రధాని సూచ నలు, సలహాలు అడగడం దేనికి? అంటే, రాష్ట్రాల్లో తమ పార్టీ పరిస్థితిని, రాజకీయ నిబద్ధతను ప్రజల నోటినుంచే ప్రధాని వినదలచుకున్నా రేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాది కంటే ఇపుడు దక్షిణాదివైపే కమలనాధులు ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చి తీరాలన్న లక్ష్యం మాటి మాటికీ బిజెపీ వర్గీయులు వ్యక్తంచేస్తున్నారు. కానీ అందుకు పరిస్థిలులు ఎంతవరకూ అనుకూలిస్తున్నాయి, ప్రజలు ఏమేరకు నమ్ముతున్నారన్నది అంచనాలు అంత సానుకూలంగా లేవు. ఇటీవల అనేకరకాల సర్వేలన్నీ రెండు రాష్ట్రాల్లో బిజెపి సత్తా ఏమిటన్నది తేటతెల్లం చేశాయి. ఆంధ్రా మాట ఎలా వున్నా, తెలంగాణాలో మాత్రం ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో, మారుతూన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ బిజెపీ కంటే మేలుగా వుందన్నది తెలిసింది. ఇప్పటి కిప్పుడు ఎన్నికలు పెడితే తప్పకుండా కేసీఆర్ దిగిపోతారన్న ప్రచారం గట్టిగా చేయించుకున్న బిజెపి, ఇపుడు సర్వేల్లో మూడవ స్థానంలో నిలిచింది. ఇది తెలంగాణా బిజెపీ వర్గాలకు కాస్తంత ఇబ్బందికర సమాచారమే. మొన్నటివరకూ అనేక చర్చా వేదికల మీద బిజెపి నేతలు ఊకదంపు ఉపన్యాసాల్లో టిఆర్ ఎస్, కాంగ్రెస్ ల మీద విరుచుకుపడ్డారు. కానీ ఈ వీరులకు అంత సీన్ లేదని సర్వేలు తేటతెల్లం చేశా యి. ఈ నేపథ్యంలో మరి ప్రధాని మోదీ రెండు రాష్ట్రాల ప్రజల నుంచి ఏమన్నా వీరాభిమానం కోరుకుం టున్నారేమో తెలియాలి.
పరిపాలన సుభిక్షంగా వుంటే, అందరిచేతా శభాష్ అనిపించుకుంటే, పథకాలు, ఆలోచనలు సవ్యంగా వుండి అమలులోనూ ప్రజాహితం ప్రదర్శిస్తే ప్రధాని తమ మన్ కీ బాత్ లో ఏ అంశాన్ని ప్రత్యేకించి ప్రస్తా వించాలన్నది ప్రజలనుంచి కోరనక్కర్లేదేమో! పోనీ ఎవరయినా ఇదుగో ఈ అంశం గురించి ప్రస్తావిం చండి సార్ అని చెప్పాలనుకుంటే MyGov, Namo App. అనేదానికి షేర్ చేయవచ్చు.