మద్యం షాపులు మళ్లీ ప్రైవేటుకే!
posted on Jul 16, 2022 @ 1:52PM
ఆదాయం కోసం జగన్ సర్కార్ నానా తిప్పలూ పడుతోంది. ఇంత కాలం అనుసరించిన విధానాలతో ఆదాయం సమకూరడం లేదు కనుక విధానాలు మార్చుకునైనా సరే ఆదాయాన్ని పెంచుకోవడమే ఏకైక లక్ష్యంగా ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది.
ఆలయాల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడానికీ వెనుకాడటం లేదు. అయినా అప్పులకుప్ప ప్రభుత్వానికి అదే మూలకి.. ఎటు తిరిగి ఎటు వచ్చినా ప్రభుత్వం దృష్టంతా మద్యం విక్రయాల మీదే. మద్యం విక్రయాలను ఎంతగా పెంచుకుంటే అంతగా ఆదాయం వచ్చే బంగారు బాతుగుడ్డు అని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సీఎం జగన్ ఎన్నికల ముందు దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం అని ఇచ్చిన హామీని కన్వీనియెంట్ గా మర్చిపోయి.. దశల వారీగా సంపూర్ణ మద్యపాన పథకానికి తెరతీశారు.
సొంత బ్రాండ్లను ప్రభుత్వం చేతే అమ్మించిన ఆయన ఇప్పుడు మద్యం ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి వాటికి ప్రైవేటుకు అప్పగించడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ భారీగా అప్పులు తీసుకున్న జగన్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ దుకాణాలను పూర్తిగా ఎత్తివేసి మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఉన్నత స్ధాయి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరంలో పాతిక వేల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని విక్రయించిన ప్రభుత్వం 20 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రభుత్వ అధ్వర్యంలో దుకాణాల నిర్వహణ వల్ల పూర్తి స్థాయిలో మద్యం ద్వారా ఆదాయం రావడం లేదా అన్న మధన ప్రభుత్వంలో మొదలైందని చెబుతున్నారు.
ఎక్సైజ్ వర్గాలూ ఇదే చెబుతున్నాయి. మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగిస్తే ఇప్పుడొస్తున్న ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నెలకు 19 వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందనీ, అదే ప్రైవేటుకు అప్పగిస్తే ఇది రమారమి 38 వందల కోట్లకు పెరిగే అవకాశం ఉందనీ ఎక్సైజ్ శాఖ అంచనా. దానికి తోడు మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగిస్తూ కొత్త విధానాన్ని అమలులోనికి తీసుకు వస్తే దుకాణాలకు దరఖాస్తుల రూపేణ సొమ్ము వస్తుంది. అలాగే లైసెన్సు ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా తక్కువలో తక్కువ వెయ్యి కోట్ల రూపాయల తక్షణ ఆదాయం సమకూరుతుందన్నది ప్రభుత్వ భావన.
ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం ఆదాయం గతంలో పోలస్తే పెరిగినా... మరింత పెరిగేందుకు స్కోప్ ఉందన్న భావంతోనే జగన్ సర్కార్ కొత్త విధానానికి (గతంలో ఉన్నదే) ఉపక్రమిస్తున్నది. ఒక విధంగా జగన్ రివర్స్ విధానానికి ఇది కొనసాగింపే అని చెప్పాలి. ప్రభుత్వ మద్యం దుకాణాల పేర జే బ్రాండ్ అంటూ దేశంలో ఎక్కడా లేని బ్రాండులను తీసుకువచ్చి, అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించేయనుంది. ఇందుకు ప్రభుత్వం చెబుతున్న కారణం ప్రభుత్వ దుకాణాలలో మద్యం విక్రయాలు పెరగడం లేదని. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించుకుని కొందరు, ధరలను భరించలేక నాటు సారాకు అలవాటు పడి మరి కొందరూ ప్రభుత్వ మద్యం దుకాణాల వైపే రావడం లేదని ఇంత కాలానికి ప్రభుత్వం గుర్తించింది.
ఆ కారణంగా ఆదాయానికి గండి పడుతోందని, అందుకే మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటికే బార్ల విధానాన్ని మూడేళ్లకు పెంచి సంపూర్ణ మద్య నిషేధం అజెండాలోనే లేదని జగన్ సర్కార్ చెప్పకనే చెప్పింది. ఇప్పుడు మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించేసి.. వాటి సంఖ్యలు విపరీతంగా పెంచేసి మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేసేందుకు రంగం సిద్ధం చేసేసింది. ప్రస్తుతం మద్యం ద్వారా పాతిక వేల కోట్ల ఆదాయం వస్తోంది.. దానిని నలభై వేల కోట్లకు పెంచే లక్ష్యంతో జగన్ సర్కార్ మద్యం పాలసీని మార్చే నిర్ణయం చేసింది. అదే జరిగితే ఇక ఫ్రీ బీస్ అమలు చేయడానికి ఆర్థిక అవరోధాలు ఉండవన్నది జగన్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది.