బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే పనులు నాసిరకం..!
posted on Jul 24, 2022 7:48AM
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న సామెతలా ఉంది ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఘనంగా ప్రారంభించిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే. యూపీలో అత్యంత వెనుక బడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ నుంచి ఢిల్లీకి అనుసంధానం చేస్తూ నిర్మించిన ఈ ఎక్స్ ప్రెస్ వేను కేంద్రం కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్మించింది.
ఆ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మోడీ ఇటీవలే ప్రారంభించారు. ఈ ఎక్స్ ప్రెస్ వేతో బుందేల్ ఖండ్ ముఖచిత్రమే మారిపోతుందంటూ మోడీ ఘనంగా ప్రకటించారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ణానం ఉపయోగించి నిర్మించిన ఈ ఎక్స్ ప్రెస్ వే దేశం పురోగామి బాటలో పయనిస్తున్నదనడానికి తాజా ప్రత్యక్ష నిదర్శనమని మోడీ అన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ వే చిత్రాలు, వీడియోలు దేశ వ్యాప్తంగా అందరూ చూశారు. బీజేపీ అయితే అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ లను తలదన్నే లాంటి ఎక్స్ ప్రెస్ వేను మోడీ ఇండియాలో అదీ వెనుకబడిన బుందేల్ ఖండ్ లో నిర్మించారంటూ తెగ భుజాలు చరిచేసుకుంది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.
అయితే ఈ సారి అది బీజేపీ ప్రచారార్భాటంలోని డొల్ల తనాన్ని, కేంద్రం నిర్మించిన ఈ ఎక్స్ ప్రెస్ వే పనులు ఎంత నాసిరకమో తేటతెల్లం చేసేసింది. ఇటీవలి వర్షాలకు బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేపై పలు చోట్ల రోడ్డు కొట్టకుపోయింది. గోతులు పడిపోయింది. రాకపోకలకు ఏ మాత్రం అనువుగా లేకుండా పోయింది.వేల కోట్లు పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని గప్పాలు కొట్టుకున్న కేంద్రం అవమానంతో తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే వర్షాలకు ఎక్స్ ప్రెస్ వే దెబ్బతినడంపై నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. మోడీ సర్కార్ ప్రచారార్భాటాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అవినీతి రాజ్యమేలుతోందంటూ విమర్శలు గుప్పించే మోడీ.. బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే వెనుక అవినీతి ఎవరిదో చెప్పాలని నిలదీస్తున్నారు. ఎక్స్ ప్రెస్ వేలు ప్రకృతి వైపరీత్యాలలో సైతం దెబ్బతినకుండా ఉండేలా నిర్మిస్తారు. కానీ బుందేల్ ఖండ్ రహదారి మాత్రం చిన్న పాటి వర్షాలకే ధ్వంసమైంది. భారీ వరదలు రాలేదు. రహదారిపై నీటి ప్రవాహం లేదు. వర్షానికే రహదారి ఛిద్రమైంది. అంటే ఈ ఎక్స్ ప్రెస్ వే ఎంత నాసిరకంగా నిర్మించారో ఇట్టే అర్థమైపోతోంది. దీనిపై మోడీ పెదవి విప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
అవినీతి అంటే ఇదని ఫోటోలు పెట్టి చూపిస్తున్నారు. సాధారణంగా ఎక్స్ ప్రెస్ వేలు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల్లోనూ దెబ్బతినకుండా స్ట్రాంగ్‌గా నిర్మిస్తారు. కానీ భయంకరమైన వరదలేమీ రాకుండానే ఆ ఎక్స్ ప్రెస్ వే చాలాచోట్ల దెబ్బతింది. రిపేర్లు చేసి మళ్లీ ఎక్స్ ప్రెస్ వేను వినియోగంలోకి తీసుకు రావొచ్చు కానీ.. అసలు మరక మాత్రం బీజేపీ ప్రభుత్వంపై పడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్వాకం అంటూ విపక్షాలు విమర్శించాడనికి అవకాశం చిక్కింది. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన అనేకఎక్స్ ప్రెస్ వేలు… ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని స్ట్రాంగ్‌గా నిలబడ్డాయని ఫోటోలుపెడుతున్నారు.