ఈడీ దూకుడు ప్రతిపక్షాలే టార్గెట్
posted on Jul 24, 2022 6:12AM
ప్రతిపక్ష పార్టీల భయాలు నిజం అవుతున్నాయి. సీబీఐ,ఈడీ,ఎన్ఐఎ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పార్టీల నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవంక నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. మరో వంక కేంద్ర దర్యాప్తు సంస్థలను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పభుత్వం దుర్వినియోగ పరుస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం విపక్షాల ఆందోళన, అభ్యంతరాలను అంతగా పట్టించుకున్నట్లు లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది., ప్రభుత్వ పాత్ర. ప్రమేయం లేదని,కోర్టుల ఆదేశాల మేరకే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని కేంద్ర మంత్రులు, అధికార బీజేపీ నాయకులు విపక్షాల విమర్శలను కొట్టి వేస్తున్నారు.
అదలా ఉంటే, అదే సమయంలో ఈడీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ బిగ్ షాకిచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ నేత, మమతా దీదీ మంత్రివర్గంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పార్థా చటర్జీని అరెస్ట్ చేసింది. వివరాలలోకి వెళితే, 2018 లోపార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో, రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పార్థా ఛటర్జీ అనుచరుడు అర్పితా ముఖర్జీ నివాసంలో స్వాదీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు శుక్రవారం మంత్రి పార్థా ఛటర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యా మండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, మరికొందరి నివాసాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించారు. పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ్, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.
అనుచరుడు అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఏకంగా రూ.20 కోట్ల నోట్ల కట్టలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ), ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో అవకతవకలకు సంబంధించిన కేసులో సోదాలకు వెళ్లిన అధికారులకు ఈ డబ్బు దొరికింది. దర్యాప్తులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. అనంతరం.. మంత్రి పార్థా చటర్జీని ఈడీ అరెస్టు చేసింది.
అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన రూ.20 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవేనని భావిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. నగదుతో పాటు 20కి పైగా సెల్‌ఫోన్లను అర్పితా ముఖర్జీ నివాసం నుంచి జప్తు చేసినట్లు తెలిపింది. నేరాన్ని నిరూపించడంలో ఉపయోగపడే పత్రాలతో పాటు డొల్ల కంపెనీల వివరాలు, విదేశీ కరెన్సీ, బంగారం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తుల వద్ద లభించాయని వెల్లడించింది. పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.
నిజమే, చట్టం ముందు అందరూ సమానమే, అవినీతికి పాల్పడిన వారిని రక్షించాలని ఎవరూ .. కోరుకోరు. కానీ,..ప్రతిపక్ష పార్టీల నాయకులను, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే దాడులు, సోదాలు, అరెస్టులు జరగడమే అనుమానాలకు తావిస్తోంది.