ఉలిపి కట్టె బీజేపీ!
posted on Jul 23, 2022 @ 5:44PM
దేశంలో బీజేపీ వారు బొత్తిగా భరించలేని వారి పెద్ద జాబితాలో ఇక మిగిలింది కమేడియన్స్! యువ హాస్యనటుడు మునావర్ ఫరూఖీ ఎక్కడికి వెళ్లినా షోలు రద్దవుతుండటమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. ఈమధ్యనే బంగళూరులో ఆయన ప్రదర్శన రద్దు చేయాలని పోలీసుల నుంచి తాఖీదు అందుకున్నారు నిర్వాహకులు. హిందూ జాగరణ్ సమితి, జై శ్రీరామ్ సేనా అనే రెండు హిందూత్వ సంస్థల సూచనల మేరకే పోలీసులు తాఖీదును పంపారన్నది నిర్వాహకులకూ అర్ధమయింది.
ఫారూకీ షో ఇలా ఆగిపోవడం ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు ఓ డజను సార్లు ఇలా జరిగింది. మామూలుగా చట్ట ప్రకారం చూస్తే పోలీసులకు ఈ షో ఆపాల్సిన అవసరం ఎంత మాత్ర మూ లేదు. అంతే కాదు భారీ బందోబస్తు పెట్టా ల్సిన గత్యంతరమూ ఉండేది కాదు. కానీ పోలీసులు హిందూ జాగరణ్ వారి హెచ్చరికలను అమలు చేయాల్సి వచ్చింది. చిత్రమేమంటే ఇదే బంగళూరు వేదిక మీద గతంలో మూడు పర్యాయాలు ఆయన షోలు జరిగేయి. ఈ పోలీసులే పొట్టచెక్కల య్యేలా నవ్వారుట! మధ్యప్రదేశ్‌లో వలె కర్ణాటకా కూడా బీజేపీ పాలనలోనే ఉంది. అక్కడయితే ఫరూకీ రాజకీయ జోక్ పేల్చి ఏకంగా జైలు పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోనూ వారంట్లు జారీ అయ్యాయి.
అసలు కమెడియన్స్‌తో మరీ ముఖ్యంగా ఫరూకీతో బీజేపీ వారికి వచ్చిన ఇబ్బందేమిటి? హిందూత్వ వీరులకు ఈయన ఎందు కు నచ్చలేదు? విదూషకుని పాత్ర గురించి అందరికీ తెలిసినదే. అలాగంటే, మహారాష్ట్రలో ప్రదర్శించే తమాసా వంటి జానపద ప్రదర్శనల్లో హాస్యగాడు ఉంటాడు కదా? అలాగే రామ్‌లీలా నాటకాల్లో మరి అంతా హాస్యగాళ్ల హాస్య ధోరణితోనే గ్రామాల్లో రాత్రిళ్లు తెల్లారుతుంటాయి. మరి మడిసి అన్నాక కూసంత ఆస్యం ఉండాలంటారు గదా! అసలే కార్మికులు, కర్షకులతో నిండి, రోజూవారి కష్టాలతో బతుకులు ఈడుస్తున్న ప్రజలూ, ఈమాత్రం హాస్యానికీ నోచుకోకూడదని ప్రభుత్వాలే నిర్ణయించేస్తే ఎలా? అలాంటపుడు సంఘ్ వ్యవస్థ సమర్థించే స్వయం ప్రకటిత హిందూ నాగరికతని తామే కాపాడుతున్నామన్న అతి భావనలో ఉన్నవారు జోకులను ఎందుకు భరించలేకపోతున్నారు?
ఫరూఖీపై దాడి చేయడం దేనికి అంటే , ఫరూఖీ ఒక ముస్లిం, హిందూత్వ మితవాదం ముస్లింలను జాతీయ స్రవంతి నుండి పక్కకు నెట్టాలని నిశ్చయించుకుంది. ఈ ఏడేళ్లలో మతోన్మాదం పెరగడం విస్తరించడం చూసిన ఎవరికైనా దాన్ని బహిరంగంగా చెప్పనవసరం లేదు. వివిధ రాష్ట్రాల్లోని బిజెపి పరిపాలనలు ఉన్మాద సంస్థలు, ఫ్రీలా న్సర్‌ల ప్రయత్నాలను దయతో చూశాయి, మద్దతు కూడా ఇచ్చాయి. పోలీసులూ సంతోషంగా సహకరిస్తున్నారు.
కానీ కమెడియన్లు ప్రస్తుత రాజకీయాల మీద కాస్తంత వెటకారంతో విసిరే మాటలు, జోక్స్‌ను హిందూత్వ కార్యకర్తలకు బొత్తిగా మింగుడు పడకుండా ఉంది. జీవితాన్ని, విమర్శల్ని సరదాగా తీసుకోవడం కూడా చేతకాని వారు అధికారంలో ఉండటమే దుర దృష్టం. 2002 గుజరాత్ అల్లర్ల సమయలో ఫరూక్ కామెడీ షో ఒక చిత్రమైన అంశాన్ని లేవనెత్తింది.. అసలా గొడవల్లో జునాగఢ్ కుర్రాళ్లెవరూ పాల్గొనలేదని, కారణం వాళ్లంత బద్ధకిస్టులు మరొకరు లేకపోవడమేననీ. ఇలాంటి జోకులు మతతత్వ అంశాలకు మతోన్మాద దర్పణం చూపకుండా ఉండవు కనుక వీటిని ఆ మహానుభావులెవరూ సరదాగా తీసుకోలేరు.
ఏడేళ్లలో ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించని ప్రధాని గుజరాత్‌లోని జర్నలిస్టుల పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉన్నారు. టెలివిజన్ ఛానెల్స్, అనేక ప్రింట్ పబ్లికేషన్‌లు వంటి బిజెపి అనుకూల మీడియా ప్రోత్సాహం పొందుతుంటే, మిగిలినవి దూషణకు గురవుతున్నాయి. కీలకమైన వ్యవసాయ చట్టాలు రద్దయిన సెషన్‌తో సహా ఐదు సెషన్‌ల కోసం పార్లమెంటు సెషన్ కవర్ చేయడానికి ప్రెస్‌లకు అను మతి లేదు. మన ప్రభుత్వాలనిర్వాకం ఇలా ఉంది మరి.