అడుగు బయటపెట్టకుండానే అనుకున్నది సాధించారు!
posted on Aug 30, 2022 @ 11:11AM
సీపీఎస్ ఉద్యోగుల సెప్టెంబర్ 1 చలో విజయవాడ వాయిదా పడింది. ఈ విషయాన్ని సీపీఎస్ ఉద్యోగులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ వాయిదా ప్రకటన ఒక లాంఛనం మాత్రమే. ఏపీలో సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం జరగకుండా చూసేదుకు ఏపీ సర్కార్ ఏకంగా వారిపై యుద్ధాన్నే ప్రకటించింది.
బైండోవర్ కేసులు, ఉద్యోగులకు సెలవులు లేవంటూ నిబంధనలు విధించింది. దాదాపు నెల రోజులుగా ఉపాధ్యాయులపై వేధింపులు తీవ్ర తరం చేసింది. బ్యాస్కట్ బాల్, వాలీబాల్ వంటి ఆటల్లో మేన్ టు మేన్ అని ఒక వ్యూహం ఉంటుంది. సీపీఎస్ ఉద్యోగుల కట్టిడికి వైసీపీ అదే వ్యూహాన్ని అనుసరించినట్లు కనిపిస్తోంది. ఒక ఉద్యోగికి ఒక పోలీస్ అన్నట్లుగా పోలీసు వ్యవస్థను వినియోగించుకుంది. నోటీసులు ఇచ్చింది. విజయవాడ వెళితే ఖబడ్దార్ అని హెచ్చరించింది.
ఇవి చాలవని భయపడిందో ఏమో విజయవాడలో వేలాది మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. రాష్ట్రంలో ప్రభుత్వానికి సీపీఎస్ ఉద్యోగులకే మధ్య యుద్ధం జరుగుతోందా అన్న వాతావరణాన్ని కల్పించింది. సామాన్య జనం కూడా టీచర్ల ఆందోళనలను అణచివేయడానికి ఇంత చేయాలా అని భావించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇక జగన్ నివాసానికి వెళ్లే దారులన్నిటినీ ఇప్పటికే మూసేశారు. టీచర్లు ముట్టడించకుండా ఉండేందుకు ప్రభుత్వమే సీఎం ఇంటిని ముట్టడి చేసింది. చీమ కూడా ఆ ముట్టడిని దాటి రాలేని పరిస్థితి ఏర్పరిచింది. రోడ్ల పక్కన నాలుగైదు అడుగుల ఎత్తున ఇనుప ముళ్ల కంచెలు పెట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ప్రకటించినది రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు మాత్రమే. ప్రభుత్వం మాత్రం మొత్తం రాష్ట్రమంతా ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందా అన్న లెవల్ లో చలో విజయవాడను భగ్నం చేయడానికి ఏర్పాట్లు చేసింది. వారు చివరి క్షణంలో అంటే సెప్టెంబర్ 1కి రెండు రోజుల ముందే వారు చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించినా.. ఇప్పటికే వారు సాధించాల్సింది సాధించేశారు.
ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టారు, భయపెట్టారు. వారి చలో విజయవాడ పిలుపునకు ప్రభుత్వం వణికిపోయిందన్న భావన సామాన్య జనాలలో సైతం కలిగించగలిగారు. ఇది సీపీఎస్ ఉద్యోగుల ఘన విజయంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం మాత్రంప్రభుత్వాన్ని వారిలా టెన్షన్ పెట్టడం పెద్ద సక్సెస్. ముందు ముందు దీన్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.