తల్లిని రక్షించిన గెవిన్
posted on Aug 30, 2022 @ 12:30PM
కొన్ని సంఘటనలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఆయా సంఘటనల్లో పిల్ల లూ హీరోలయిపోతుంటారు. ఊహించని సంఘటనల్లో ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచనలతో వెంటనే స్పందించడం అనేది అవతలివారికి ఎంతో మేలు చేస్తుంది. గెవిన్ తన తల్లిని కాపాడాడు.
పదేళ్ల గెవిన్ ఏం చదువుతున్నాడు, బడికి సరిగా వెళుతున్నాడా, గుడ్ స్టూడెంటా.. అనే ప్రశ్నలతో చుట్టు పక్కలవారూ, పక్కంటి పిన్నిగారూ వేధించలేదు. గెవిన్ ని తమ ఊరు హీరో అనేశారు. పిల్లవాడయినా ఎంత వేగంగా, చురుగ్గా ఆలోచించాడమ్మా.. అనుకున్నారు వెనకింటి బామ్మగారు, ఎదురింటి బాబాయి గారూ .. పిల్లడు పదేళ్లవాడయితేనేమి.. వాళ్ల డాడీ ఇవ్వాల్సిన రక్షణ వాడే చేసేడన్నారంతా.
ఓక్లహామాలో ఓ చిన్న కుటుంబం. తల్లీ, పిల్లడూ స్విమింగ్‌పూల్‌లో ఆడుకోవడం ఓ సరదా. కానీ మొన్నీ మధ్య తల్లి ఒక్కతే స్విమింగ్‌పూల్‌లో దిగింది. పిల్లడు ఎక్కడో ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఆమె మామూ లుగానే పాడుకుంటూ తిరుగుతూంది. పిల్లాడి కోసం ఎదురుచూస్తోంది. పిలుద్దామనే అనుకుంది. కానీ అంతలోనే హఠాత్తుగా ఆమె పల్టీకొట్టింది. ఊపిరాడనంత పనయింది. నీళ్లు మింగేసింది. నీటిలోకి దిగిపోయేలోగానే అదృష్టం ఆమెను రక్షించింది. సరిగ్గా అప్పుడే ఆమె పదేళ్ల పిల్లవాడు గెవిన్ అటుగా వచ్చాడు. తల్లి అరుపులు విని పరుగున స్విమ్మింగ్‌పూల్‌లోకి అమాంతం దూకేశాడు. చిత్రమేమంటే ఆమెను బయటికి లాగేయగలిగాడు. అదీ ఆమె మొహాన్ని నీటి పైకి పట్టుకుని పూల్ చివర ఉన్న మెట్లమీద వరకూ తీసుకువచ్చి ఆమెను పైకి లాగేడు. అంతలో తండ్రి పరుగున వచ్చాడు.
ఇదెలా సాధ్యం.. అన్న ప్రశ్నకంటే పిల్లాడు ప్రదర్శించిన తెలివినే అందరూ మెచ్చకున్నారు. నీటిలో మునిగిపోతున్న తల్లి అరవగానే దూకడం సరే. కానీ అంత మనిషిని వాడు మెడపట్టుకుని తలను నీటి పైనే ఉంచేట్టు చేసి తీసుకురావడమే గొప్ప విషయమని అన్నారంతా. మనూళ్లో అయితే దీన్నే దైవేచ్ఛ అనేవారు. ఏమయినప్పటికీ ఓక్లహామాలో గెవిన్ నివాస ప్రాంతంలో మాత్రం గొప్ప హీరోగా అందరి మెప్పూ పొందుతున్నాడు.
ఆ తల్లి ఫేస్‌బుక్‌లో తన గెవిన్ తనకు దేవుడు అంటూ రాసింది. వాడివల్లే మళ్లీ ఊపిరిపీల్చుతున్నా నన్న ది. వాడు నాకు మరో జన్మని ప్రసాదించాడన్నది.