పులివెందులలో జగన్ బస్టాండ్ కథ!
posted on Aug 30, 2022 @ 3:56PM
ఇంట గెలిచి.. రచ్చ గెలువు అనేది పెద్దలు చెప్పిన మాట. అంటే ముందు ఇంటిని చక్కదిద్దుకుని ఆ తర్వాత ఇతర వ్యవహారాలు చేస్తే మంచిదనేది దాని అర్థం. అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తరచుగా వినియోగించే వ్యంగ్యాస్త్రం ఇది. ఇప్పుడు రాజశేఖరరెడ్డి తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కే ఆయన మాటలు సరిగ్గా సరిపోతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కొనసా...గుతున్న బస్టాండ్ నిర్మాణం కథ అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
నవరత్నాలంటారు.. సంక్షేమ పథకాలంటారు.. ఆంధ్రుల ప్రజా రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడతారు. అభివృద్ధి అంటారు.. స్కూళ్లలో ఇంగ్లీషు మాధ్యమం అని చెబుతారు. అక్కచెల్లెమ్మలకు అంత చేస్తా ఇంత చేస్తా అంటూ గొప్పలు చెబుతారు. పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు ఇస్తామంటారు. నోటికి వచ్చిన హామీ ఇచ్చేసి.. ఖజానా ఖాళీ చేసి ఆనక ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఓట్లేసిన ప్రజల్ని వారి మానాన వారిని వదిలేస్తారు. ఏపీకి తానేదో చేశాననే భ్రమలోనే కబుర్లు చెబుతుంటారు.
ఇంత చెప్పుకుంటున్న జగన్ తనను అఖండ మెజార్టీతో గెలిపిస్తున్న పులివెందుల ప్రజలకు ఏమి చేశారనే ప్రశ్న వస్తే.. మాత్రం జనం నోరెళ్లబెట్టడమే సమాధానంగా ఉంటుంది. అందుకు పులివెందుల బస్టాండ్ ప్రత్యక్ష నిదర్శనం అంటారు. నిజానికి సీఎం సొంత నియోజకవర్గం అంటే అభివృద్ధిలో ఎలా ఉండాలి? మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా కనిపించాలి. పులివెందులలోని బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు కూర్చునే సౌకర్యం మాట దేవుడెరుగు.. కనీసం నిలబడేందుకు కూడా అవకాశం లేనట్లు ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ‘ఉన్నదీ పోయే.. తెచ్చుకున్నదీ పోయే’ అనే తీరులో పులివెందులలో అన్ని హంగులతో కొత్త బస్టాండ్ కట్టేస్తామంటూ గొప్పగా చెప్పిన జగన్ సర్కార్ ఉన్న పాత బస్టాండ్ ను కూలగొట్టేసింది. ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినప్పటికీ కొత్త బస్టాండ్ ను నిర్మించలేదంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. పాత బస్టాండ్ ప్రాంతంలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు.. తీవ్రంగా అవస్థలు పడుతుండడంతో తాత్కాలికంగా తాటాకులతో చిన్న పందిరి వేసినా.. అది ఎండ నుంచి కానీ, వర్షం నుంచి కానీ ఏమాత్రం కాపాడలేకపోతోంది. ఏ కొంచెం గాలి వీచినా దాని టాప్ లేచిపోతోంది. దాంతో పాటు పాత భవనం కూలగొట్టిన బస్టాండ్ ఆవరణలో దుమ్ము ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే.. వారి బాధలు వర్ణనాతీతం.
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులివెందులలో అత్యాధునిక హంగులతో కొత్త బస్టాండ్ నిర్మాణానికి ఒక డిజైన్ ను ప్రభుత్వం రెడీ చేసింది. ఆ డిజైన్ ఓ రంగుల కలలా, గ్రాఫిక్స్ మాయాజాలంలా రూపొందించింది. కానీ సీఎం అయి, మూడేళ్లయినా బస్టాండ్ నిర్మాణం అతీగతీ లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయినా.. సొంత నియోజకవర్గం ప్రజలకు బస్టాండ్ కూడా కట్టించలేని జగన్ ఇక ఏపీకి రాజధాని నగరాన్ని అదీ ఒకటి కాదు మూడు ఎలా కట్టగలరు? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా అమరావతి రాజధాని కోసం సిద్ధం చేసిన డిజైన్ ను ప్రతిపక్ష నేతగా జగన్, వైసీపీ నేతలు కూడా దాన్ని ‘గ్రాఫిక్స్ మాయాజాలం’ అంటూ విమర్శించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు పులివెందుల కొత్త బస్టాండ్ విషయంలో జగన్ చేసింది గ్రాఫిక్స్ మాయాజాలం కాక మరేమిటనే ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ డిజైన్ ను కూడా గ్రాఫిక్స్ మాయాజాలంగానే భావించి, దాని నిర్మాణాన్ని గాలికి వదిలేశారంటూ నెటిజన్లు సీఎం జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో పులివెందులలో తాటాకు బస్టాండే ప్రయాణీకులకు గతి అంటూ సోషల్ మీడియా వెక్కిరిస్తోంది.
ఒక పక్కన పులివెందులలో పాత బస్టాండ్ కూలగొట్టి, తాటాకులతో వేసిన బస్టాండ్ ఆవరణను, మరో పక్కన ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పంలో నిర్మించిన శాశ్వత బస్టాండ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియా షేర్ చేస్తూ ఓ రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటో కుప్పం బస్టాండ్ ను చూసి అయినా జగన్ నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రజా రాజధాని సంగతి దేవుడెరుగు.. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ కూడా నిర్మించలేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అవడం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
వైఎస్ కుటుంబానికి పెట్టని కోట పులివెందుల అభివృద్ధిని పట్టించుకోని జగన్ ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175కు 175 అసెంబ్లీ స్థానాలూ గెలుస్తామని జగన్ చెప్పడంలో అతి అనిపించడం లేదా? అంటున్నారు.