వరదనీటిలో బెంగుళూరు.. పీఎం కు నెటిజన్ల సవాళ్లు!
posted on Sep 6, 2022 @ 3:59PM
దేశంలోనే అత్యంత ప్రశాంత నగరంగా, ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు భూతల నరకంగా మారిపోయింది. రహదారులు చెరువులయ్యాయి. భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణికింది. దారీ తెన్నూ కానరాక జనం నానా అవస్థలూ పడుతున్నారు. నగరంలో ఏ దారి చూసినా గోదారే అన్నట్లుగా తయారైంది. భారీ వర్షాలకు రహదారులు, హైవేలు మునిగాయి. అయితే వీలువెంటనే పరిస్థితులను అదుపులోకి తీసుకువస్తామని ప్రజలు ఆందోళనపడాల్సిన అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మై ప్రజలకు హామీనిచ్చారు. అయితే, నెటిజన్లు మాత్రం బీజేపీ పాలిత రాష్ట్ర రాజధాని నగరం వర్షంలో మునిగిందంటూ ఏకంగా ప్రధాని మోదీకే ట్వీట్లు చేస్తూ విమర్శలు గుప్పి స్తున్నారు.
ఇదిలా ఉండగా, గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఆనాలోచిత విధానాల వల్లనే సైబర్ సిటీ బెంగు ళూరు ఇవాళ వరద పరి స్థితులకు చిక్కుకుందని ముఖ్యమంత్రి బొమ్మై మంగళవారం మీడియా తో అన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వమే కాలువలు, బఫర్ జోన్‌కి అనుమతి ఇచ్చిందని ఆయన ఆరోపిం చారు. గత 90 ఏళ్లలో ఎప్పుడూ ఇంతగా వరదలకు కర్ణాటక, ముఖ్యంగా బెంగుళూరు ఇంతగా వరదల తాకిడికి గురి కాలేదన్నారు. రోజూ రాత్రీ పగలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులన్నీ నిండుకున్నాయన్నారు. అయితే బెంగుళూరు నగరం వరద నీటిలో మునిగిపోయిందన్న వార్తలను, ప్రచారాలను నమ్మవద్దని, అందులో నిజం లేదన్నారు. వరదపరిస్థితులను పరిశీలించి ప్రజల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి బొమ్మై ప్రకటించారు.
సైబర్ సిటీగా ఎంతో ప్రసిద్ధిపొందిన మహానగరం బెంగుళూరులో దాదాపు అన్ని ప్రాంతాలూ భారీ వర్షాలు, వరద నీటిలో చికుక్కున్నాయి. ప్రభుత్వం మాత్రం గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వల్లనే సిటీ ఇలాం టి పరిస్థితికి వచ్చిందని ఆరోపించడం పట్ల నెటిజన్లు విమర్శలతో దాడి చేస్తున్నారు. ప్రతీ మాటకీ బీజేపీ పాలిత రాష్ట్రాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప వాస్తవానికి అలాంటిదేమీ లేదని నెటిజన్లు బెంగుళూరు పరిస్థితిని ఉదాహరణగా చూపుతూ ఎద్దేవా చేస్తున్నారు.