అక్షరాలు చక్కగా రాయడం.. పెద్దయ్యాక కష్టం!
posted on Sep 6, 2022 @ 12:32PM
అక్షరాలు గుండ్రంగా రాయడం అందరికీ అంత సులభంగా వచ్చే కళ కాదు. చిన్నపుడు స్కూల్లో కాపీ రైటింగ్ పేర టీచర్లు పిల్లలకు పెద్ద శిక్షే వేసేవారు. ఎవరు గుండ్రంగా రాస్తే వారికి క్లాసులో గౌరవం, లీడర్ అయ్యే అవకాశాలుండేవి. అదో పెద్ద హోదా. తెలుగు టీచర్లకు అక్షరాలు గుండ్రంగా రాసే వారంటే మహాయిష్టం. బాల్యంలో ఇంత ప్రాధాన్యతిచ్చిన హ్యాండ్ రైటింగ్‌కి క్రమేపీ పెద్ద చదువుల్లోకి వెళ్లగానే అంత ప్రాధాన్యత కనపడదు. ఫలితంగా చేతికి వచ్చిన విధంగా వేగంగా రాసే యడం అలవడి అదే పద్ధతి వృత్తి, ఉద్యోగాల్లోనూ కొనసాగిస్తూంటాము. ఇది తప్పు కాదు. కానీ ఆ అలవాటు డాక్టర్ వృత్తి లో ఉన్నవారికే మరీ ఇబ్బంది.
ఏదో చిన్నజ్వరంతోనో, పెద్ద ఆరోగ్య సమస్యతోనో వీధి చివర్నున్న డాక్టర్ దగ్గరికో, ఆస్పత్రికో వెళతాం. మన సమస్య వివరిస్తాం. డాక్టర్ వీలయినంతగా పరీక్ష చేసి పెన్ను పట్టి కాయితం మీద వీలయినంత వేగంగానో, వీలయినంత నెమ్మదిగానో మందులు రాసిస్తారు. అది చూస్తే చైనా, జపాన్ భాషల్లో ఏదో రాశా డనే ఫీలింగ్ వచ్చి పేషెంట్లు విసుక్కోవచ్చు. ఎందుకంటే ఆ మందుల పేర్లు ఆయన రాసిన విధానంలో బొత్తిగా అర్ధంగావు గనుక. దాన్ని చదివే బ్రహ్మ ఒక్కడే.. అతగాడే మందుల దుకాణంవాడు. అతనికి డాక్టర్‌కి వున్న అక్షరాలను అర్ధంచేసుకునే లింకు మనబోటివారికి ఎవ్వరికీ అర్ధం కాదు. కానీ అతగాడు టెన్త్ చది వినా, ఎంబీబీఎస్ రాసిన కాయితాన్ని అమాంతం చేతిలోంచి లాక్కుని అదే వేగంగా వాటిపేర్లు చదువుతూ అసిస్టెంట్ చేత తీయించి బిల్లు ఇంతయిందని అంటాడు.
అప్పటిదాకా ఏదో మంత్రాలు విన్నట్టే ఉం టుంది. అంత చదువుకున్నవాడు ఛండాలంగా రాసింది అంతగా చదువుకోని వాడు ఎలా అర్ధంచేసుకు న్నాడు? అనే సందేహంతోనే ఊగిసలాడుతూ ఇల్లు చేర తాం. అదే చిత్రం. మందుల పేర్లు దుకాణం వాడి కి కంఠతా ఉంటాయా? ఫలానా డాక్టర్ ఫలానా ఆరోగ్య సమస్యకి ఫలానా మందులే రాస్తాడన్న అపూర్వజ్ఞానం కలిగి ఉండడమేనా? బహుశా అదే అయి ఉంటుంది.
ఏమయినప్పటికీ, చిన్నప్పటి టీచర్ల బెత్తం దెబ్బలు ఇపుడు తడుముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు అన్ని తిట్లు, దెబ్బలు తిని నేర్చుకున్న బహుచక్కని రాత క్రమేపీ తగలడిందేమిటా అని! గుండ్రంగా చూడముచ్చటగా రాయడం జీవితాంతం ఆ నేర్పు కలిగి ఉండేవారు తక్కువమందే ఉంటారు. ప్రొఫెషన్‌ని అనుసరించి రాయడంలో వేగం పుంజుకుని అక్షరాలు అవతలివారికీ అర్ధం కావాలన్న ధ్యాసపోతోంది. టెన్త్పరీక్షల్లో గుండ్రంగానే రాయాలి, మందులు రాసే డాక్టర్ గుండ్రం గానే రాయాలి. కానీ ఈ రెండు ఎన్నడూ ఒకే పంథాలో జరగవు. దీన్ని గురించే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక ట్వీట్ కూడా చేశారు.