బ్రిటన్ ప్రధానిగా ట్రస్.. రిషికి చేజారిన అవకాశం
posted on Sep 6, 2022 @ 11:18AM
బ్రిటన్ ప్రధాని పోటీలో హోరాహోరీ పోరాడిన భారత్ సంతతికి చెందిన రిషి సునాక్ ను వెనక్కి నెట్టి లిజ్ ట్రస్ గెలిచింది. తొలుత కన్జర్వేటివ్ పార్టీ టోరీ ఎంపీల మద్దతు సునాక్‌కే ఉన్నా.. క్రమంగా ట్రస్ పైచేయి సాధించారు. 1.72 లక్షల మంది టోరీ సభ్యులు ఆన్‌లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా కన్జర్వేటివ్ నేత ఎన్నికలో ఓట్లు వేయగా.. వాటిల్లో 654 చెల్లుబాటు కాలేదు.
మిగతా వాటిల్లో ట్రస్‌కు 81,136.. సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. భారత కాలమానం ప్రకారం సోమ వారం(ఆగష్టు 5)సాయంత్రం 5 గంటలకు టోరీ 1922 కమిటీ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీ ఎన్నికల ఫలి తాలను విడుదల చేస్తూ..లిజ్ ట్రస్‌ను విజేతగా ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ నేత ప్రధానిగా బాధ్యత లు చేపట్టడం ఆనవాయితీ. మార్గరేట్ థాచర్, థెరిసా మే తర్వాత.. బ్రిటన్ ప్రధాని పదవిని చేజిక్కిం చుకున్న మూడో మహిళగా ట్రస్ రికార్డు సృష్టించనున్నారు. సోమవారం సాయంత్రమే ఆమె కేబినెట్ కూర్పుపై కసరత్తు ప్రారంభించారు. అయితే.. ట్రస్ మంత్రివర్గంలో రుషి సునాక్‌కు చోటు అనుమాన మేనని తెలుస్తోంది.
మంగళవారం బోరిస్ జాన్సన్‌కు వీడ్కోలు సమావేశం జరగనుంది. ఆ వెంటనే ట్రస్ స్కాట్లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌లో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2ను కలుస్తారు. అక్కడే బ్రిటన్ రాణి ఆమెను ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులిస్తారు. నిజానికి బ్రిటన్ వెలుపల ప్రధాని నియామకం జరగడం ఇదే మొదటిసారి. బ్రిటన్ రాణి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈ కార్యక్రమాన్ని స్కాట్లాండ్‌లో ఏర్పాటు చేశారు. బుధవారం ఆమె కేబినెట్‌ను ప్రకటించవచ్చు. ఆ తర్వాత బ్రిటన్ దిగువసభ-- హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రధాని హోదాలో తొలి ప్రసంగం చేయనున్నారు.
రిషి సునాక్ ముందు నుంచి ప్రధాని రేసులో ముందంజలో ఉన్నారు. ఆయన గెలవడానికి ఆస్కారం ఉందని ప్రచారమూ జరిగింది. ఇటు భారతీయులు ఎంతో సంతోషించారు. కానీ ఊహించనివిధంగా బోరిస్ జాన్సన్ ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం, ట్రస్‌కు మద్దతివ్వడం ప్రతికూలంగా మారాయి. ట్రస్ కూడా తన ప్రచారంలో రిషి తీసుకువచ్చిన పన్నులనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఆర్థిక మాంద్యం దిశలో బ్రిటన్ అడుగులు వేస్తున్న తరుణంలో రిషి సునాక్ ఆదాయ, ఇతర పన్నులను పెంచారు. రిషి పెంచిన పన్నులను తగ్గించడమే నా ప్రధాన లక్ష్యమంటూ ట్రస్ చేసిన ప్రచారం టోరీ సభ్యులను ఆకట్టు కుంది. అంతే కాదు ట్రస్ ప్రచారాన్ని ప్రారంభించినప్పటి నుంచి మార్గరేట్ థాచర్ మాదిరిగా ఆహార్యం, నడవడికను మార్చుకుని అందర్నీ ఆకట్టుకున్నారు.
బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న లిజ్ ట్రస్‌ను భారత ప్రధాని మోదీ అభినందించారు. ఇరు దేశాల మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ మరింత బలపడేలా ఆమె కృషిచేస్తారని ఆకాంక్షిం చారు. ట్రస్‌లిజ్.. అభినందనలు. భారత్-బ్రిటన్ బంధాన్ని మీరు మరింత బలోపేతం చేయాలని కోరుకుంటు న్నామని ట్వీట్ చేశారు.