కథ అడ్డం తిరిగింది.. ఒక హీరోని కలవబోయి మరో హీరోని కలిసిన నడ్డా!
posted on Sep 6, 2022 @ 3:51PM
ఇటీవల బీజేపీ జాతీయ నాయకులు తెలుగు హీరోలను కలుస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు ముగ్దుడైన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటన సమయంలో హైదరాబాద్ లో తారక్ ని కలిసి ప్రశంసించారు. ఇక రీసెంట్ గా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా యంగ్ హీరో నితిన్ ని కలిశారు. అయితే నితిన్ ఇంతవరకు పాన్ ఇండియా ఫిల్మ్ చేయలేదు. నార్త్ ఆడియన్స్ ని మెప్పించే సినిమా సంగతి అటుంచితే, ఇటీవల ఆయన చేసిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించలేకపోయింది. దీంతో అసలు నితిన్ ని నడ్డా ఎందుకు కలిశారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నిజానికి నడ్డా కలవాలనుకున్నది నితిన్ ని కాదట. ఆయన నిఖిల్ ని కలవాలనుకుంటే తెలంగాణ బీజేపీ నాయకులు నితిన్ ని తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టారని ప్రచారం జరుగుతోంది.
నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ-2' ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలై నార్త్ లోనూ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో పురాణాలు మన చరిత్ర అని చెబుతూ శ్రీ కృష్ణ తత్వం గురించి వివరించిన తీరు ఆకట్టుకుంది. అందుకే హీరో నిఖిల్ ని నడ్డా ప్రత్యేకంగా కలిసి ప్రశంసించాలి అనుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన తన టీమ్ కి చెప్పగా.. వారు తెలంగాణ బీజేపీ లీడర్స్ ని కాంటాక్ట్ అయ్యారట. అయితే పేర్లు ఒకేలా ఉండటంతో కన్ఫ్యూజ్ అయ్యి.. నిఖిల్ కి బదులుగా నితిన్ ని కలిపించారని టాక్.
అయితే తాను కలిసింది 'కార్తికేయ-2' హీరోనే అనుకొని.. నితిన్ తో నడ్డా ఏం మాట్లాడి ఉంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాటల మధ్యలో మీరు నటించిన 'కార్తికేయ-2' బాగుందని నడ్డా అనగానే నితిన్ ఒక్కసారిగా ఉలిక్కిపడినంత పనై ఉంటుందని అంటున్నారు. తాను ఆ సినిమాలో నటించలేదు, పోనీ తాను నటించిన 'మాచర్ల' గురించి చెప్దామా అంటే అందులో విషయం లేదు. దీంతో అసలు విషయం బయటపడిపోయిందట. వెంటనే నడ్డా 'మీరు కన్ఫ్యూజ్ అయ్యి అనవసరంగా ఇతన్ని ఇబ్బందిపడేలా చేశారుగా' అంటూ దీనికి కారణమైన టీమ్ కి, లీడర్స్ కి చివాట్లు పెట్టారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. దీంతో నెటిజన్లు ఓ వైపు 'నిఖిల్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు' అంటూనే మరోవైపు నితిన్ ని ఉద్దేశించి 'నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.