దొంగతనం చేద్దామని వచ్చి తప్పతాగి దొరికిపోయారు!
posted on Sep 6, 2022 @ 11:36AM
అదృష్ట వంతుడికి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కింద పడ్డాడంటారు. అదే దురదృష్ట వంతుడికి యాక్సిడెంట్ అంటే అతడు వెళుతున్న అంబులెన్సుకే యాక్సిడెంట్ అవ్వడం అన్న మాట. ఓ ఇద్దరు దొంగల పరిస్థితిఅలాగే తయారైంది.
వాళ్లు చోరీ చేద్దామనుకున్నది డబ్బునో, నగలనో కాదు. మద్యాన్ని. పూటుగా తాగి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దామనుకున్న ఓ ఇద్దరు దొంగలు అనుకున్నట్లుగానే ఓ మద్యం షాపును ఎంచుకున్నారు. అర్ధరాత్రి దాటాకా ఆ షాపు గోడకు కన్నం పెట్టి లోపలికి దూరారు.
అంత వరకూ బానే ఉంది కానీ ఆ తరువాతే వచ్చింది అసలు సమస్య. ఖాళీగా ఉన్న దుకాణం. నిండా మద్యం సీసాలు. దీంతో ఆ చోరులలోని తాగుబోతు ఒక్క సారిగా ఒళ్లు విరుచుకుని నిద్ర లేచాడు. తాగినంత తాగి ఆ తరువాత మిగిలిన మద్యం సీసాలను తీసుకువెళదామనుకున్నారు.
అంతే అక్కడే కూర్చుని తాగేశారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో జరిగింది. పూటుగా తాగిన తరువాత ఎవరైనా ఏం చేస్తారు. గొడవ పడతారు. లేదా పాటలు పాడతారు. వీళ్లూ అదే చేశారు. ఇంకే ముంది పెట్రోలింగ్ పోలీసులు ఏంటా గలాటా అని వచ్చారు. గోడకి కన్నమేమిటా అని చూస్తే లోపల దొంగల బాగోతం కనిపించింది.
కడుపుబ్బా నవ్వుకుని ఆ తరువాత ఆ దొంగల్ని గోడకు వారు చేసిన కన్నంలోనుంచే బయటకు లాగి అరదండాలు తగిలించి జైలుకు తీసుకెళ్లారు. పాపం ఇప్పుడు ఆ దొంగలు కొంచం సేపు ఓపిక పట్టి వీలైనంత మద్యాన్ని తీసుకుపోయి ఇంటి దగ్గర తాగి ఉంటే బాగుండేది కదా అని వగస్తున్నారు.