హీరో ప్రభాస్ తో అమిత్ షా భేటీ అందుకేనా?
posted on Sep 14, 2022 @ 8:27PM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 17 న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారకంగా నిర్వహిస్తున్ననేపధ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే , సెప్టెంబర్ 16న అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. అదే రోజున ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదే సమయంలో కృష్ణం రాజు సోదరుని కుమారుడు, వెండి తెరవారసుడు హీరో ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారని బీజీపీ వర్గాల సమాచారం.
నిజానికి కేంద్ర మంత్రి అమిత్ షా, కృష్ణం రాజు కుటుంబాన్ని పరామర్శించడం పెద్ద విషయం కాదు. కృష్ణం రాజు అన్ని పార్టీలు తిరిగివచ్చినా, ఆయన బీజేపెలోనే ఎక్కువ గుర్తింపు గౌరవం పొందారు. కృష్ణం రాజు రెండు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆరెండు సందర్భాలలోనూ బీజేపీ అభ్యర్ధిగానే విజయం సాధించారు. కాంగ్రెస్, ప్రజారాజ్యం అభ్యర్దిగానూ పోటీ చేసినా, విజయయని చేరుకోలేక పోయారు. అలాగే, అటల్ బిహారీ వాజపేయి మంత్రి వర్గంలో సహాయ మంత్రిగానే ఐదేళ్ళు కొనసాగారు. నిజానికి, కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన తొలి తెలుగు హీరో కృష్ణం రాజు. అలాగే, ఆయన మధ్యలో కొంతకాలం ప్రజారాజ్యం వైపు వెళ్ళినా, మళ్ళీ చివరకు బీజేపీ గూటికే చేరారు. బీజేపీ నేతగానే కన్ను మూశారు. కాబట్టి అమిత షా కృష్ణం రాజు ఫ్యామిలీని పరామర్శించడం, పెద్ద రాజకీయ పాధాన్యత గల విషయంగా చూడవలసిన అవసరం లేదు. కానీ వుంది.
ఎందుకు ఉందంటే, కృష్ణం రాజు ఫ్యామిలీని పరామర్శించడంతో పాటుగా అమిత్ షా హీరో ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. అందుకే ఈ వార్తకు రాజాకీయ ప్రాధాన్యత ఉందనే చర్చ జరుగుతోంది.నిజానికి, ప్రభాస్ ఇప్పటికే బీజేపీలో సభ్యత్వం లేని సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో, కృష్ణం రాజు, ఆయన సతీమణితో పాటుగా ప్రభాస్ ఇతర కుటుంబ సభ్యలు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రధాని అధికార నివాసంలో కలిశారు.అప్పుడే ప్రభాస్ చూచాయగా తమ రాజకీయ దృక్ఫదాన్ని వెల్లడించారు. అయినప్పటికీ ఇటీవల బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక సినిమా హీరో కలిసి వెళుతున్నారు.
ఇటీవలే మునుగోడు పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ తో సమావేశం అయ్యారు. అందుకే పరామర్శతో పాటుగా రాజకీయ పలకరింపు కూడా అమిత షా ఎజెండా కావచ్చని అంటున్నారు.
నిజమే కావచ్చును కానీ, బీజేపీ ఒక్క సినిమా వారినే కాదు అన్ని అన్ని వర్గాల వారిని తమ సంపర్కంలోకి తెచ్చుకునే నిరంతర ప్రక్రియలో భాగంగానే, జూనియర్ ఎన్టీఆర్, నితిన్ /నిఖిల్ లేదా మరో నటుడుని కలవడం జరిగిందని బీజేపీ నాయకులు అంటున్నారు. అమిత్ షా గత పర్యటనలో బేగంపేట విమానాశ్రయంలోనే రైతులతో, రైతు నాయకులతో సమావేసమయ్యారు. బీజేపీ కార్యకర్త ఇంటింకి వెళ్లి చాయ్ తాగి వచ్చారు.
అలాగే ఐటీ రంగ నిపుణులు, ఇతర రంగాల వారితోనూ బీజేపీ నాయకులూ , కార్యకర్తలు నిత్య సంపర్కంలో ఉంటారని, ప్రభాస్ తో అమిత్ షా భేటీని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే లేదంటే లేదని కాదు, ఉందంటే ఉందని కాదు రాజకీయ నాయకులు ముఖ్యంగా మోడీ, అమిత్ షా వంటి 24X7 పొలిటికల్ లీడర్స్ వేసే ప్రతి అడుగులోనూ రాజకీయాలే ఉంటాయి . అందులో సందేహం అవసరం లేదు.