మళ్లీ కెబినెట్‌లోకి కొడాలి నాని
posted on Sep 14, 2022 @ 5:08PM
తన కేబినెట్‌ని ముచ్చటగా మూడో సారి మార్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తన ప్రయత్నాలను ముమ్మరం చేశారనే ఓ చర్చ తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా వైసీపీలో జోరుగా సాగుతోంది. మరోసార జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరించేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన మాటలను బట్టే అవగతమౌతున్నది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన తొలి కేబినెట్‌లోని కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబులతకు స్థానం కల్పించే విషయాన్ని జగన్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దసరా తరువాత జగన్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న స్పష్టమైన సందేశం ఇప్పటికే మంత్రులకు చేరినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
అయితే పైన పేర్కొన్న వారిలో అందరికీ కేబినెట్ లో చోటు దక్కుతుందా, లేదా కొందరికి మాత్రమే జగన్ అవకాశం ఇస్తారా అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. అయితే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మాత్రం మంత్రి పదవి పక్కా అని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అంతే కాకుండా ఈ సారి కొడాలి నానికి కేబినెట్ లో అత్యంత కీలక శాఖను కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. క్విడ్ ప్రోకో తరహాలో నీకు ఇది.. నాకు ఇది అనే తరహాలో సీఎం జగన్, కొడాలి నాని మధ్య.. ఓ ఒప్పందం కుదిరిందని కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అదేమిటంటే విపక్షంపై బూతుల వర్షంతో విమర్శలు గుప్పించడం కొడాలి నాని వంతు అయితే మంత్రివర్గంలో కీలక పదవి కట్టబెట్టడం జగన్ వంతు అన్నదే ఆ ఒప్పందంగా పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.
ఆ ఒప్పందంలో ఇటీవల కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబంపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు చెరిగారు. అంతేకాదు.. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా పలు ఆందోళనలు, ధర్నాలు సైతం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు జగన్ తన రెండో సారి కేబినెట్ విస్తరణలో భాగంగా 11 మంది పాతవారిని కొనసాగిస్తూనే.. కొత్తగా మరో 14 మందికి చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే పాత వారంతా.. కొత్త వారు వచ్చారు కదా.. వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారులే అంటూ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారట. కానీ కొత్త వారు మాత్రం.. కొత్తగా మంత్రి పదవులు దక్కేసరికి... గుళ్లులు, గోపురాలు, తాడేపల్లి ప్యాలెస్‌ల.. చుట్టు ప్రదక్షణాలు చేయడంతో ఆ నాలుగు నెలల కాలం కాస్తా.. గాలిలో పెట్టిన పచ్చ కర్పురం కరిగిపోయినట్లు కరిగిపోయింది.
ఈ నేపథ్యంలోనే తన తాజా కేబినెట్ పని తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగన్ కొత్త మంత్రుల ముఖం మీదనే వారిని కడిగి పారేసి మంత్రి పదవులు ఊడబీకేస్తానని హెచ్చరించినట్లు చెబుతున్నారు. అసలు దీనికంతటికీ కారణం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో తన సతీమణి భారతిపై విపక్ష నేతల విమర్శలకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎవరూ స్పందించకపోవడం, విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టకపోవడమే కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు... తనను కానీ పార్టీని కానీ కార్నర్ చేస్తే.. గత కేబినెట్‌లోని పలువురు మంత్రులు.. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వీడియోలు సైతం.. మన పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయని.. వాటిని చూసి అయినా నేర్చుకోవాలంటూ మంత్రువర్గానికి హితబోధ చేశారని కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గట్టిగా విపక్షాలపై విమర్శలతో విరుచుకు పడగలిగే, బూతులు మాట్లాడేందుకు కూడా వెనుకాడని కొడాలి నానిని మరోసారి తన కేబినెట్ లోకి తీసుకోవాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఈ పరిణామంపై ప్రజాస్వామ్య వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎవరినైనా కేబినెట్ లోకి తీసుకోవాలంటే వారి నీతి, నిజాయతీ, సమాజ సేవ, సచ్ఛీలత వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకునే వారనీ, అయితే నేడు పరిస్ధితి పూర్తి భిన్నంగా మారిందని అంటున్నారు. గుండాయిజం, రౌడీయిజం మంత్రి పదవికి ఒక అర్హతగా, ప్రత్యర్థులను దుర్భాషలాడటం అదనపు అర్హతగా మారిపోయినట్లుగా పరిస్థితి తయారైందని ప్రజాస్వామిక వాదులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనం డెమోక్రసీలో ఉన్నామా? లేక డెమినోక్రసీలో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.