ఠాగూర్ చిరు..సారీ.. చిలకరాజు!
posted on Sep 15, 2022 @ 11:00AM
మునపు ఒకడుండేవోడు..అసలు నిజ్జాయితీ అంటే ఆడిపేరే సెప్పేటోళ్లు మరి!.. ఇలాంటి డైలాగులు మన గ్రామాల్లో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు అనడం వింటూంటాం. నిజ్జంగా నిజాయితీగా ఉండ డం బహు కష్టంసుమ్మీ అంటారు. సూక్తులు చెప్పడం కంటే పాటించి చెప్పడం కడు దుర్లభం. స్కూలు పిల్లడు చొక్కాకి జెండా బొమ్మ పెట్టుకున్నట్టు చిలకరాజు అనే ఆయన జెండా స్థానంలో ఒక కార్డు పెట్టు కున్నాడు. . నాకు లంచం వద్దు.. అని రాసిన కార్డు! ఆ ధైర్యం ముందు ఎంతటి ఉద్యోగయినా ఖంగారు పడాల్సిందే!
న్యాయం, ధర్మం అనే పదాలకు బొత్తిగా అర్ధంలేకుండాపోయిన ఈ రోజుల్లో నిజాయితీగా బతకాలను కోవ డం తూ.చ తప్పకుండా పాటించడానికి కొండంత ధైర్యం అవసరం. చొక్కాజేబుకి అలాంటి నినాదాన్ని రాసు కున్న కార్డు తగిలించుకోగానే ఠాగూర్ చిరంజీవి అయిపోడు. కానీ ఎదుటివారికి, తోటి ఉద్యోగులకు మాత్రం తమ ఉద్యోగ వ్యవహారాలను సక్రమంగా నిర్వర్తించాలన్న ఆలోచనని మాత్రం కలిగిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం ఆర్ఐ చిలక రాజు నర్సయ్య అదే పనిచేశారు. ఓ రోజు ఉదయాన్నే చిలకరాజు అలా ఆఫీసుకు వెళ్లే సరికి తోటి ఉద్యోగు లు ముందు నవ్వుకున్నారు, తర్వాత్తర్వాత చిలకరాజు ఎంతో నిటారుగా నడవడం, ఆయన చూపులో ఎలాంటి బెరుకూ లేకుండా ఉండడం గమనించి సదరు తోటి ఉద్యోగులు ఖంగారుపడ్డారు. నిజాయితీ తెచ్చే దైర్యం, బలం తాలూకు శక్తి అది. కానీ ఆయన్ను చూసి ఆనందించడం శభాష్ అని మెచ్చుకోవడం కాకుండా వీలయితే ఆయన బాటలో నడిచేందుకు కాస్తంత ధైర్యం చేయాలి ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యో గులు. అపుడే చిన్నస్థాయి ఉద్యోగి కూడా ఒక ఠాగూర్ చిరంజీవి కాగలడు. ఇదే సామాన్య ప్రజలూ ఆశించేది.