రాహుల్ గాంధీలో కొత్తకోణం ... గమనించారా?
posted on Oct 1, 2022 @ 10:49PM
యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ ।
నాభినందంతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।।
“ఎవరైతే అన్నీ పరిస్థితులలో మమకారం/ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షము నొందకుండా, కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న మునితో సమానం” అట్టి వానిని స్థిత ప్రజ్ఞుడు అందురు.
ఇంకా కొంచెం తేలిగ్గా అరంయ్యేలా చెప్పుకోవాలంటే, “కష్టాలలో కుంగి పోక , సుఖాలలో పొంగి పోక, పరమానంద స్థితిలో జీవితం సాగించడమే ! స్థిత ప్రజ్ఞత. అంటే కష్ట సుఖాలను ఒకలా చూసే పరిపక్వ మానసిక స్థితిని, ... స్థిత ప్రజ్ఞత అంటారు. కష్ట సుఖాలను సమ దృష్టితో చూచే వారిని. స్థిత ప్రజ్ఞుడు అంటారు. ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉన్నాయి కదూ.. అవును, యుద్ధ భూమిలో శ్రీ కృష్ణ పరమాత్మ, అర్జనుని కార్యోన్ముఖుని చేసినేదుకు, బోధించిన, ‘గీత’ లోని శ్లోక మిది.
అయితే, ఇప్పడు ఈ శ్లోకం, దాని అర్థ తాత్పర్యాలు గుర్తుకు తెచ్చింది మాత్రం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గత వారం పది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఏమేమి జరిగాయో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో, దేశం అంతా చూసింది. విస్తు పోయింది. ఓ వంక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక క్రతువు ఒక ప్రహసనంలా సాగుతోంది.
మరో వంక, అధ్యక్ష ఎన్నిక, పర్యవసానంగా రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ సృష్టించిన సంక్షోభం, అధిష్టానానికి, అంటే, సోనియా, రాహుల్, ప్రియాంక త్రయానికి సవాల్ విసిరింది. మరో వంక, ఈ పరిణామాలతో అసలే అంతంత మాత్రంగా మిణుకు, మిణుకు మంటున్న కాంగ్రెస్ భవిష్యత్ మరింతగా మసకబారింది. వందేళ్లు నిండిన కాంగ్రెస్ దీపం కొడిగట్టి ఆరిపోయే స్థితికి చేరిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితిలోనూ కాంగ్రెస్ ఆశాజ్యోతి రాహుల గాంధీ తామరాకు మీద నీటి బొట్టులా తనకేమి పట్టనట్లు. అదసలు తనకు సంబందించిన విషయమే కాదన్నట్లు, అలా తన దారిన తాను, భారత జోడోయాత్ర దారిలో నడచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు.
నిజానికి ఆయన ఏదో అలా నిర్వికారంగా నడుచుకుంటూ వెళ్లిపోలేదు. ఓ వంక ఢిల్లీలో, జైపూర్ లో కాంగ్రెస్ నాయకులు కిందా మీద అవుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ, ఇంచక్కా పిల్లలలతో ఫుట్బాల్ ఆడుతూ, పసి పిల్లలను ఎత్తుకుని ముద్దాడుతూ, అమ్మాయిలకు హగ్గులిస్తూ,వాళ్ళను వీళ్ళను పలకరిస్తూ, పరిహాసమడుతూ అలా నవ్వుతూ సాగిపోయారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటని ఎవరెవరో ఆందోళన చెందుతున్నారు. ఎవరెవరో రాజకీయ పండితులు విశ్లేషణలు చేస్తున్నారు. అయినా రాహుల్ గాంధీ అదేమీ పట్టకుండా చక్కని స్థిత ప్రజ్ఞతను చూపారు.
సరే, రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర వలన కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రయోజనం జరుగుతుంది? పూర్వ వైభవ స్థితి సిద్ధిస్తుందా? వంటి ప్రశ్నలను పక్కన పెడితే, రాహుల్ గాంధీ యాత్ర ఆయనలోని మరో కోణాన్ని, అయితే చూపించింది.