ఇలా చదువుతూంటే ముసలాడినైపోతా!
posted on Oct 1, 2022 @ 4:18PM
పిల్లలకి పాలబువ్వ పెట్టినంత సులువుగాదు చదివించడం, రాయించడం. అదో కళ. దానికి నైపుణ్యం మాటెలా ఉన్నా మహాఓర్పూ ఉండాలి. పిల్లల్ని వాళ్ల ఇష్టానికి వదిలేసి మధ్య మధ్యలో చదువు మీదకి దృష్టి మళ్లేలా చేయాల్సిందేనంటారు విద్యావేత్తలు. అంతేగాని తల్లిదండ్రుల నియమనిబంధనలు, స్కూల్లో టీచర్ల బెత్తం పెత్తనం అస్సలు పనికిరావు. ఎందుకంటే బాల్యం వాళ్లది.. పాఠం చెప్పేవారికి, తల్లిదండ్రులకీ ఆ దశ అయిపోయింది. అంచేత సీరియస్‌గా చెప్పడం అస్సలు కుదరదు. వారితో సరదాగా ఆడుతూనే హోంవర్క్ చేయించాలి. లేకపోతే ఇదుగో ఈ బుడతడిలా పెద్ద మాటే అనేస్తారు. తర్వాత ఆశ్చర్యానికి అంతే ఉండదు.
పిల్లాడిచేత రాయించడానికో, హోమ్‌వర్కే చేయించడానికి ఆమె నానా అవస్థాపడుతోంది. వాడు మాట వినడం లేదు. ఇంకా ఎంత చదివిస్తావు, రాయిస్తావని ఎదురు ప్రశ్న వేసేంతగా లోలోపల బాధపడ్డాడు. వాడికి బయటికి వెళ్లి ఆడాలనుంది, కుక్కపిల్ల తోక లాగాలనుంది, మట్టిలో పరిగెత్తాలని ఉంది, పక్కింటి చింటూగాడి చొక్కాలాగి ఏడిపించాలనుంది.. అసలు వాడికి చాలా పనులున్నాయి.. ఈవిడేమో వదలదాయ!
పిల్లలకు కబుర్లు చెబుతూనే, పాటలు పాడుతూనే చదివించడం నేర్చుకోవాలి. తల్లయినా, తండ్రయినా పిల్లల్ని ఎలా చదివించాలో నేర్చుకోవాలి. అంటే మళ్లీ బాల్యంలోకి వెళ్లాలి, వాళ్లమ్మ, నాన్నలు ఎలా చేశారో గుర్తు చేసుకోవాలి. అప్పుడుగాని మీ బబ్లూగాడి చేత రాయించగలిగేది, చదివించగలిగేది. లేకపోతే వీడెవడో గాని గట్టి మాటే అనేశాడు... ఇంత చదువుతూ పోతే ముసలాడినయిపోతా! అని!!
మరి ఇప్పటి చదువు అలా ఏడిచింది మరి... అంతా మానసిక ఒత్తిడిని బహూకరిస్తోంది!