ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి బాలుడు మృతి
posted on Oct 3, 2022 7:21AM
ఇప్పుడంతా ఎలక్ట్రికల్ బైక్ ల ట్రెండ్ నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెరగిపోవడంతో మధ్య తరగతి వాళ్లంతా బ్యాటరీ బైక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. రకరకాల మోడల్స్.. రకరకాల బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. పైగా పర్యావరణ హితం అంటూ ప్రభుత్వాలు కూడా ప్రకటనలతో ఊదరగొట్టేస్తున్నాయి.
మామూలు బైకుల ధరతో పోలిస్తే ఎలక్ట్రిక్ బైక్ ల ధర మరీ ఎక్కవ ఏమీ కాదనిపించేలాగే ఉండటం, అలాగు డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గొడవ లేకపోవడంతో.. చార్జింగ్ స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. ఓలా లాంటి కంపెనీలు సైతం రంగంలోకి దిగడంతో ఎలక్ట్రికల్ బైక్స్‌కు మరింత క్రేజ్ వచ్చింది. ఇదే ఛాన్స్ అనుకొని.. ఊరూపేరు లేని సంస్థలు సైతం బ్యాటరీ బైక్స్ తయారు చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. అయితే, వరుసగా జరుగుతున్న ఘటనలు ఎలక్ట్రిక్ బైక్ అంటేనే దడ పుట్టేలా చేస్తున్నాయి. నాసిరకం తయారీ విధానమో.. ఏమో కానీ ఈ మధ్య ఎలక్ట్రిక్ బైకులు బాంబుల్లా పేలిపోతున్నాయి. మంటలతో తగలబడుతున్నాయి.
తాజాగా ఇటువంటిదే మరో సంఘటన ఎలక్ట్రిక్ వాహనాలంటేనే భయపడేలా చేసింది. మహారాష్ట్రలోని వసాయ్ ఈస్ట్ లోని రామ్ దాస్ నగర్ ప్రాంతంలో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఏడేళ్ల బాలుడు చనిపోయాడు.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 23న షానవాజ్ అన్సారీ అనే వ్యక్తి తన ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. తెల్లవారుజామున అది ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షానవాజ్ కొడుకు షబ్బీర్ అన్సారీ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
షానవాజ్ అన్సారీ తన భార్య, కొడుకు, తల్లితో కలిసి రామ్ దాస్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. సెప్టెంబర్ 23న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో షానవాజ్ తన బైక్ బ్యాటరీ తీసుకుని హాల్ లో ఛార్జింగ్ పెట్టాడు. ఆ తర్వాత బెడ్ రూమ్ కి వెళ్లి నిద్రపోయాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో బ్యాటరీ పేలిపోయింది. హాల్ లో మంటలు చెలరేగాయి. భారీ శబ్దం రావడంతో షానవాజ్ అన్సారీ ఉలిక్కిపడి లేచాడు. బయటకు వచ్చి చూసే సరికి షాక్ తిన్నాడు.
తన ఏడేళ్ల కొడుకు షబ్బీర్ మంటల్లో చిక్కుకుని ఉన్నాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ, ప్రయోజనం లేదు. చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బ్యాటరీ పేలిపోవడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ ఘటనతో ఎలక్ట్రిక్ బైక్ ల సేఫ్టీ పై మరోసారి అనుమానాలు తలెత్తాయి.