ఆలూమగల సవాల్.. గెలిచిందెవరో?
posted on Oct 3, 2022 6:47AM
ఆలూమగల మధ్య సరదా సవాళ్లు సహజమే. అందులోనూ వెటకారానికి మారుపేరైన తూర్పు గోదావరి జిల్లాలో అయితే వీటికి కొదవే ఉండదు. అదిగో అలాంటి సరదా సవాలే కడియపు మండలానికి చెందిన లారీ ట్రాన్స్ పోర్టు ఓనరు వరదా వీర వెంకట సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు భార్య లావణ్య చేసింది.
పైగా అదేమీ ఇలాంటలాంటి సవాల్ కాదు. ఏకంగా తిరుపతి కొండ నడిచి ఎక్కాలనీ, అదీ మామూలుగా కాదు.. తనను భుజాలమీద ఎత్తుకుని ఎక్కగలరా? అంటూ సవాల్ చేసింది. సవాల్ కు సై అన్న సత్తిబాబు వెంటనే అందుకు ఉపక్రమించాడు. వెంటనే సత్తిబాబు భార్య లావణ్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే ఫోటోలు, వీడియోలు తీయడానికి మిగిలిన భక్తులు పోటీపడ్డారు.
పెళ్లైన కొత్తలో ఇలాంటి ప్రేమలు సర్వసాధారణమే అని కొట్టి పారేయవద్ద్దు. వీళ్లదేం కొత్త జంట కాదు. వీరి వివాహం దాదాపు పాతికేళ్ల కిందట అంటే.. వీళ్ల ఇద్దరమ్మాయిలకూ పెళ్లిళ్లు అయిపోయాయి. తాతా, అమ్మమ్మలు కూడా అయిపోయారు. వీళ్ల పెద్దల్లుడు తనకు మంచి ఉద్యోగం వస్తే అందరినీ తిరుమల తీసుకువస్తానని మొక్కుకోవడంతో అందరూ కలిసి దాదాపు 40 మంది బస్సులో వచ్చారు. అదిగో ఆ సందర్భంగానే నడకదారిలో వేగంగా మెట్లెక్కుస్తున్న సత్తిబాబుకు వారి భార్య ఈ సవాల్ విసిరింది.