అయ్యబాబోయ్.. మళ్లీ వర్షాలు!
posted on Oct 3, 2022 7:15AM
తెలంగాణను వర్షాలు వదలనంటున్నాయి. మరోసారి మరో మూడు రోజులు రాష్ట్రాన్ని వానలు ముంచెత్తనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్రమట్టానికి 5.8 మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇప్పటికే భారీ వర్షాల కారణంగా జనం అనేక ఇక్కట్లు పడుతున్నార.లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వాగులూ, వంకలూ పొంగి ప్రవహించాయి. భారీగా పంట నష్టం సంభవించింది. ఇక హైదరాబాద్ నగర వాసుల ఇక్కట్లైతే చెప్పనే అక్కర్లేదు. విశ్వనగరం కాస్తా విశ్వనరకంగా మారిపోయి.. ప్రజలు అవస్తలు పడ్డారు.
భారీ వర్షాల బాధల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రాష్ట్ర ప్రజలు మంగళవారం (సెప్టెంబర్ 4) నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఆందోళనకు గురౌతున్నారు. దసరా పండుగ వర్షార్పణమౌతుందని దిగులు పడుతున్నారు.