జేఈఈ మెయిన్స్ కే దిక్కులేదు.. ఈవీఎంలు భద్రమేనా?
posted on Oct 6, 2022 @ 11:54AM
గడపగడపకూ లో గడపగడపనా వ్యతిరేకత కనిపిస్తోంది. విమర్శలు, వ్యతిరేకతా తప్ప ఎక్కడా ఆదరణ కనిపించిన దాఖలాలు లేవు. అయితే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ, ప్రతి సభలోనూ రాష్ట్రంలో 175 కు 175 స్థానాలలోనూ విజయం తథ్యం అంటున్నారు. గెలిచి తరాలి, గెలిచి తీరుతాం అంటున్నారు.
ఆయన మాటలను ఆయన తప్ప ఎవరూ నమ్ముతున్నట్లు కూడా కనిపించడం లేదు. చివరికి సొంత పార్టీలోనే 175కు 175 స్థానాల్లో విజయం అన్న జగన్ మాటలపై సెటైర్లు పేలుతున్నాయి. విపక్షాలైతే ముందు పులివెందులలో విజయాన్ని ఖాయం చేసుకోండి.. మిగిలిన నియోజకవర్గాల సంగతి తరువాత అంటున్నాయి. ఇక జగన్ స్వయంగా చేయించుకున్న సర్వేలు సమా అన్నిటిలోనూ కూడా వైసీపీ గ్రాఫ్ పడిపోతున్నదనే తేల్చాయి. ఈ విషయాన్ని జగన్ స్వయంగా గడపగడపకు వర్క్ షాపులో వెల్లడించి.. అందుకు కారణం సరిగా పని చేయని మంత్రులు, ఎమ్మెల్యేలేనని చెప్పారు. అంతే కాదు.. తాను చెప్పినట్లు పని చేస్తే సరే సరి.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వను అంటూ హెచ్చరించారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదని కూడా విస్పష్టంగా చెప్పేశారు.
కొత్త వాళ్లని నిలబెట్టి గెలిపించుకుంటానని చెప్పారు. గ్రాఫ్ పడిపోయింది ఎమ్మెల్యేలు, మంత్రులదే తప్ప తనది కాదని ఆ వర్క్ షాపులో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతటా వ్యతిరేకత వ్యక్తమౌతున్నా.. జగన్ లో అదే విశ్వాసం కనిపించడానికి కారణాలేమిటన్నది అర్ధం కావడం లేదు. తనదైన ఊహా ప్రపంచంలో విహరిస్తున్నారా? అని నిన్న మొన్నటి వరకూ తన, పర అన్న బేధం లేకుండా జోకులు వేసుకున్నారు. సామాజిక మాధ్యమంలో అయితే జగన్ విశ్వాసంపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. అయితే జేఈఈ మెయిన్స్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోనికి వచ్చిన తరువాత జగన్ విశ్వాసానికి కారణం ఏమిటన్నది బోధపడుతున్నదన్న భావన పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలలోనూ ఈవీఎంలపై అనుమానాలు, సందేహాలూ వ్యక్తమయ్యాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సులభమన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. పలు రాజకీయ పార్టీలు ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. కొందరైతే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చని సోదాహరణంగా చెప్పారు. సరే ఈసీ ఆ ఆరోపణలను ఖండించింది అది వేరే సంగతి.
ఇప్పుడు దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీలో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలో చీటింగ్ జరిగింది.ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఈ చీటింగ్ వ్యవహారంలో ఒక రష్యాన్ హ్యాకర్ హస్తం ఉన్నట్లు తేల్చింది. జేఈఈ మెయిన్స్ లో 820 మంది చీటింగ్ చేయడానికి రష్యన్ హ్యాకర్ మిఖైల్ షార్జిన్ దోహదపడినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. అంతే కాదు.. ఆ హ్యాకర్ ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకుంది. గత నెలలో జరిగిన జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ టెస్ట్ కు దేశ వ్యాప్తంగా దాదాపు తొమ్మది లక్షల మంది హాజరయ్యారు.
ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రిస్ట్రిక్టడ్డ్ కంప్యూటర్‌లలో మాత్రమే నిర్వహించినా రష్యన్ హ్యాకర్ ఈ వ్యవస్థనూ హ్యాక్ చేసినట్లు సీబీఐ దర్యాప్తు నిగ్గు తేల్చింది. రష్యన్ హ్యాకర్ సహకారంతో ఓ 920 మంది విద్యార్థులు తమ సహచరులతో రిమోట్ యాక్సెస్ చేసుకుని ఎంట్రన్స్ లో లబ్ధి పొందారు. అంటే రిమోట్ యాక్సెస్ ద్వారా ఈ విద్యార్థులు తమ పరీక్షను వేరే చోట కూర్చున్న వారి చేత రాయించారన్న మాట. అంటే పరీక్ష హాల్లో ఈ విద్యార్థుల కంప్యూటర్లను హ్యాక్ చేసిన రష్యన్ హ్యాకర్ ఆ యాక్సెస్ ను ఈ విద్యార్థుల తరఫున పరీక్ష రాయడానికి వేరే ఎక్కడో సిద్ధంగా ఉన్న వారికి ఇచ్చేశాడన్న మాట. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ 24 మందిని అరెస్టు చేశారు. సోనిపాట్‌లోని ఓ ఎగ్జామ్ సెంటర్‌లో ఈ రిమోట్ యాక్సెస్ జరిగినట్టు విసీబీఐ చెబుతోంది. కంట్రోల్ రిస్ట్రిక్టడ్ కంపూటర్లనే ఓ పాతికేళ్ల రష్యన్ ఐటీ నిపుణుడు హ్యాక్ చేసి.. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే జేఈఈ మెయిన్స్ ను అభాసుపాలు చేసేశాడు.
ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకే ససాక్ష్యంగా చెబుతోంది. అటువంటప్పుడు ఈవీఎంలు హ్యాకింగ్ కు గురికావన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. విద్యార్థుల యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని హ్యాక్ చెయ్యగలిగినప్పుడు.. ఒక్కో నియోజకవర్గంలో కొన్ని ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదా? సాధ్యం కాదని ఎలా చెప్పగలుగుతారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య ఈవీఎంలే కావాలన్న పట్టుదల ఎందుకు? పలు దేశాలు ఈవీఎంలు భద్రమైనవి కావని నిర్ధారణకు వచ్చి బ్యాలెట్ వైపు మళ్లినప్పుడు, దేశంలో అలా ఎందుకు చేయరు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనా, కేంద్ర ఎన్నికల సంఘం పైనా ఉందనడంలో సందేహం లేదు.