మధ్యాన్నం కల!
posted on Oct 6, 2022 @ 3:47PM
అనగనగా ఓ రాజ్యం. రాజుగారికి రోజూ తినే తిండి, గానాబజానాలు, భజనలు విసిగెత్తాయి. ఒకరోజు తెల్లా రగట్టే లేచి ఎవరూ చూడకుండా మారువేషంలో నగరంలోకి వెళ్లాడు. అప్పుడే పొలానికి పోతున్న రైతులు, దుకాణం తీసినళ్లూ రాజుగారి వ్యవహారశైలి పెద్దగా నచ్చడంలేదన్నదే మాట్లాడుకుంటున్నారు. పాత సినీమాల్లో ఎన్టీఓడులా చెట్టెనగ్గా ఉండి చెవులారా విని భవంతికి తిరిగి వచ్చాడు. ఆహా ఏమి ప్రజ నేనంటే నిజంగానే చాలా యిష్టంగా తిట్టుకుంటున్నారు. మంత్రి, సేనాధిపతిని మనస్పూర్తిగా చంపాలన్న ఆలోచ న చేశాడు. వీళ్లు దుర్మార్గులు అనుకున్నాడు. ఈ ప్రజల కోసం ఏదన్నా చేయాలని ఆలోచించాడు రాజు. అంతే వెంటనే గుర్రాన్ని మార్చాడు, డ్రస్ మార్చాడు, తలపాగా కూడా మార్చేసి తెల్లటి వస్త్రం ఒకటి తలకి చుట్టుకుని మంచి లాఠీలాంటి కర్ర చేతపట్టి రైతులా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్లా డు. అలా వెళ్లిన వాడు రెండురోజులు ఎవరికీ కనిపించలేదు. మూడో రోజు వచ్చి పతాకం రంగు మార్చి, నివాసం రంగు మార్చి పక్క రాజ్యంవాళ్లూ వీలయినంత హాశ్చర్యపడేలా వేరే గుర్రం మీద వేరే ప్రాంతాలకు వెల్లడానికి ముహూర్తం పెట్టుకున్నాడు.
బయలుదేరేముందు చిన్న మీటింగ్ పెట్టి సతీమణికి, సోదరుడుకి, కుమారుడికి చెప్పాలనుకున్నది చెప్పేసి వాల్లకి అర్ధం అయేలోపు గుర్రం ఎక్కి వెళిపోయాడు. అలా వెళ్లినాయన నేను మారాను, నా పతాకం పేరు, రంగూ మర్చాను.. ఇపుడు నేను మీ వాడిని కూడా అంటూ పక్క రాజ్యం తన రాజ్యం సరిహద్దు గ్రామంలో మైకులో అరిచినట్టు అరిచి మరీ చెప్పాడు. ముందుగా చూసిన నలుగురూ విన్నారు. వాళ్లేళ్లి అక్కడి గ్రామ పెద్దకి చెప్పారు. ఆయన ఎవుడో ఎర్రోడు అనుకున్నాడు చుట్టపీక అంచు కొరుకుతూ. కాదు నా మాట నమ్మండి అంటూ ఒక కబురు పెట్టాడు ఈ రాజుగారు.
ఇంతకీ అసలు సంగతేందబ్బాయ్.. అన్నాడు ఓ పండు ముసలాయన. ఏం లేదయ్యా.. మా రాజ్యం పరమ బోరింగ్‌గా ఉంది, మీ ఊళ్లో కొన్నాళ్లుండి, కొత్తదనం ఆస్వాదించాలనుకుంటున్నాను అన్నాడు రాజు. ఏ మీ రాజ్యంలో రాజుగారు పారిపోయాడా? వెతకడానికి ఈ దారంట బోతున్నావ్? అని అడిగాడు దుకాణం తలుపు తీస్తూ ఓ పెద్దాయన. అబ్బే అదేం లేదు.. ఆయన భేషుగ్గానే ఉన్నాడు. నాకే బోర్ కొట్టింది. అందు వల్ల నేనే ఆయనకు మారుగా కొత్తగా ఏదన్నా చేయాలనుకుంటున్నాను అన్నాడు. అంతే వెంటనే ఓ ముసలామె వచ్చి.. ఇయాల్టికి మా మేకల్ని తోలికెళ్లి చీకటిపడేతాల్కి తోల్కురా నాయనా.. గ్లాసుడు మజ్జిగ ఇత్తా అన్నది. మా రెండో సతీమణి కంటే వేయి రెట్టు నయం అనుకున్నాడు మారు వేషంలోని రాజు.
రాజు ఆ మధ్యాన్నం చింతచెట్టు కింద మంచినీళ్లు తాగుతూ కూచుని ఆలోచించాడు.. ఈ అమాయకు లకు ఏదయినా చేయొచ్చని. ఇక్కడి రాజు పెద్దగా పనిమంతుడు, తనలాగా తెలివిమంతుడయినా కాదని తెలు సుకున్నాడు. ఎలాగూ డ్రస్ మార్చుకున్నాగదా అని పేరు కూడా మార్చుకుని స్థిరపడితే ఎలా ఉం టుంద ని అనుకున్నాడు. అటుపక్కగా వెళుతున్న ఓ కుర్రాడిని పిలిచి, ఏమోయ్ ఇక్కడ, అదే మీ రాజ్యంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? సమయానికి అన్ని అందుబాటులో ఉంటున్నాయా? అని కొన్ని పిచ్చిప్రశ్నలు వేశాడు. అతను అనుమానంగా చూసి, రాజుగారున్నారు.. ఆయనే చూసుకుం టారు. మాకేం పని పాటా లేదు. నీక్కూడా లేకపోతే నా వెంట రా... పచారీ కొట్లో లెక్కలు రాసేవాడు పారి పోయాట్ట. మనం కుదుర్చుకుందాం.. ఏమంటారు? అని అడిగాడు. రాజుగారికి కోపం వచ్చింది. తలపాగా సద్దుకుని గుర్రం ఎక్కి వెళిపోయాడు.
కొంతదూరం వెళ్లాక బాగా ఆకలివేసి ఓ పేదరాసి పెద్దమ్మ గడప దగ్గర ఆగాడు. ఆమె పేరు, ఊరు అడిగిం ది. అన్నీ తప్పు చెప్పాడు. సరే ఆకలి మీదున్నాడుగా అని పెరుగన్నం ఒక అవకాయి బద్దతో తెచ్చి ముం దుంచింది. రాజుగారు తిని ఏం కావాలో కోరుకో అన్నాడు.. కోటలో దాసిని అడిగినట్టు. ఏడ్చినట్టుంది.. నేనే మైనా నీ పనిమనిషినా అలా అడుగుతున్నావ్? డబ్బులుంటే పది రూపాయలిచ్చి వెళ్లు అని కసురు కుంది. ఆ రాజ్యం అవతలి పొలిమేర దాటుతుంటే ఎవరో హిందీలో మాట్లాడుతూ కనిపించారు. చచ్చాం.. వేగం తెలియలేదు.. వేరే భాషవాల్ల దగ్గరికి వచ్చాను అనుకున్నాడు. ఇక్కడ భోజనం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు.. బోజనం క్యా హై.. అని విసుక్కుని వెళిపోయారు ఎదురుగా వచ్చినవారు. ఈయన వాలకం చూసి యే కౌన్ హై... బఫూన్ జైసే దౌడ్‌రే! అన్నారు. రాజుగారికి కోపంతో కూడిన బాధతో కూడిన పెద్ద నవ్వు వచ్చింది. చిర్నవ్వు నటించి మల్లీ వెనక్కి తిరిగాడు. గతంలొ ఓసారి మంత్రి అటుగా వెళ్లి తిట్లను పరమ ఆనందంగా విని వచ్చి చెప్పడం రాజుగారికి ఇంకా గుర్తు!
మంచం మీంచి ధభీమని పడ్డాడు.. రాజు! ఓర్నాయనో ఏదో అయింది.. అనుకుని భటులు, భజంత్రీలు వచ్చారు.. ఏమయింది రాజా అని అడిగారు.. ఏం లేదు.. చిన్న కలగన్నా! మీరు వెళ్లి మంత్రిని పిలుచు కు రండి అని పురమాయించారు రాజుగారు!
దేశాటనచేసి సాధించలేనిది ఉన్నపార్టీ జెండాకి రంగుమార్చకున్నా, పేరు మార్చి అదే మూడక్షరాలతో గొప్ప సందేశాత్మక విప్లవం తేవాలన్న ఆతృత కేసీఆర్‌కు బూమరాంగ్ అవుతుందా?