తెదేపా గూటికి కాసాని జ్ణానేశ్వర్
posted on Oct 15, 2022 5:50AM
కాసాని జ్ఞానేశ్వర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీసీ నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా పని చేసిన కసాని జ్ణానేశ్వర్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2007లో మన పార్టీ స్థాపించి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీసీ నేతగా ఆయనకు ఉన్న గుర్తింపు ప్రత్యేకం. ఆయన తెలుగుదేశం గూటికి చేరారు. కాసాని జ్ణానేశ్వర్ న తమ పార్టీలో చేరాల్సిందిగా తెరాస, బీజేపీలు కోరాయి.
మంత్రి హరీష్ రావు స్వయంగా జ్ణానేశ్వర్ నివాసానికి వెళ్లి మరీ తెరాసలోకి ఆహ్వానించారు. అలాగే ఈటెల కూడా బీజేపీ గూటికి రావాల్సిందిగా ఆయనను కోరారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈటెల ఆహ్వానాన్ని కాసాని మన్నిస్తారనీ, ఆయన కాషాయ కండువా కప్పుకుంటారనీ అంతా భావించారు.
అయితే అనూహ్యంగా కాసాని హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. కాసాని తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్ సిద్ధాంతాలతో పార్టీని తెలంగాణలో బలోపేతం చేద్దాం. సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టండి అని కాసానికి సూచించారు.