జగన్ తీరుతో పాలన అస్తవ్యస్తం.. భవిష్యత్ పై వైసీపీ నేతల అయోమయం
posted on Oct 15, 2022 @ 11:37AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరు కారణంగా వైసీపీ నేతలలో అయోమయం నెలకొంటోంది. దీంతో వారు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో.. ఏ అంశానికి ఎలా స్పందిస్తున్నారో వారికే తెలియన పరిస్థితి ఆవిష్కృతమౌతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తాను అమరావతికి వ్యతిరేకమని ఎన్నడూ అనలేదని చెప్పడమే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు.
తాను అమరావతికి వ్యతిరేకం కాదని అంటూనే వికేంద్రీకరణే మా లక్ష్యం అని చెప్పడం ఆయనలో నెలకొన్న అయోమయానికి, ఎటూ తేల్చుకోలేని సందిగ్ధతకు నిదర్శనంగా చెబుతున్నారు. మరో వైపు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం.. రాష్ట్రం నలుమూలలా మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటమౌతుండటంతో జగన్ తీరుతో తమ రాజకీయ భవిష్యత్ ఏమౌతుందన్న భయం, ఆందోళన వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పటికే మూడేళ్ల పాలనలో బటన్ నొక్కడం తప్ప మరో పని చేయలేదంటూ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ రేంజ్ లో వ్యక్తమౌతోందో గడపగడపకూ కార్యక్రమంలో కళ్లకు కడుతోంది.
అయితే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకూ కార్యక్రమంలో పడుతున్న ఇబ్బందులు, ఎదొర్కొంటున్న నిరసన సెగలనూ పట్టించుకోకుండా జగన్.. ఆ కార్యక్రమంలో చురుకుగా లేని వారికి వచ్చే ఎన్నికలలో టికెట్లు హుళక్కి అంటూ హెచ్చరికలు జారీ చేస్తండటంతో వారిలో నిరాశ, నిస్తేజం పెరిగిపోతున్నది. అయ్యేది కాక మానదు.. అన్న నైరాశ్యంతో అధినేత మాటలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే పరిస్థితికి వచ్చినట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి విషయంలో ఒకే సమయంలో రెండు విధాలుగా అంటే అమరావతికి మద్దతుగా, వ్యతిరేకంగా మాట్లడడాన్నిఈ సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. గడపగడపకూ సమీక్షలో జగన్ బొత్స తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బొత్స లాంటి సీనియర్ మంత్రికే ఉక్కపోత తప్పని విధంగా సీఎం జగన్ తీరు ఉందంటే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటో ఇట్టే అవగతం చేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే మూడున్నరేళ్ల సమయం గడిచిపోయింది. మరో ఏడాదిన్నరలో ( ముందస్తు లేకపోతే) మళ్లీ ప్రజల ముందుకు వెళ్లాలి. ఏం చేశామని, ఏం సాధించామని మరో సారి అవకాశం ఇవ్వాలంటే ప్రజలను ఓట్లు అడగగలమన్న ఆందోళన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనిపిస్తోంది.
రాజధాని అంశంలో స్థిరత్వం లేని జగన్ వైఖరిని ఇప్పుడు రాష్ట్రమంతా ప్రశ్నిస్తుంటే.. తమను మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజలలో ప్రచారం చేయాలని ఆదేశించడమేమిటని ఎమ్మెల్యేలు తమలో తాము మధన పడుతున్నారు. అమరావతే రాజధాని అంటూ రైతుల మహాపాదయాత్రను జనం నిరాజనాలు పలుకుతుంటే.. తాము ఆ మహాపాదయాత్రకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శనలు చేయాల్సిన పరిస్థితి తమను ప్రజలలో మరింత చులకన చేస్తున్నదని మధన పడుతున్నారు. ఈ విషయాన్ని పలువురు వైసీపీ నేతల అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేశారు. ఒక్క అమరావతే అని కాదు.. రాష్ట్రంలో ఏ వర్గం కూడా జగన్ పాలన పట్ల, తీరు పట్ల సంతృప్తిగా లేదని ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద అంగీకరిస్తున్న పరిస్థితి. గత ఎన్నికలలో తమ విజయంలో కీలక పాత్ర పోషించిన దాదాపు అన్ని వర్గాలలోనూ ఇప్పుడు అసంతృప్తి గూడుకట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అందుకు ఉదాహరణగా ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని చూపుతున్నారు. ఇక వ్యవసాయ మీటర్లకు మోటర్లు బిగించడంతో రైతులలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయంటున్నారు. థర్మల్ స్టేషన్లను అదానికి అప్పగించే కుట్ర, విశాఖలో భూ కబ్జా దందాలు.. ఇలా ఒకటనేమిటి.. జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రతి చర్య, ప్రతి నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటోందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూలా మారిన మూడు రాజధానుల అంశాన్నే తీసుకుంటే.. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా మూడు రాజధానులంటూ మొండిగా జగన్ ముందుకు వెళ్లడాన్ని ఎలా అర్దం చేసుకోవాలో అర్ధం కావడం లేదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఏ విధంగా చూసినా మూడు రాజధానుల నిర్ణయంతో ముందుకు సాగలేని పరిస్థితి నెలకొని ఉంటే.. ఏ ఉద్దేశంతో మూడు రాజధానులే ముద్దంటూ ముందుకు సాగాలన్నది అవగతం కావడం లేదని వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది.