మునుగోడు పై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ ఎందుకంటే?
posted on Oct 15, 2022 @ 3:30PM
ఉప ఎన్నికల దేముంది, వస్తుంటాయి, పోతుంటాయి. ఒక అసెంబ్లీ నియోజక వర్గంలో తెరాస ఓడిపొతేనో బీజేపీ గెలిస్తేనో ప్రభత్వం ఏమన్నా కూలిపోతుందా? ఉపఎన్నికల్లో గెలుపు ఓటములతో వచ్చేది లేదు. పోయేది లేదు.. ఈ మాటలన్నది ఎవరో గుర్తుందా ? ఎస్, ఇప్పడు మునుగోడులో తెరాస అభ్యర్ధి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే, నియోజక వర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆరే. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగానూ ఈ వ్యాఖ్య చేశారు. నిజానికి కేటీఆర్ ఇంతకు ముందు ఎప్పుడూ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన లేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఇజ్జత్’కి సవాల్ గా తీసుకుని బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలు కుమ్మరించి కొట్లాడిన హుజురాబాద్ హుజురాబాద్ ఉప ఎన్నిక విషయాన్నే తీసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్యనాయకులు హుజురాబాద్ ఉప ఎన్నికకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక విధంగా అవహేళనా చేశారు.
నిజానికి ఒక్క హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనే కాదు, అంతకు ముందు తర్వాత జరిగిన హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను కూడా కేటీఆర్ లైట్ గా తీసుకున్నారు. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కానీ అదే కేటీఆర్ మునుగోడు ఉపఎన్నికలో బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. పరుగులు తీస్తున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి కేసేఆర్ మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతను ఏ ఒక్కరికో అప్పగించలేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా సుమారు ఓ వంద మందికి మునుగోడులో పార్టీ అభ్యర్ధిని గెలిపించే బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడులో తమకు పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
తమ పరిధిలో మెజార్టీ ఓట్లు సాధించడం కోసం పని చేస్తున్నారు. మరో వంక మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డితో పాటుగా కేటీఆర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ సమన్వయ బాధ్యతలు మాత్రమే అప్పగించారు. అయినా, జిల్లా మంత్రిగా జగదీష్ రెడ్డి, ముందు నుంచి తమదైన పద్దతిలో ప్రచారం సాగిస్తున్నారు. మరో వంక హరీష్ రావు, ఇంకా పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రం ఏపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, మంత్రులకు, గడప గడపకు పరీక్ష పెడితే, తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెలకు మునుగోడు పరీక్ష పెట్టారు. సరే ఆ పరీక్షలో ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అనే విషయం పక్కన పెడితే, హుజురాబాద్ లో కూల్ గా ప్రచారానికి దూరంగా ఉన్న మంత్రి కేటీఅర్ మునుగోడు ఉప ఎన్నిక పై ఎందుకు దూకుడు పెంచారు? అదే సమయంలో హుజురాబాద్ బాధ్యత మొత్తం భుజానికి ఎత్తుకుని దూకుడుగా ప్రచారం సాగించిన హరీష్ రావు మునుగోడు విషయంలో ఎందుకో అంటీ ముట్టనట్లుగా ప్రకటనలకు మాత్రమే పరిమిత మయ్యారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం హాట్ టాపిక్‌గా మారింది.
అయితే దుబ్బాక హుజురాబాద్ వరస ఓటముల తర్వాత హరీష్ రావు ఇమేజ్ కొంత మేర డ్యామేజ్ అయ్యింది. అందుకే అంతవరకు ట్రబుల్ షూటర్ గా గుర్తించి కీలక బాధ్యతలను ఆయనకే అప్పగించిన కేసేఆర్, మునుగోడులో వ్యూహం మార్చి హరీష్, కేటీఆర్ ఇద్దరికీ సమన్వయ బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అదీ కాకుండా దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికకు చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ లాంటిదని ఇక్కడ ఓడిపోతే, బీజేపీని ఎదుర్కోవడం కష్టమవుతుందని అంటున్నారు. ఇక్కడ గెలిచి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదే అనే ప్రచారంతో దూసుకు పోయేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఈ ఉప ఎన్నికను తెచ్చింది.
ఈ క్రమంలో టీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంది. అందులో భాగంగానే, ఇప్పటికి కాకున్నా రేపటి అసెంబ్లీ ఎన్నికలలో తెరాస మరో మారు గెలిస్తే ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న కేటీఅర్ మునుగోడు మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని అంటున్నారు. అయితే మునుగోడు ఫలితం కేటీఆర్ కలలను నిజం చేస్తుందా? హుజురాబాద్’ రిపీట్ అవుతుందా చూడవలసి ఉందని అంటున్నారు.