పెద్ద నోట్ల రద్దుపై సమీక్షకు సుప్రీం ఓకే..!
posted on Oct 15, 2022 @ 10:34AM
ఆరేళ్ల కిందట దేశంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిన పెద్ద నోట్ల రద్దు చర్యపై సమీక్షకు సుప్రీం ఓకే చెప్పింది. అవినీతి నిర్మూలన, నల్ల ధనం వెలికితీత లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో (నవంబర్ 8, 2016) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా అన్న ప్రశ్నకు లేదనే సమాధానం నిర్ద్వంద్వంగా వస్తుందనడానికి ఈ ఆరేళ్లలో నల్లధనం రెండింతలు పెరగడమే.. అలాగే అవినీతి పెచ్చరిల్లడమే నిదర్శనం అని పరిశీలకులు అంటున్నారు.
పెద్ద నోట్ల రద్దు లక్ష్యంపై ప్రశ్నలు సంధించిన వారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేసే పరిస్థితి నేటికీ నెలకొని ఉంది. ఆరేళ్ల తరువాత కూడా ఇప్పటికీ పద్ద నోట్ల రద్దు ద్వారా సాధించిందేమిటీ, ఒనగూరిన ప్రయోజనం ఏమిటి అన్న విషయంలో కేంద్రం సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదు. అసలు నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు పార్లమెంటును కానీ, అఖిలపక్ష నేతలను కానీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యవహరించిన ప్రభుత్వం ఆ తరువాతనైనా ఎన్నడూ నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఒనగూరిన ప్రయోజనాలను జాతికి వివరించిన పాపాన పోలేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల జనం దేశంలో ప్రజల దైనందిన కార్య కలాపాలు గందరగోళంలో పడ్డాయో అందరికీ తెలిసిందే. దేశంలో నల్ల ధనాన్ని అరికట్టడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన మంత్రి మోడీ స్వయంగా పలు సార్లు తెలిపారు.
అయితే నోట్ల రద్దు వల్ల నల్లధనం అరికట్టడమన్న లక్ష్యం నెరవేరకపోగా... ఆ బెడద మరింత పెరిగింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం బెడిసి కొట్టిందని అధికార పార్టీకి చెందిన నాయకులే పలు సందర్భాలలో అంగీకరించారు. ఆ నిర్ణయం వల్ల చిన్న వ్యాపారులు, తోపుడు బండ్లపై పళ్ళు, కూరగాయలు వంటి నిత్యావసరాలను అమ్ముకునే రోజువారీ వ్యాపారులే ఎక్కువగా దెబ్బతిన్నారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ విషయంపై నిర్వహించిన పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలోనే పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై దాఖలైన పిల్ విచారణ సందర్బంగా సమీక్షకు సుప్రీం కోర్టు నిర్ణయించింది.
అలాగే పెద్ద నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితులు, పర్యవసానాలు, ఫలితాలపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్నీ, రిజర్వు బ్యాంకును ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులను, ముఖ్యమైన నిర్ణయాలను ప్రశ్నించకూడదన్న లక్ష్మణ రేఖ తమకు తెలుసుననీ, అయినా, దేశ ప్రజలను ప్రభావితం చేసిన ఈ నిర్ణయం గురించిన వివరాలను తెలుసుకుకోగోరు తున్నామని జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసు బ్రహ్మణ్యం, జస్టిస్ బీవీ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.